Share News

నిలిచిన మీ సేవలు

ABN , Publish Date - Jun 11 , 2024 | 12:53 AM

ఐటీ సర్వర్లు హోల్డ్‌లోకి వెళ్లడంతో ఎక్కడికక్కడ మీసేవల్లో సేవలు నిలిచిపోయాయి.

నిలిచిన మీ సేవలు

రాజమహేంద్రవరం సిటీ, జూన్‌ 10 : ఐటీ సర్వర్లు హోల్డ్‌లోకి వెళ్లడంతో ఎక్కడికక్కడ మీసేవల్లో సేవలు నిలిచిపోయాయి. విజయవాడ ఎస్‌డీసీ డాటా సెంటర్‌లో సర్వర్ల సమస్య, నెట్‌ వర్క్‌ ఇష్యూలతో రాష్ట్రంలో మీసేవలు బంద్‌ అయ్యాయి. గత ఐదేళ్లుగా మీ సేవల నిర్వాహకులు చాలా ఇబ్బందులు పడ్డా రు. ఎందుకంటే సచివాలయాల ద్వారా కొన్ని సేవలను చేయడంతో మీసేవలకు వివిధ సర్వీసులు అందించే అవకాశం లేకుండా నిర్వహణ కష్టతరమైంది. ఎలక్షన్‌ నోటిఫికేషన్‌ విడుదలయ్యాక మీసేవల వద్ద ప్రజలు వివిధ సేవలకు క్యూకట్టారు. అప్పట్లో ముఖ్యమంత్రి జగన్‌ ఫొటోతో ఉన్న సర్టిఫికెట్లు నిలుపుదల చేసి రాజదముద్రతో సర్టిఫికెట్లు జారీ మొదలు పెట్టారు. కేవలం వారం రోజులు మాత్రమే ఈ విధమైన సేవలందించారు. పరిస్థితి సాధారణ స్థితికి చేరుకుందనుకునేలోగా విజయవాడలో ఐటీ, ఏపీ ఫైబర్‌ నెట్‌ కార్యాలయంపై ప్రభుత్వ తనిఖీలు చేపట్టడంతో ఐటీ సర్వర్లు హోల్డ్‌లోకి వెళ్లాయి. ఫలితంగా మీసేవలో సేవలు ఆగాయి. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ,ప్రైవేట్‌ నిర్వహణలో సుమారు 400పైబడి మీసేవ కేంద్రాలు ఉన్నాయి.గత ఐదేళ్లుగా ప్రభుత్వ నిర్వహణలో ఉన్న సెంటర్లు మినహా, నిరుద్యోగులు ఉపాధి కోసం ప్రైవేట్‌గా ఏర్పాటు చేసుకున్న మీ సేవ సెంటర్లు మాత్రం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాయి. అనేక సేవలు సచివాయలకు బదలాయించడంతో మీసేవ కేంద్రాలు వెలవెలబోయాయి. ఎన్నికల్‌ కోడ్‌ అమల్లోకి వచ్చాక కాస్తఊరట చెంది సర్వీసులు అందిస్తున్న మీసేవ నిర్వాహకులకు ఇప్పుడు ఐటీ హోల్డ్‌లోకి వెళ్లి సేవలకు అటంకం ఏర్పడింది. కేవలం రెండు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు చెప్పారు. ఇప్పటికి పదిరోజులైనా పరిష్కరించలేదు. దీంతో మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఇబ్బందులు పడుతున్నారు. సర్వర్ల సమస్య ఎప్పటికి పరిష్కారమ వుతుందో అని మీసేవ కేంద్రాల నిర్వాహకులు ఎదురుచూస్తున్నారు. కూటమి అధికారంలోకి రావడంతో మళ్లీ చంద్రబాబు సీఎంగా సర్వీసులన్నింటిలో మార్పులు తీసుకురావాల్సి ఉంది. దీంతో మొత్తం సాప్ట్‌వేర్‌లను అధికారులు అప్‌డేట్‌ చేస్తున్నారు. దీంతో సర్వర్లు హోల్డ్‌లో పెట్టారు.

Updated Date - Jun 11 , 2024 | 12:53 AM