Share News

మేజర్‌, మైనర్‌ డ్రైనేజీల్లో పూడిక తొలగించాలి

ABN , Publish Date - May 29 , 2024 | 12:56 AM

రాజమహేంద్రవరంలో మేజర్‌, మైనర్‌ డ్రైనేజీల్లో పూడికను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ శానిటేషన్‌ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన, ట్రైనీ కలెక్టర్‌ భావనతో కలిసి నగరంలో పూడిక తీత పనులను పరిశీలించారు.

మేజర్‌, మైనర్‌ డ్రైనేజీల్లో పూడిక తొలగించాలి
కాలువలో పూడిక తీత పనులు పరిశీలన చేస్తున్న కమిషనర్‌ దినేష్‌కుమార్‌, ట్రైనీ కలెక్టర్‌ భావన

రాజమహేంద్రవరం సిటీ, మే 28: రాజమహేంద్రవరంలో మేజర్‌, మైనర్‌ డ్రైనేజీల్లో పూడికను వెంటనే తొలగించాలని నగరపాలక సంస్థ కమిషనర్‌ దినేష్‌కుమార్‌ శానిటేషన్‌ సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం ఆయన, ట్రైనీ కలెక్టర్‌ భావనతో కలిసి నగరంలో పూడిక తీత పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానిక 28వ డివిజన్‌లో మేజరు డ్రైన్‌లో రాతి చానల్లో యంత్రం ద్వారా జరుగుతున్న డీసిల్టేషన్‌ పనులను, హిందూ సమాజం వీధి, డిలక్స్‌ సెంటర్‌, స్టేడియం రోడ్డు ప్రాంతాల్లో జరుగుతున్న డిసిల్టేషన్‌ పనులను పరిశీలించారు. సిల్ట్‌ను పూర్తిస్థాయిలో తొలగించి ముంపు సమస్యను నివారించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ జూన్‌ మొదటి వారంలో నైరుతి రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెలాఖరు నాటికి పూడిక తీత పనులు పూర్తి చేసి మురుగునీటి పారుదలకు ఆటకం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎమ్‌హెచ్‌వో డాక్టర్‌ వినూత్న, శానిటరీ సూపర్‌వైజర్‌ ఐ.శ్రీనివాసరావులను ఆదేశించారు. తొలుత వారు జడ్జి బంగ్లా వాటర్‌ ట్యాంక్‌ల వద్ద ఉన్న 25వ క్లస్టర్‌ మస్తర్‌ ఆఫీసుకు వెళ్లి మస్తరు నిర్వహణ, పారిశుఽధ్య కార్మికుల హాజరును పరిశీలించారు. ఉదయం 6గంటలకు అందరూ పారిశుధ్య కార్మికులు క్షేత్రస్థాయిలో పనులు ప్రారంభించాలన్నారు. అనంతరం వెహికల్‌ యార్డుకు చేరుకున్న కమిషనర్‌ అక్కడ పారిశుధ్య వాహనాలు రికార్డులను డ్రైవర్ల మస్తరును పరిశీలించారు. నిర్ణీత సమయానికి వాహనాలు అన్ని వార్డుల్లోకి వెళ్లిపోవాలని ఆదేశించారు. అక్కడ నుంచి 10వ డివిజన్‌లో ఎల్‌ఐసీ ఆఫీసు వద్ద గార్బేజ్‌ ట్రాన్స్‌ఫర్‌ పాయింట్‌ను పరిశీలించారు. 14వ డివిజన్‌లో రోడ్డు స్వీపింగ్‌, డ్రైన్‌ క్లీనింగ్‌, దోమల మందు స్ర్పేయింగ్‌, ఇంటింట చెత్త సేకరణ పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వెంట శానిటరీ ఇన్స్‌స్పెక్టర్లు తదితరులున్నారు.

Updated Date - May 29 , 2024 | 12:56 AM