Share News

లారీని ఢీకొన్న మినీవ్యాన్‌

ABN , Publish Date - Apr 05 , 2024 | 12:43 AM

విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో గల అక్కిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారి (నంబర్‌ 16)పై గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్‌ ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.

లారీని ఢీకొన్న మినీవ్యాన్‌

ముగ్గురు దుర్మరణం

పెందుర్తి/తాళ్లపూడి, ఏప్రిల్‌ 4:

విశాఖపట్నం జిల్లా పెందుర్తి సమీపంలో గల అక్కిరెడ్డిపాలెం వద్ద జాతీయ రహదారి (నంబర్‌ 16)పై గురువారం తెల్లవారుజామున ఆగి ఉన్న లారీని మినీ వ్యాన్‌ ఢీకొనడంతో ముగ్గురు మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద సమాచారం అందిన వెంటనే పెందుర్తి సీఐ ఎల్‌.రామకృష్ణ నేతృత్వంలో సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదంలో నుజ్జయిన వ్యాన్‌ నుంచి క్షతగాత్రులను అత్యంత లాఘవంగా బయటకు తీసి చికిత్స నిమిత్తం కేజీహెచ్‌కు తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి సీఐ ఎల్‌.రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామం నుంచి హనుమంతు ఆనందరావు, హనుమంతు చంద్రశేఖర్‌, చింతాడ ఇందు, అమ్మయ్యమ్మ, బొడ్డేపల్లి జ్యోతి, మెట్ట లక్ష్మి, వెంకటలక్ష్మి, నాగమణి, నీలవేణిలు బుధవారం ఉదయం మినీ వ్యాన్‌లో శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం గోగన్నపేట పంచాయతీ రంగానాథపేటలో జరిగిన బంధువుల వివాహానికి వెళ్లారు. బుధవారం రాత్రి వివాహ వేడుక ముగిసిన తరువాత శ్రీకాకుళం నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వ్యాన్‌ను వినయ్‌ డ్రైవ్‌ చేస్తున్నాడు. పెందుర్తి బైపాస్‌ రోడ్డులో సరిపల్లి సమీపంలో అక్కిరెడ్డిపాలెం వద్దకు వచ్చేసరికి వ్యాన్‌ అదుపుతప్పి రహదారి పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొంది. ఈ క్రమంలో వ్యాన్‌ ముందుభాగం పూర్తిగా నుజ్జయింది. డ్రైవర్‌ పక్కన కూర్చున్న హనుమంతు ఆనందరావు (45), హనుమంతు చంద్రశేఖర్‌ (17) చింతాడ ఇందు (58) అక్కడికక్కడే మృతిచెందారు.డ్రైవర్‌ వినయ్‌తో పాటు మిగతా వారికి తీవ్రగాయాలయ్యాయి. కాగా మృతుల్లో హనుమంతు ఆనందరావు (45), చంద్రశేఖర్‌ (17) తండ్రీకొడుకులు. వీరంతా దశాబ్దం కిందట పనుల కోసం శ్రీకాకుళం జిల్లా నుంచి పశ్చిమ గోదావరి జిల్లాకు వలస వెళ్లారని పోలీసులు చెబుతున్నారు. క్షతగాత్రుల పరిస్థితి మెరుగ్గానే ఉందని సీఐ రామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి డ్రైవర్‌ నిద్రమత్తులోకి వెళ్లడమే కారణమని పోలీసులు చెబుతున్నారు. ఆనందరావు కూలి పనికి వెళ్తూ కుటుంబాన్ని పోషిస్తుండగా అతని కుమారుడు చంద్రశేఖర్‌ ఇటీవల పదో తరగతి పరీక్షలు రాశాడు.

Updated Date - Apr 05 , 2024 | 12:43 AM