Share News

భక్తజన జాతర.. జగ్గన్నతోట తీర్థం

ABN , Publish Date - Jan 17 , 2024 | 12:10 AM

తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ తీర్థానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇరుసుమండ, కె.పెదపూడి, మొసలపల్లి నుంచి జగ్గన్నతోటకు వెళ్లే రోడ్లన్నీ కిటకిటలాడాయి.

భక్తజన జాతర.. జగ్గన్నతోట తీర్థం

అంబాజీపేట, జనవరి 16:తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువుటద్దంలా నిలిచే ఈ తీర్థానికి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. ఇరుసుమండ, కె.పెదపూడి, మొసలపల్లి నుంచి జగ్గన్నతోటకు వెళ్లే రోడ్లన్నీ కిటకిటలాడాయి. 450 ఏళ్ల నుంచి ఏకాదశ రుద్రులు కొలువుగా ప్రసిద్ధిగాంచిన జగ్గన్నతోటకు వివిధ గ్రామాల నుంచి 11 ప్రభలు తరలిరావడం సంప్రదాయం. తీర్థానికి వచ్చే ఇతర గ్రామాల ప్రభలకు స్వాగతం పలికే మొసలపల్లి మధుమానంత భోగేశ్వరస్వామి ప్రభల ఉదయం తొమ్మిది గంటలకే తీర్థంలో కొలువుతీరి స్వాగతం పలికింది. కౌశిక అవతలవైపు ఉన్న గంగలకుర్రు అగ్రహారం వీరేశ్వరస్వామి ప్రభ, గంగలకుర్రు చెన్నమల్లేశ్వరస్వామి ప్రభలు కౌశిక దాటి తీర్థంలో ప్రవేశించే ఘట్టం చూపరులను గగుర్పాటుకు గురిచేసింది. శరభ... శరభ.. అశ్చరభ శరభ అంటూ బరువైన ప్రభలను యువకులు అవలీలగా భుజానకెత్తుకొని భక్తిభావంతో ముందుకు సాగారు. ఉదయం ఎనిమిది గంటలకే ఆయా గ్రామాల్లోని ప్రభలకు ప్రత్యేక పూజలను నిర్వహించి ఉత్సవ విగ్రహాలను ప్రభలపై కొలువుతీర్చి మేళతాళాలతో తీర్థానికి తీసుకువచ్చారు. చిరతపూడి చిట్టిచెరువు గట్టు, నరేంద్రపురం, అవిడి, రాకూర్తివారిపాలెం ప్రభలు చిరతపూడిలో కొలువుతీరాయి. వాకలగరవు, తొండవరం ప్రభలు తొండవరంలో కొలువుదీరాయి. తొండవరం, వాకలగరువు ప్రభలు ఒకదానికొకటి పోటీపడి చూపరులను కనువిందు చేశాయి.

Updated Date - Jan 17 , 2024 | 12:10 AM