Share News

గెలుపే లక్ష్యంగా ముందుకు...

ABN , Publish Date - Apr 06 , 2024 | 12:50 AM

అమలాపురం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం, గెలు పే లక్ష్యంగా జిల్లా, నియోజకవర్గ, మండలాల స్థాయిలో మూడు పార్టీల ప్రతినిధులతో సమన్వయ కమిటీలను ఏర్పాటుచేసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఎన్నికల్లో సహకరించే కీలక వ్యక్తులతో సమన్వయ క

గెలుపే లక్ష్యంగా ముందుకు...

అభ్యర్థుల విజయం కోసం త్వరలో సమన్వయ కమిటీలు

టీడీపీ, జనసేన, బీజేపీలతో జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు కమిటీల ఏర్పాటు

వివరాలు వెల్లడించిన టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రెడ్డి సుబ్రహ్మణ్యం

తొలి సమన్వయ భేటీకి నలుగురు అభ్యర్థులు డుమ్మా

అమలాపురం, ఏప్రిల్‌ 5(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల్లో కోనసీమ జిల్లాలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థుల విజయం కోసం, గెలు పే లక్ష్యంగా జిల్లా, నియోజకవర్గ, మండలాల స్థాయిలో మూడు పార్టీల ప్రతినిధులతో సమన్వయ కమిటీలను ఏర్పాటుచేసి ఎన్నికల్లో వ్యూహాత్మకంగా అడుగులు వేస్తామని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం వెల్లడించారు. ఎన్నికల్లో సహకరించే కీలక వ్యక్తులతో సమన్వయ కమిటీలను ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. రోజువారీగా జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జరుగుతున్న పార్టీ అభ్యర్థుల ప్రచారాలు, ఇతర సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి వాటి పరిష్కార లక్ష్యంతో ఈ కమిటీలు పనిచేస్తాయని సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. అమలాపురంలోని మెట్ల రమణబాబు స్వగృహంలో కోనసీమ జిల్లాస్థాయి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థులు, పార్టీ నాయకులతో ఏర్పాటుచేసిన తొలి సమన్వయ భేటీకి జిల్లా పార్టీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల్లో చేస్తున్న కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పి కొట్టడానికి పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున వైసీపీ చేస్తున్న అక్రమాలపై కొత్తగా ప్రకటించే సమన్వయ కమిటీల నేతలు ఎన్నికల కమిషన్‌ దృష్టికి తీసుకువెళ్లి వారి అక్రమాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో సమన్వయ కమిటీల ద్వారా అభ్యర్థుల ప్రచార శైలిని మోనిటరింగ్‌ చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా అధ్యక్షురాలు అనంతకుమారి చెప్పారు. కోనసీమలో పోటీ చేస్తున్న ఎంపీ అభ్యర్థి హరీష్‌మాధుర్‌తోపాటు ఐదుగురు టీడీపీ అభ్యర్థులు, ఇద్దరు జనసేన అభ్యర్థులకు అఖండ విజయం చేకూర్చాల్సిందిగా ఆమె ఆయా పార్టీల కేడర్‌ను కోరారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు యాళ్ల దొరబాబు మాట్లాడుతూ రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు పురందేశ్వరి ఆదేశాల మేరకు కోనసీమ జిల్లాలో బీజేపీతోపాటు అనుబంధ సంఘాల కేడర్‌ ఉమ్మడి అభ్యర్థుల విజయానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తుందని స్పష్టంచేశారు. టీడీపీ ఎమ్మెల్యే, మండపేట అభ్యర్థి వేగుళ్ల జోగేశ్వరరావు మాట్లాడుతూ అధికార పార్టీ చేస్తున్న అవినీతి, అక్రమాలపై పోరాడడానికి తాను సిద్ధంగా ఉన్నానని, ఎక్కడ ఏం జరిగినా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసి వారి అక్రమాలను అరికట్టడానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. జనసేన, బీజేపీ సహకారంతో ఎన్నికల్లో ముందుకు వెళతానని పేర్కొన్నారు. లోక్‌సభ అభ్యర్థి గంటి హరీష్‌మాధుర్‌ మాట్లాడుతూ ఎన్నికల్లో ఎంపీ, ఏడు అసెంబ్లీ స్థానాలను టీడీపీ, జనసేన నేతలు చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌కు కానుకగా ఇస్తానని చెప్పారు. మూడు పార్టీల నేతలతో అభ్యర్థులు సమన్వయం చేసుకుని ముందుకు సాగేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామని, ఇప్పటికే ఆ పార్టీ నాయకులంతా సంపూర్ణ సహకారం అందిస్తున్నట్టు తెలిపారు. అమలాపురం టీడీపీ అభ్యర్థి అయితాబత్తుల ఆనందరావు మాట్లాడుతూ త్వరలో సమన్వయ కమిటీల ఏర్పాటు ద్వారా పటిష్టమైన నాయకత్వంతో ఎన్నికల ప్రచార ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తానన్నారు. రామచంద్రపురం టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌తోపాటు సమన్వయ కమిటీ సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్‌ నామన రాంబాబు, టీడీపీ నాయకులు మెట్ల రమణబాబు, అల్లాడ స్వామినాయుడు, పెచ్చెట్టి విజయలక్ష్మి, జనసేన నాయకులు యేడిద శ్రీను, గుద్దటి జమ్మి, లింగోలు పండు, ఆకుల బుజ్జి, వాసంశెట్టి కుమార్‌, బీజేపీ నాయకులు మోకా వెంకట సుబ్బారావు, పాలూరి సత్యానందంలతోపాటు ఆయా పార్టీల నాయకులు పాల్గొన్నారు. అయితే తొలిసారిగా ఏర్పాటుచేసిన సమన్వయ భేటీకి టీడీపీ అభ్యర్థులు బండారు సత్యానందరావు, దాట్ల బుచ్చిబాబు, జనసేన అభ్యర్థులు గిడ్డి సత్యనారాయణ, దేవ వరప్రసాద్‌ గైర్హాజరయ్యారు.

Updated Date - Apr 06 , 2024 | 12:50 AM