Share News

అరాచక పాలన పోవాలి.. అభివృద్ధి గెలవాలి

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:49 AM

రాష్ట్రంలో ప్రస్తుతమున్న అరాచక పాలన పోవాలని, మన పిల్లల భవిష్యత్‌, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించుకోవాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) అన్నారు.

అరాచక పాలన పోవాలి.. అభివృద్ధి గెలవాలి
చాగల్లు కార్యక్రమంలో మాట్లాడుతున్న అచ్చిబాబు

  • టీడీపీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య

చాగల్లు, ఏప్రిల్‌ 18: రాష్ట్రంలో ప్రస్తుతమున్న అరాచక పాలన పోవాలని, మన పిల్లల భవిష్యత్‌, రాష్ట్ర అభివృద్ధి కోసం టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిని గెలిపించుకోవాలని టీడీపీ సీనియర్‌ నాయకుడు పెండ్యాల అచ్యుతరామయ్య (అచ్చిబాబు) అన్నారు. గురువారం చాగల్లులో జరిగిన కార్యక్రమంలో కమ్మ కార్పొరేషన్‌ రాష్ట్ర డైరెక్టర్‌ కొఠారు అశోక్‌బాబా, వైసీపీ నాయకులు లకంసాని శ్రీనివాసరావు, కొఠారు శ్రీనివాసరావు, కట్టా స్వామి గౌడ్‌, కొఠారు శివరామకృష్ణ సహా మండలంలోని సుమారు 50 మంది వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరిని అచ్చిబాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్‌ అమ్మకాలు పెరిగిపోయాయని, మన పిల్లల భవిష్యత్‌ నాశనం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంతి అయితేనే మన భవిష్యత్‌, రాష్ట్ర ప్రగతి బాగుంటుందన్నారు. కూటమి నియోజకవర్గ అభ్యర్థి ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత తెలుగుదేశం పార్టీదేనని, వాటిని మరింత రెట్టింపు చేసి కొనసాగిస్తామని, పథకాలు తీసేస్తారనే తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కొఠారు అశోక్‌బాబా మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని కావాలని, పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని, అందుకోసం చంద్రబాబు గెలవాలని టీడీపీలో చేరినట్టు చెప్పారు. పదవులు ముఖ్యం కాదని సామాన్య కార్యకర్తగా కొనసాగుతానని ప్రజలకు అభివృద్ధి సంక్షేమం కావాలన్నారు. కార్యక్రమంలో కొవ్వూరు అర్బన్‌ బ్యాంక్‌ అద్యక్షుడు మద్దిపట్ల శివరామకృష్ణ, టీడీపీ నాయకులు ఆళ్ల హరిబాబు, నాదెళ్ల శ్రీరామ్‌చౌదరి, కరుటూరి సతీష్‌, మద్దిపాటి వీరరాఘవులు, కేతా సాహెబ్‌, దొంగ రామకృష్ణ, జనసేన నాయకులు పీకే రంగారావు, ఉప్పుటూరి చిరంజీవి, కొప్పాక విజయకుమార్‌, బీజేపీ నాయకుడు గ్రంధి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల వర్తక సంఘం ఆధ్వర్యంలో అచ్చిబాబు సహా వేదికపైన ఉన్న ప్రముఖులను సన్మానించారు. వర్తక సంఘం నాయకులు ఎం వెంకన్న, పచ్చిపులుసు ప్రసాద్‌, అంబటి అబ్బులు, సుభాష్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 19 , 2024 | 12:50 AM