ముంపు .. ముప్పు
ABN , Publish Date - Jul 21 , 2024 | 01:33 AM
జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అనేక మండ లాల్లో ఇప్పటివరకు ఓ మోస్తరు నుంచి భారీగా వానలు కురిశాయి. దీంతో ఎగువ నుంచి వస్తు న్న వాన నీటితో జిల్లాలో అనేక మండలాల్లో వరి చేలు నీట మునుగుతున్నాయి.
వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా కొనసాగుతోన్న వర్షాలు
వరి చేలల్లోకి భారీగా చేరుతోన్న నీరు: పలు మండలాల్లో పంటలు మునక
నారుమడులు 82హెక్టార్లు, వరి చేలు 1,545హెక్టార్లలో మునిగినట్లు అంచనా
వాగులు,గెడ్డలను ఆనుకుని ఉన్న పత్తి, కూరగాయ పంటల్లోకి చేరుతున్న నీరు
అటు వర్షాలకుతోడు పెరిగిన ఈదురు గాలుల తీవ్రత: పడిపోయిన ఉష్ణోగ్రతలు
తుని-నర్సీపట్నం రహదారిలో ఈదురుగాలులకు నేలకొరిగిన భారీ వృక్షం
ఉప్పాడ తీరప్రాంతంలో మత్స్యకారులు తాటాకిళ్లు పైకప్పులు ఎగిరిపోయిన వైనం
శనివారం మరింత అల్లకల్లోలంగా సముద్రం: బీచ్‌రోడ్డును తాకిన కెరటాలు
ఎగువన కురుస్తున్న వర్షాలతో రిజర్వాయర్లకు జలకళ: నిండుకుండలాచెరువులు
(కాకినాడ-ఆంధ్రజ్యోతి)
జిల్లావ్యాప్తంగా మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. అనేక మండ లాల్లో ఇప్పటివరకు ఓ మోస్తరు నుంచి భారీగా వానలు కురిశాయి. దీంతో ఎగువ నుంచి వస్తు న్న వాన నీటితో జిల్లాలో అనేక మండలాల్లో వరి చేలు నీట మునుగుతున్నాయి. కాలువలు, చెరువులకు సమీపంలో ఉన్న చేలల్లోని వాన నీరు అంతకంతకు పెరుగుతోంది. పల్లపు ప్రాంతా ల్లోని పొలాల్లోకి శనివారం మరింత నీరు చేరింది. దీంతో అవన్నీ నీట మునుగుతున్నాయి. ప్రస్తు తం వరి పంట నారుమళ్లు, పిలకదశలో ఉంది. ఈ నేపథ్యంలో చేలల్లోకి వచ్చి చేరుతున్న కొద్ది పాటి నీరుకు సైతం మునిగిపోతున్నాయి. జిల్లా వ్యవసాయశాఖ ఇప్పటివరకు మండలాల వారీ గా ప్రాథమికంగా సేకరించిన సమాచారం మేరకు మొత్తం 82 హెక్టార్లలో నారుమళ్లు నీటము నిగాయి. ఇదికాకుండా మరో 1,545 హెక్టార్లలో వరి చేలు నీట మునిగినట్టు గుర్తించారు. అలాగే వాణిజ్య పంటలైన పత్తి, ఇతర కూరగాయ పంటలు కూడా స్వల్పంగా నీట మునిగినట్టు అం చనా వేశారు. అయితే వర్షాలు ఇంకా కొనసాగే అవకాశం ఉండడం, ఎగువ నుంచి నీరు భారీగా వస్తుండడంతో ముంపు ముప్పు మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా శనివారం తెల్లవారుజాము నుంచీ ఈదురుగా లులు పెరిగాయి. ముఖ్యంగా సముద్రం అల్లకల్లోలంగా మారింది. గాలుల తీవ్రత సముద్రంలో అధికంగా ఉండడంతో తీరంలో కెరటాలు భారీగా ఎగసిపడ్డాయి. ఉప్పాడ తీరప్రాంతంలో పలు వురి మత్స్యకారుల తాటాకిళ్లు పైకప్పులు ఎగిరిపోయాయి. తునిలో ఓ పూరిల్లు నేలమట్టమైంది. కాగా సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో మూడోరోజు పోర్టులో బియ్యం ఎగుమతులు నిలిచి పోయాయి. ఎనిమిది విదేశీనౌకలు పోర్టులోనే ఉండిపోయాయి. మరోపక్క మూడు రోజులుగా వానలు పడుతుండడడం, ముసురు నెలకొని ఉండడంతో శనివారం పగటి ఉష్ణోగ్రతలు 23 డిగ్రీ లకు పడిపోయి కొంత చలి వాతావరణం నెలకొంది. ఇదిలాఉంటే జిల్లావ్యాప్తంగా అటు ఎడ తెరిపిలేని వానలు, ఎగువ నుంచి వస్తున్న భారీ వాన నీటితో జిల్లాలో సుబ్బారెడ్డిసాగర్, ఏలేరు, పంపా రిజర్వాయర్లు జలకళ సంతరించుకుంటున్నాయి. అటు తాండవ నదికి సైతం ఎర్రనీరు పోటెత్తుతోంది. ప్రస్తుతం జిల్లాలో మూడు రిజర్వాయర్లలోను చాలినంత నీరు లేక వెలవెలబోతున్నాయి. తాజా వర్షాలతో భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీంతో తాగు, సాగు నీటి బెంగతీరినట్టయింది.
సముద్ర తీరంలో ఈదురుగాలులు.. అలల ఉధృతి
ఉప్పాడ (కొత్తపల్లి)/తొండంగి, జూలై20: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉప్పాడ తీరంలో సముద్ర కెరటాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. శనివారం తెల్లవారుజాము నుంచి తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీచాయి. దీంతో మాయాపట్నంలో సముద్రం ఒడ్డున ఉంటున్న మత్స్యకారులకు చెందిన నాలుగు తాటాకు ఇళ్లు కప్పులు గాలిలోకి ఎగిరిపోయా యి. సముద్ర కెరటాలు సాధారణ స్థాయి నుంచి రెండు మీటర్ల ఎత్తులో ఎగసిపడుతున్నాయి. దీంతో మాయాపట్నం, సూరాడపేట మత్స్యకార గ్రామాల్లో సముద్ర జలాలు మత్స్యకారుల ఇళ్ల ముంగిట్లోకి వస్తోంది. తొండంగి మండలం అద్దరిపేట నుంచి చోడిపల్లిపేట వరకూ తీరం వెంబడి ఈదురుగాలులు పెద్దఎత్తున వీచాయి. సముద్ర జలాలు రంగుమారి అల్పపీడన ప్రభావాన్ని చూపుతున్నాయి. మత్స్యకారులు వేటకు వెళ్లకుండా తెప్పల్ని సురక్షిత ప్రాంతానికి చేర్చుకున్నారు.
‘ఏలేరు’కు జలకళ..రైతుల కష్టాలకు తెర
జగ్గంపేట, జూలై 20: ఏలేరు ప్రాజెక్టుకు జలకళ వచ్చేసింది. గత వారంలో మూడు టీఎంసీల నీరు ఉంటే ఇప్పుడు ఏడు టీఎంసీలకు చేరింది. రైతులకు నీరందించడం కోసం పురుషోత్తపట్నం ఫేజ్2 నుంచి గోదావరి జలాలను పైపులైన్ల ద్వారా ఏలేరుకు తరలిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు భారీ వర్షాల కారణంగా ఏజెన్సీ ప్రాంతాల నుంచి ఏలేరు ప్రాజెక్టుకు నీరు పరవళ్లు తొక్కడంతో ప్రస్తుతం 6.8 టీఎంసీల నీరు నిల్వకు చేరింది. రెండు విధాలుగానూ సాగునీరు అందే పరిస్థితి రావడంతో రైతులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. ఈసారి ముందస్తుగానే వ్యవసాయ పనులు చేసుకునే అవకాశం ఏర్పడిందని చెబుతున్నారు. పుష్కర జలాలను ఏలేరుకు అందించడంతో తాగునీటికీ ఇబ్బందుల్లేవు.
వీడని వాన.. తాండవ ఉరకలు
తుని రూరల్, జూలై 20: ముసురు వీడలేదు. శనివారం కూడా వర్షం ఎడతెరిపిలేకుండా కురిసింది. నాలుగు రోజుల నుంచి వర్షం పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బంది కలిగింది. అటు లోతట్టు ప్రాంతాలు జలమయ్యాయి. ఎగువున కురుస్తున్న వర్షాలతో తాండవ నది ఉధృతంగా ప్రవహిస్తోంది. తుని వద్ద డ్యాం పొంగిపొర్లుతోంది. తామవరం, హంసవరం, తేటగుంట, తదితర గ్రామాల్లో పత్తి, కూరగాయల పంటలు మునిగాయి.
సుబ్బారెడ్డి సాగర్‌కు జలకళ
ప్రత్తిపాడు, జూలై 20: కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఈ గోకవరం గ్రామంలో మీడియం ఇరిగేషన్ ప్రాజెక్టు సుబ్బారెడ్డి సాగర్‌కు జలకళ వచ్చింది.దీంతోపాటు చంద్రబాబుసాగర్ ప్రాజెక్టు, సాగునీటి చెరువులకు కూడా భారీగా వర్షపునీరు చేరింది. కాగా ఒమ్మంగి గ్రామంలో సగరపు పాపకు చెందిన పెంకుటిల్లు భారీ వర్షాలకు దెబ్బతిందని వీఆర్వో తెలిపారు.
నేలకొరిగిన పెంకుటిల్లు
తుని రూరల్, జూలై 20: ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాని కి తుని పట్టణం 17వ వార్డులో పెంకుటిల్లు నేలకొరిగింది. దుర్గపు సత్యవతికి చెందిన ఈ పెంకుటిల్లుని టీడీపీ నాయకులతో కలిసి వీఆర్వో అనిత పరిశీలించారు. ఈ నివేదికను తహశీ ల్దార్‌కు అందజేయనున్నారు.