తల్లులకు షాక్!
ABN , Publish Date - May 26 , 2024 | 01:17 AM
కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులు ఎంత మొత్తమైనా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేస్తాం. వారు కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లిస్తారు. ఇదంతా జగనన్న విద్యాదీవెనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం అంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది.
విద్యాదీవెన సొమ్ములు కళాశాలలకు జమ చేయలేదంటూ నోటీసులు
ఇప్పటికే ఫీజులు చెల్లించామంటున్న తల్లిదండ్రులు
ప్రభుత్వ వైఖరిపై మండిపాటు
(పిఠాపురం)
కళాశాలలకు చెల్లించాల్సిన ఫీజులు ఎంత మొత్తమైనా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు వేస్తాం. వారు కళాశాలకు వెళ్లి ఫీజులు చెల్లిస్తారు. ఇదంతా జగనన్న విద్యాదీవెనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసం అంటూ వైసీపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంది. సీన్‌కట్ చేస్తే ఫీజుల వాయిదాలను నెలలు, సంవత్సరా ల తరబడి జాప్యంతో కళాశాలల నుంచి విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పుడు తాజాగా విద్యార్థుల తల్లులకు ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. మీకు జగనన్న విద్యాదీవెన సొమ్ములు పడినా కళాశాలలుకు చెల్లించలేదంటూ నోటీసులు జారీచేసింది. మేము ఫీజులు ఎప్పుడో చెల్లించేశాం అంటూ విద్యార్థుల తల్లిదండ్రుల్లో అత్యఽదికులు నోటీసులపై మండిపడుతున్నారు. విద్యాదీవెన పథకం ద్వారా వృత్తి విద్యాకోర్సులు, బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ, నర్సింగ్, ఎంబీబీఎస్, డిగ్రీ, బీఫార్మసీ, అగ్రికల్చ ర్ బీఎస్సీ, బీఈడీ సహా అన్ని రకాల కోర్సులు చేసే విద్యార్థులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వమే భరిస్తుందని, ఎంత మొత్తమైనా గరిష్ఠ పరిమితి లేకుండా చెల్లిస్తామని వైసీపీ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఇక్కడ మెలిక పెట్టింది. ఫీజు మొత్తాలను విద్యార్థులు చదువుతున్న కళాశాలలకు కాకుండా వారి తల్లుల ఖాతాలకు జమ చేస్తామని ప్రకటించిం ది. విద్యార్థుల తల్లిదండ్రులు తమ చేతులు మీదుగా ఫీజులు చెల్లిస్తే కళాశాలలో విద్యాబోధన, ఇతర సౌకర్యాలు తదితర అంశాలపై ప్రశ్నించే వీలుంటుందని, తద్వారా జవాబుదారీతనం ఏర్పడుతుందని ప్రభుత్వం గొప్పలు చెప్పింది. అయితే ఫీజుల జమలో నెలలు, సంవత్సరాల తరబడి జాప్యంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
గతంలో కళాశాలకు నేరుగా..
విద్యాదీవెన కొత్త పథకం కాదు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కళాశాలల్లో చదివే విద్యార్థుల పూర్తి ఫీజులను ప్రభుత్వమే భరించేది. దీనిని ఫీజు రీఎంబర్స్‌మెంట్ పథకంగా వ్యవహరించేవారు. ఇందుకుగాను అప్పటి టీడీపీ సర్కారు నిబంధనల విషయంలో ఉదారంగా వ్యవహరించేది. ఆయా కళాశాలల్లో చదివే విద్యార్థుల వివరాలను తీసుకుని ప్రభుత్వమే నేరుగా కళాశాలలకు ఫీజు మొత్తాలను చెల్లించేది. ఏ విద్యా సంవత్సరం మొత్తాలు అదే సమయంలో కళాశాలలకు అందేవి. ఇందులో విద్యార్థుల ప్రమేయం ఉండేది కాదు. ఇది ప్రభుత్వం, కళాశాలల మధ్య వ్యవహారంగా ఉండేది. అయితే వైసీపీ సర్కారు వచ్చిన తర్వాత దీనిని పూర్తిగా మార్చివేసింది. కళాశాలలకు నేరుగా నిధులు ఇవ్వకుండా తన రాజకీయ లబ్ధి కోసం తల్లుల ఖాతాలకు నిధులు జమచేసి అక్కడ నుంచి కళాశాలలకు చెల్లించేవిధంగా నిబంధనలు సడలించారు. దీంతో ఫీజుల వ్యవహారం కళాశాలలు, విద్యార్థుల మధ్య విషయంగా మారిపోయింది. ఇక విద్యాదీవెన సొమ్ములు విడుదలలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేయ డం కోర్సులు పూర్తిచేసిన విద్యార్థులకు శాపంగా మారింది. కోర్సు పూర్తయినా ప్రభుత్వం ఫీజు మొత్తాలను విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమచేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. దీంతో గత రెండేళ్లలో పలువురు కోర్పు పూర్తిచేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలో కళాశాలలు ఇబ్బందులకు గురిచేశాయి. ఈ వ్యవహారంతో పలువురు విద్యార్థులు మనస్తాపాలకు గురై ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలు రాష్ట్రంలో చోటు చేసుకున్నాయి. 2023-24 విద్యాసంవత్సరానికి సంబంధించి విద్యాదీవెన మొదటి విడతను గతేడాది అక్టోబరులో విడుదల చేయాల్సి ఉం డగా, అయిదు నెలల ఆలస్యంగా ఈ ఏడాది మార్చి 1వ తేదీన సీఎం జగన్ బటన్ నొక్కి విడుదల చేశారు. దీంతో అప్పటినుంచి కళాశాలలు ఫీజులు చెల్లించాలంటూ విద్యార్థుల తల్లిదండ్రులను ఒత్తిడి చేయడం ప్రారంభించాయి. నిధులు మాత్రం తల్లుల ఖాతాల్లో పడలేదు. రెండున్నర నెలల తర్వాత గవర్నర్ జోక్యంతో ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. జిల్లాలో 41,474 మంది విద్యార్థులకు సంబంధించి 37,196 మం ది తల్లుల ఖాతాలకు రూ.28.84 కోట్లు విడుదలయ్యాయి.
ఇప్పుడు నోటీసులు
ఎన్నికలు అయ్యేవరకూ మాట్లాడని ప్రభుత్వం ఇప్పుడు నోటీసులు జారీచేస్తూ విద్యార్థుల తల్లులను అందోళనకు గురిచేస్తోంది. 2019-20 విద్యాసంవత్సరం నుంచి ఇప్పటివరకూ విద్యాదీవెన కింద విడుదల అయిన సొమ్ములు వివరాలు, జమైన బ్యాంకు ఖాతాలు పేర్కొంటూ ఆ సొమ్ములు మీరు కళాశాలలకు జమచేయలేదని చెబుతూ గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా నోటీసులు జారీచేస్తున్నారు. మీ ఖాతాలకు వచ్చిన సొమ్ములను వారం, పదిరోజుల్లోగా కళాశాలలకు చెల్లించాల్సి ఉందని, మీరు తక్షణం ఆ సొమ్ములను కళాశాలలకు చెల్లించి రశీదులను సచివాలయ వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషనల్ సెక్రటరీకి అందజేయాలని ఆ నోటీసుల్లో సూచిస్తున్నారు. కళాశాలలకు ఫీజులు చెల్లించకపోతే విద్యాదీవెన లక్ష్యం నెరవేరదని అందులో పేర్కొన్నారు. విద్యాదీవెన సొమ్ములు కళాశాలలకు చెల్లించారా లేదా అనే అంశంపై సచివాలయ సిబ్బంది ద్వారా నిర్వహించిన సర్వేలో వెల్లడైన అంశాల ఆధారంగా ఈ నోటీసులను ఆయా జిల్లా అధికారుల పేరు మీద జారీచేశారు. అయితే నోటీసులు జారీ అయిన తల్లుల్లో 70-80 శాతం మంది ఇప్పటికే కళాశాలలకు ఫీజు లు చెల్లించిన వారు ఉండడం గమనార్హం. ఇదే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆగ్రహానికి కారణమైంది. తాము ఎప్పుడో కళాశాలలకు ఫీజులు చెల్లించామని, ఇప్పుడు నోటీసులు ఇవ్వడం ఏంటని మండిపడుతున్నారు. 2019- 20 విద్యా సంవత్సరానికి సంబంధించి విద్యాదీవెన సొమ్ములు 2022 డిసెంబరు 30 నుంచి 2023 జనవరి 6 వరకూ పడ్డాయి. సొమ్ములు పడడం ఏడాదిన్నరకు పైగా ఆలస్యం అయిన నేపథ్యంలో పలువురు తల్లిదండ్రులు తమ సొంత సొమ్ములు చెల్లించారు. కోర్సు పూర్తయిన వారికి సొమ్ములు చెల్లించిన తర్వాతే కళాశాలలు సర్టిఫికెట్లు ఇచ్చాయి. ప్రభుత్వమే విద్యాదీవెన సొమ్ములు ఆలస్యం చేస్తూ ఫీజులు ముందుగా చెల్లించని వారికి నోటీసులు ఇవ్వడం విస్మయం కలిగిస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణాల్లో పదుల సంఖ్యలో విద్యార్థుల తల్లులకు నోటీసు లు అందజేశారు. అక్కడక్కడ ఇంకా ఫీజులు చెల్లించనివారు ఉన్నారని, వారిని గుర్తించి వారికి నోటీసులు ఇస్తే సరిపోతుందని, చెల్లించిన వారికీ నోటీసులు ఇవ్వడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.