Share News

మద్యం కేసును నీరుగార్చుతున్నారా?

ABN , Publish Date - Apr 28 , 2024 | 12:29 AM

ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించి కోటి రూపాయల విలువైన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటనలో నమోదైన కేసులను నీరుగార్చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కీలక నేతను తప్పించి అతని వద్ద పనిచేసే కార్మికుడిపై కేసు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల ఒత్తిడితో మద్యం నిల్వలు వెనుక ఉన్న వారిపై కేసు దర్యాప్తు వెళ్లకుండా అడ్డుపుల్ల వేసి కేసులను తారుమారు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

 మద్యం కేసును నీరుగార్చుతున్నారా?

వైసీపీ కీలక నేతను తప్పించి యువకుడిపై కేసు

రెండు చోట్ల పోలీసులు, మరో రెండు చోట్ల సెబ్‌లో కేసులు నమోదు

వైసీపీ నేతలంతా పరారీలో ఉన్నారట..!

వైసీపీ పెద్దల ఒత్తిడితో కేసు తారుమారు

పిఠాపురం, ఏప్రిల్‌ 27: ఏకకాలంలో నాలుగు చోట్ల దాడులు నిర్వహించి కోటి రూపాయల విలువైన గోవా మద్యాన్ని స్వాధీనం చేసుకున్న సంఘటనలో నమోదైన కేసులను నీరుగార్చేస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ కీలక నేతను తప్పించి అతని వద్ద పనిచేసే కార్మికుడిపై కేసు పెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ప్రభుత్వంలో పెద్దల ఒత్తిడితో మద్యం నిల్వలు వెనుక ఉన్న వారిపై కేసు దర్యాప్తు వెళ్లకుండా అడ్డుపుల్ల వేసి కేసులను తారుమారు చేస్తున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మద్యం నిల్వలు పట్టుకునే వరకూ పకడ్బందీగా వ్యవహరించిన సెబ్‌, పోలీసు అధికారులు రాత్రి జరిగిన పరిణామాల తర్వాత నోరు మెదిపేందుకు ఇష్టపడకపోవడం, నమోదయిన కేసుల వివరాలను రహస్యంగా ఉంచేందుకు ప్రయత్నించడం పలు అనుమానాలకు తావిస్తోంది. పవన్‌ కల్యాణ్‌ను ఎలాగైనా ఓడించేందుకు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు భారీగా మద్యాన్ని డంప్‌ చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్‌ స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో, పోలీసు అధికారులు పిఠాపురం పట్టణంలోని జగ్గయ్యచెరువు కాలనీలో వట్టూరి సతీష్‌కుమార్‌, సాలిపేటలో అంబటి వీరవెంకట సత్యనారాయణరెడ్డి, వైఎస్సార్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటితో పాటు మండలంలోని కుమారపురం గ్రామంలోని వేమగిరి సువార్తమ్మ ఇళ్లపై శుక్రవారం రాత్రి ఏకకాలంలో దాడి చేశారు. నాలుగు చోట్ల కలిపి 52,992 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. వైఎస్సార్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇల్లు వైసీపీ పట్టణ అధ్యక్షుడు బొజ్జా దొరబాబు సోదరుడు వీరబాబుదిగా స్థానికులు తెలిపారు. మద్యం దొరికిన ఇళ్లన్ని వైసీపీ నాయకులవే కావడంతో ఆ పార్టీకి చెందిన నిల్వలుగా తేలిపోయింది. ఇక్కడ వరకూ పకడ్బందీగా వ్యవహరించిన అధికారులు రూటు మార్చారు.

కేసులు పంచుకున్నారు

నాలుగు చోట్ల దొరికిన మద్యానికి సంబంధించి పిఠాపురం పట్టణ, రూరల్‌ పోలీస్‌స్టేషన్లలో ఒక్కొక్క కేసు, సెబ్‌ స్టేషన్‌లో రెండు కేసులు నమోదు చేశారు. పట్టణంలోని జగ్గయ్యచెరువు కేసులో వట్టూరి సతీష్‌కుమార్‌, కుమారపురం కేసులో వేమగిరి సువార్తమ్మపై పోలీసులు కేసు నమోదు చేయగా, సెబ్‌ అధికారులు సాలిపేటలో పట్టుబడిన మద్యం విషయంలో అంబటి వీర వెంకట సత్యనారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు. వైఎస్‌ఆర్‌ గార్డెన్స్‌లో నిర్మాణంలో ఉన్న ఇంటి విషయంలో మాత్రం అక్కడ పనిచేసే జగ్గంపేట మండలం రాజపూడికి చెందిన 20 సంవత్సరాల యువకుడు గండికోట దుర్గారామయ్యపై కేసు నమోదు చేయడం గమనార్హం. నాలుగు కేసుల్లో దొరికిన మద్యం నిల్వలు అన్ని ఒకే రకానికి చెందిన నాన్‌ డ్యూటీ పెయిడ్‌లిక్కర్‌ అయినప్పుడు కేసులు పంచుకోవడం, ఎవరి దర్యాప్తు వారు చేస్తున్నట్లు చెప్పడంతో అనుమానాలు ప్రారంభమయ్యాయి.

ఒత్తిళ్లు పనిచేశాయా?

పిఠాపురం పట్టణం, మండలంలోని కుమారపురంలో పట్టుబడిన మద్యం విషయంలో వైసీపీ పెద్దల ఒత్తిళ్లు పనిచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా కోటి రూపాయల విలువైన మద్యం పట్టుబడినప్పుడు, అది ఎన్నికల సమయంలో ఎస్పీ లేదా ఆ స్థాయి అధికారి వివరాలు వెల్లడిస్తారు. ఇక్కడ మాత్రం అది జరగలేదు. వైసీపీ పట్టణాధ్యక్షుడి బంధువులకు చెందిన ఇల్లుగా చెబుతున్నా, వారిని తప్పించి ఒక యువకుడిపై కేసు నమోదు చేయడం, అసలు సరుకు ఎవరు తెచ్చారు, ఎవ్వరు తెమ్మన్నారు, ఎక్కడి నుంచి వచ్చింది తదితర విషయాలు దర్యాప్తు చేయాల్సిన పోలీసులు, సెబ్‌ అధికారులు నిందితులు పరారీలో ఉన్నట్లు చెప్పి తప్పించుకోవడం ఒత్తిళ్ల ప్రభావమేనని చెబుతున్నారు. ఇది ఎన్‌డీపీఎల్‌ లిక్కర్‌ కావడంతో కేసు తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అది కాకుండా నాసిరకం మద్యాన్ని స్థానికంగా తయారు చేసి గోవా మద్యం బాటిళ్లల్లో నింపారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవి అధికారులు పట్టించుకోవడం లేదా లేక ఒత్తిడులతో పట్టించుకోనట్లు వ్యవహరిస్తున్నారా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - Apr 28 , 2024 | 12:29 AM