Share News

ప్రేమజంట ఆత్మహత్య

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:41 AM

కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రేమజంట (బాలిక, యువకుడు) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్‌ పోలీసులు, ఏలేశ్వరం వాసులు అందించిన వివరాల ప్రకారం..

 ప్రేమజంట ఆత్మహత్య

ఏలేశ్వరం/నర్సీపట్నం, ఏప్రిల్‌ 5: కాకినాడ జిల్లా ఏలేశ్వరం ప్రాంతానికి చెందిన ప్రేమజంట (బాలిక, యువకుడు) శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నారు. ఇందుకు సంబంధించి అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రూరల్‌ పోలీసులు, ఏలేశ్వరం వాసులు అందించిన వివరాల ప్రకారం.. ఏలేశ్వరం పట్టణంలోని పెద్దవీధికి చెందిన తాండ్రాజు అశోక్‌ (25), ఏలేశ్వరం మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక (17) ప్రేమించుకుంటున్నారు. కాగా పెద్దలు తమ ప్రేమను అంగీకరించరనే భయంతో నాలుగురోజుల క్రితం ఇంటినుంచి వెళ్లిపోయారు. అప్పటినుంచి వీరు ఫోన్లు అందుబాటులో లేవు. గురువారం అర్ధరాత్రి సమయంలో బాలిక ఫోన్‌ ఆన్‌ చేయగా ఇంటినుంచి కుటుంబసభ్యులు ఫోన్‌ చేశారు. దీంతో ఏం జరుగుతుందోననే ఆందోళనతో.. తమను విడదీస్తారేమోనన్న భయంతో వారిద్దరూ శుక్రవారం తెల్లవారుజామున గడ్డిమందు తాగారు. నర్సీపట్నం మండలం కృష్ణాపురం సమీపంలో రోడ్డు పక్కన అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. వీరిని బీట్‌ కానిస్టేబుల్‌ గమనించి హుటాహుటిన నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి తరలించారు. యువకుడు చేతిపై రాసుకున్న ఫోన్‌ నెంబర్‌ ఆధారంగా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. స్థానిక ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇద్దరి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు అశోక్‌ను కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలికను కాకినాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కాగా మార్గమధ్యంలోనే ఆమె మృతిచెందింది. కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ యువకుడు మృతిచెందినట్టు నర్సీపట్నం రూరల్‌ పోలీసులకు సమాచారం అందింది.

Updated Date - Apr 06 , 2024 | 12:41 AM