పెళ్లిరోజునే కడతేర్చాడు
ABN , Publish Date - Mar 01 , 2024 | 12:04 AM
అగ్నిసాక్షిగా తాళికట్టి ఎనిమిదేళ్లయ్యింది. వారికి ముత్యాల్లాంటి ఇద్దరు సంతానం. ఎనిమిదేళ్ల తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పెళ్లి రోజునే అనుమానం పెనుభూతమై భార్యను అత్యంత కిరాతకంగా నరికి హతమార్చాడో కసాయి భర్త.
కాకినాడలోని జగన్నాథపురంలో కిరాతకం
అనుమానమే పెనుభూతమై
భర్త చేతిలో భార్య హతం
కాకినాడ క్రైం, ఫిబ్రవరి 29: అగ్నిసాక్షిగా తాళికట్టి ఎనిమిదేళ్లయ్యింది. వారికి ముత్యాల్లాంటి ఇద్దరు సంతానం. ఎనిమిదేళ్ల తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకునే పెళ్లి రోజునే అనుమానం పెనుభూతమై భార్యను అత్యంత కిరాతకంగా నరికి హతమార్చాడో కసాయి భర్త. ఈ సంఘటన గురువారం పట్టపగలు కాకినాడలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... స్థానిక జగన్నాధపురం, పప్పులమిల్లు సమీపంలోని శ్రీరాంనగర్‌కు చెందిన బొందల దివ్య (26)కు భర్త నూకరాజు, ఫస్ట్‌క్లాస్ చదువుతున్న కుమారుడు ఏడేళ్ల నిహార్, ఎల్‌కేజీ చదువుతున్న నాలుగేళ్ల కుమార్తె నిస్సీ ఉన్నారు. వారిది ఉమ్మడి కుటుంబం కాగా నూకరాజు రేకుల షెడ్‌లకు సంబంధించిన ఫ్యాబ్రికేషన్ వర్కర్‌గా పనిచేస్తుంటాడు. ఎంతో అనోన్యంగా సాగిన వారి దాంపత్య జీవితంలో అనుమానమనే బీజం నూకరాజు మనస్సులో నాటింది. దానికితోడు అతను తాగుడికి బానిసై తన భార్యను తరచూ మానసికంగా శారీరకంగా హింసించసాగాడు. అయినా దివ్య తన ఇద్దరు పిల్లల కోసం తన భర్త పెట్టే బాధలను దిగమింగుకుంటూ సంసారాన్ని ఈదసాగింది. గురువారం ఆ భార్యాభర్తల ఎనిమిదో పెళ్లిరోజు రానే వచ్చింది. ఎన్నో తీపి జ్ఞాపకాలతో భర్తతో గడుపుదామనుకున్న దివ్యకు ఆమె భర్త మృగంలా ఎదురుపడ్డాడు. ఉదయం బయటకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి తన భార్యపై అకారణంగా పిడుగుద్దులు కురిపించాడు. ఆ దాడిని ఆమె తట్టుకోలేక ఇంటి నుంచి బయటకు పరుగుపెడుతుండగా నూకరాజు తనతో తెచ్చుకున్న పదునైన వేట కత్తితో ఆమెను వెంబడించి విచక్షణా రహితంగా ఆమె మెడపై నరికాడు. అదే సమయంలో దివ్య తోటికోడలు తల్లి అడ్డుపడడంతో ఆమెపై కూడా నూకరాజు కత్తితో దాడి చేశాడు. దాంతో ఆమె చేతి వేళ్లు రెండు తెగిపడ్డాయి. దివ్య మెడ భాగం సగం తెగిపోవడంతో ఆమె గిలగిలా తన్నుకుంటూ తీవ్ర రక్త స్రావంతో కుప్పకూలి తనువుచాలించింది. సమాచారం అందుకున్న వన్‌టౌన్ సీఐ వాడవెల్లి సురేష్‌బాబు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జీజీహెచ్ మార్చురీకి తరలించారు. అయితే స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చిన పిల్లలు ఇద్దరు అమ్మ అన్నం పెట్టమ్మ అంటూ విగతజీవురాలైన దివ్యను అడుగుతుండడం చూపరుల కంట తడిపెట్టించింది. ఓ పక్క తల్లి లేక మరో పక్క తండ్రి జైలుకు వెళ్లడంతో ఆ చిన్నారుల పరిస్థితి అగమ్య గోచరమైంది. వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.