Share News

మద్యం నిల్వలపై దాడులు

ABN , Publish Date - Apr 27 , 2024 | 12:24 AM

పిఠాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు నిల్వ చేసిన మద్యంపై స్టేట్‌ ఎస్‌ఈబీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించారు.

మద్యం నిల్వలపై దాడులు

పిఠాపురం, ఏప్రిల్‌ 26: పిఠాపురం నియోజకవర్గంలో అధికార వైసీపీ నేతలు నిల్వ చేసిన మద్యంపై స్టేట్‌ ఎస్‌ఈబీ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసు అధికారులు నాలుగు బృందాలుగా ఏర్పడి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో వట్టూరి సతీష్‌కుమార్‌, సాలిపేటలో అంబటి వీరవెంకట సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటితో పాటు మండలంలోని కుమారపురం గ్రామంలోని వేమగిరి సువార్తమ్మ ఇళ్లపై శుక్రవారం రాత్రి ఏకకాలంలో దాడి చేశారు. అక్కడి ఇళ్లల్లో భారీగా మద్యం నిల్వలు బయటపడ్డాయి. నాలుగుచోట్ల కలిపి 1015 బాక్సుల్లో ఉన్న సుమారు 48,720 మద్యం బాటిళ్లును సెబ్‌, పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ. 80 లక్షలకు పైగా ఉంటుందని భావిస్తున్నారు. వైఎస్సార్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇల్లు వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు వీరబాబుదిగా చెబుతున్నారు. మద్యం దొరికిన నాలుగు ఇళ్లు వైసీపీ నాయకులవే కావడంతో ఆ పార్టీకి చెందిన వారే తెచ్చి ఇక్కడ నిల్వ చేసినట్లు చెబుతున్నారు. ఈ మద్యం నిల్వలు అన్ని వైసీపీ అభ్యర్థి వంగా గీతావిశ్వనాథ్‌కు చెందినవిగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. పట్టుబడిన మద్యాన్ని ప్రత్యేక వాహనాల్లో పిఠాపురం రూరల్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కాకినాడ ఎస్పీ సతీష్‌బాబు ఆదేశాల మేరకు జరిగిన దాడుల్లో కాకినాడ డీఎస్పీ హనుమంతరావు, సీఐ శ్రీనివాస్‌, సెబ్‌ సీఐ మహ్మద్‌ ఆలీ తదితరులు పాల్గొన్నారు

Updated Date - Apr 27 , 2024 | 12:24 AM