Share News

జోరుగా కోడిపందాలు

ABN , Publish Date - Jan 15 , 2024 | 01:03 AM

హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు యథేచ్ఛగా కోడిపందాలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్య లు చేపడతామంటు ప్రచారాలు హోరెత్తించిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12:30గంటల వరకు పందాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అనంతరం పరోక్ష అనుమతుల్ని మంజూరు చేస్తూ పందాలు నిర్వహించేందుకు చూసీచూడనట్టు వదిలేశారు.

జోరుగా కోడిపందాలు
గోపాలపురంలో బరిలో పోట్లాడుకుంటున్న కోడిపుంజులు

  • చేతులు మారిన లక్షల రూపాయలు

  • ఆదివారం మధ్యాహ్నం వరకూ అనుమతులివ్వని అధికారులు

  • ఆపై చూసీచూడనట్టు వ్యవహరించిన వైనం

  • బరుల వద్ద గుండాట, పేకాట, కోశాట

  • అక్కడే మందు, విందుకు దుకాణాల ఏర్పాట్లు

  1. షాపుల ఏర్పాటుకు పలుచోట్ల వేలం పాటలు

కొవ్వూరు/నల్లజర్ల/నిడదవోలు/తాళ్లపూడి/దేవరపల్లి/గోపాలపురం/చాగల్లు, జనవరి 14: హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ, పోలీసుల హెచ్చరికలు పెడచెవిన పెడుతూ పందెంరాయుళ్లు యథేచ్ఛగా కోడిపందాలు నిర్వహించారు. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్య లు చేపడతామంటు ప్రచారాలు హోరెత్తించిన పోలీసు, రెవెన్యూ అధికారులు ఆదివారం మధ్యాహ్నం 12:30గంటల వరకు పందాలకు ఎటువంటి అనుమతి ఇవ్వలేదు. అనంతరం పరోక్ష అనుమతుల్ని మంజూరు చేస్తూ పందాలు నిర్వహించేందుకు చూసీచూడనట్టు వదిలేశారు. దీంతో అధికార వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో వివిధ గ్రామాల్లో పంట పొలాలను, లేఅవుట్‌లను, ఖాళీస్థలాలను ట్రాక్టర్లతో దున్ని బరులను అప్పటికప్పుడు సిద్ధం చేసి పందాలు జరిపారు. షా మియానాలు వేసి కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలు నిర్వహించారు. కొవ్వూ రు మండలంలోని తోగుమ్మి శివారు, ఐ.పంగిడి, సీతంపేట, పశివేదల, వేములూరు(ఔరంగాబాద్‌ శివారు) ఆరికిరేవుల, కొవ్వూరులోని నందమూరు రోడ్‌లో కోడి పందాలు జరిగాయి. బరులు వద్ద జూదగాళ్ల కోసం మందు, విందుకు సంబంధించి షాపులు ఏర్పాటుచేసుకోవడానికి కోడి పందాల నిర్వాహకులు వేలంపాట నిర్వహించినట్టు సమాచారం. కాగా నల్లజర్ల మండలంలో 10గ్రా మాల్లోను, దేవరపల్లి మండలంలో దేవరపల్లి, త్యాజంపూడి, యర్నగూడెం, కురుకూరు, చిన్నాయిగూడెం, బంధపురం గ్రామాల్లోను, గోపాలపురం మండ లంలో గోపాలపురం, వేళ్లచింతలగూడెం, వెంకటాయపాలెం, గుడ్డిగూడెం, కొవ్వూరుపాడు, దొండపూడి, హుకుంపేటలో రెండుచోట్ల కోడిపందాలు నిర్వ హించారు. తాళ్లపూడి మండలంలో తాళ్లపూడి-2, పెద్దేవం -2, రావూరుపాడు -1, గజ్జరం -2, మలకపల్లి -1 చొప్పన పందాలు నిర్వహించారు. మొదటి రోజు కోటి రూపాయల వరకు పందాల్లో చేతులు మారాయి. అలాగే బరుల వద్ద గుండాట, పేకాట, కోశాట జోరుగా నిర్వహించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మద్యం ఏరులై ప్రవహించింది. సంక్రాంతి సందర్భంగా 90 మందిపై బైండోవర్‌ కేసులు పెట్టినట్టు తాళ్లపూడి ఎస్‌ఐ కేవీ రమణ తెలిపారు. ఇదిలా ఉండగా చాగల్లు మండలంలోని ఒక బరిలో కోడి పందాల నిర్వహణ ఫొటోలు తీస్తున్న విలేకరులపై నిర్వాహకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఫొటోలు తీస్తున్నారు.. కోడి పందాలు ఆపేస్తారా, అంత దమ్ముందా మీకు ఉందా? లక్షలు రూపాయలు ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నాం. ఎవరి వాటా వారికి వెళుతుంది. మీరేంటి ఇక్కడ?’ అంటూ ప్రశ్నించారు. చాగల్లు ఇందిరమ్మ కాలనీ, నందిగంపాడు వెళ్లే రోడ్డు, ఊనగట్ల, చిక్కాల, బ్రాహ్మణగూడెం, మల్లవరం గ్రామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేసి కోడి పందాలు భారీ ఎత్తున నిర్వహించారు. ప్రజాప్రతినిధులే దగ్గరుండి ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Jan 15 , 2024 | 01:03 AM