నాడు కళకళ.. నేడు వెలవెల!!
ABN , Publish Date - Jan 18 , 2024 | 01:20 AM
రౌతులపూడి మండలం పైడిపాలకు చెందిన రైతు మ్యుటేషన్ కోసం గ్రామ సచివాలయానికి వెళ్లాడు. ఫోన్ నెంబరు అనుసంధానం కాలేదని పంపేశారు. వేలిముద్ర లేదా ఓటీపీ ద్వారానైనా చేయడానికి వెసులుబాటు ఉన్నా ఆధార్ లింకు చేసుకోవాలని తెలిపారు.
సచివాలయాల ఏర్పాటుతో మీ సేవ కేంద్రాల్లో నిలిచిన సేవలు
ఫ రౌతులపూడి మండలం పైడిపాలకు చెందిన రైతు మ్యుటేషన్ కోసం గ్రామ సచివాలయానికి వెళ్లాడు. ఫోన్ నెంబరు అనుసంధానం కాలేదని పంపేశారు. వేలిముద్ర లేదా ఓటీపీ ద్వారానైనా చేయడానికి వెసులుబాటు ఉన్నా ఆధార్ లింకు చేసుకోవాలని తెలిపారు.
ఫ శంఖవరం మండలం మండపం గ్రామానికి చెందిన వృద్ధురాలి మరణ ధ్రువపత్రం కోసం కుటుంబసభ్యులు దరఖాస్తు చేశారు. వీటి మం జూరు ఆలస్యం కావడంతో మళ్లీ మీసేవ కేంద్రాన్ని ఆశ్రయించాల్సి వచ్చింది. దీంతో రెండుచోట్లా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది.
శంఖవరం, జనవరి 17: పౌరసేవలన్నింటినీ సులభతరం చేయాలని, అవినీతి, అక్రమాలను అరికట్టి పనులు వేగవంతం చేయడానికి గత ప్రభుత్వాలు మీసేవా కేంద్రాలను ప్రారంభించాయి. అప్పటినుంచి ఆయా పరిధిలోని ప్రజలు నిర్ణీత రుసుం చెల్లించి తమకు కావాల్సిన సేవలను పొందేవారు. గ్రామ సచివాయాల సేవలు మొదలైనప్పటినుంచి అన్ని సేవలను వీటికి బదిలీ చేయడంతో మీసేవా కేంద్రాల్లో సేవలు నిలిచిపోయి నిర్వాహకులు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. అప్పులు చేసి లక్షలు ఖర్చుచేసి కొనుగోలు చేసిన పరికరాలు వృథాగా ఉండిపోయాయని వారు వాపోతున్నారు. కొన్ని సేవలకు లబ్ధిదారులు మీసేవా కేంద్రాలను ఆశ్రయిస్తున్నా అధికారులు మీసేవా ద్వారా వచ్చిన పనులు చేయకపోవడంతో ఈ కేంద్రాలు నిర్వీర్యమయ్యే స్థితిలో ఉన్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 1974 మీసేవా కేంద్రాలుండేవి. వీటిలో అత్యంత ప్రధానమైన మ్యూటేషన్లు, ఆధార్, రేషన్‌కార్డుల్లో చేర్పులు, సరవణలు, కొత్తవాటికి దరఖాస్తు చేసుకోవడం, అడంగల్ దిద్దుబాట్లు, ఓటరు నమోదు గుర్తింపుకార్డులు జారీ వంటి 300 రకాల సేవలు అందేవి. వీటిల్లో ప్రధాన సేవలను సచివాలయాలకు అందజేయడంతో సగానికి పైగా మూతపడ్డాయి. మరికొంతమంది వీటిని మూసివెయ్యలేక, మరొక పని చెయ్యలేక ఇబ్బందులు పడుతున్నారు. నెలకు నిర్ధేశిత సంఖ్యలో సేవలు చెయ్యని మీసేవా కేంద్రాలను రద్దు చేస్తున్నారు.
30 కేంద్రాలు మూసివేత
కాకినాడ జిల్లాలో 45 మీసేవా కేంద్రాల్లో ఆధార్ సేవలు అందించేవారు. ప్రస్తుతం 15 కేంద్రాల్లో మాత్రమే ఈ సేవలు కొనసాగిస్తున్నారు. దీంతో మిగతా 30 కేంద్రాలను నిబంధనల పేరుతో మూసివేశారు. సచివాలయాలు వచ్చిన తర్వాత మండలానికి కొన్ని సచివాలయాలు ఎంపిక చేసి అక్కడే ఆధార్ సేవలు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆటంకం లేకుండా..
మీసేవా కేంద్రాల ద్వారా సేవలు పొందేటప్పుడు వినియోగదారులకు ఆటంకం లేకుండా ప్రజలకు వీలైనప్పుడు ఏ సమయంలో వెళ్లినా సేవలు పొందే అవకాశం ఉండేది. విద్యుత్ సరఫరా లేకపొయినా, ఇంటర్‌నెట్ సరఫరాలో ఏలోపం ఉన్నా మీసేవా నిర్వాహకులే ప్రత్యామ్నాయ మార్గాల్లో సేవలు అందించేవారు. కేంద్రాల్లో అందించే సేవలను బట్టి వారికి కమీషన్ వచ్చేది. దీంతో నిరంతరాయంగా పనులు చేసి ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ప్రస్తుత సచివాలయాల్లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. సమస్య పరిష్కారానికి లబ్ధిదారులు రోజుల తరబడి తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. చాలావరకూ సచివాలయ భవనాలు అందుబాటులో లేకపోవడంతో సేవలు పూర్తిస్థాయిలో అందడం లేదని పలువురు చెప్తున్నారు.
ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం : మీ సేవ నిర్వాహకుడు
మీ సేవా కేంద్రం మీద ఆశలు పెట్టుకుని కంపూటర్లు, ప్రింటర్లు వంటి పరికరాలను కొనుగోలు చేశాం. ఇప్పుడు నెలకి రూ.వెయ్యి కమీషను రావడం గగనంగా ఉంది. ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడుతున్నాయి. కుటుంబ పోషణ ఇబ్బందిగా ఉంది. దీనిద్వారా వచ్చే ఆదాయంతో బతకలేం. వేరే పని చెయ్యలేం. ప్రభుత్వం మీసేవా కేంద్రాలకు పునర్ వైభవం తీసుకురావాలి.