Share News

మాటిచ్చి జగన్‌ మోసం

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:45 AM

నేను విన్నాను..నేను ఉన్నాను..వైఎస్‌ బిడ్డగా చెబుతున్నా..జగనన్నగా చెబుతున్నా...నేను అధికారంలోకి రాగానే మీ భూములను ఏపీఐఐసీ నుంచి డీ నోటిఫైడ్‌ చేయించి మీ కళ్లలో ఆనందం చూస్తాను’..అని పాదయాత్రలో జగన్‌ చెప్పారు.

మాటిచ్చి జగన్‌ మోసం

తమ్మవరం రైతుల ఆవేదన

సర్పవరం జంక్షన్‌, ఏప్రిల్‌ 18: నేను విన్నాను..నేను ఉన్నాను..వైఎస్‌ బిడ్డగా చెబుతున్నా..జగనన్నగా చెబుతున్నా...నేను అధికారంలోకి రాగానే మీ భూములను ఏపీఐఐసీ నుంచి డీ నోటిఫైడ్‌ చేయించి మీ కళ్లలో ఆనందం చూస్తాను’..అని పాదయాత్రలో జగన్‌ చెప్పారు. కానీ సీఎం అయిన తర్వాత ఆ మాటే మరిచారు. ఏమైంది మీరు మాకిచ్చిన హామీ, ఎందుకు మడమ తిప్పారంటూ తమ్మవరం రైతులు సీఎం జగన్‌ను ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. కాకినాడ జిల్లా కాకినాడ రూరల్‌ మండలం తమ్మవరంలో సుమారు 3500 మంది నివసిస్తున్నారు. ఇక్కడ నివసించే వారంతా వ్యవసాయం, అనుబంధ రంగాలు, మామిడి తాండ్ర తయారీపై ఆధారపడి జీవనాధారం పొందుతున్నారు. 1999 సంవత్సరంలో ప్రభుత్వ పారిశ్రావిక అవసరాల కోసం తమ్మవరం రైతులకు చెందిన సర్వే నెంబర్లు 41/11, 42, 43 లలో సుమారు 298 ఎకరాల జిరాయితీ భూమిని చిన్న, సన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం బలవంతంగా సేకరించింది. అర ఎకరం, ఎకరం ఉన్న రైతులే ఈ భూములకు యాజమానులుగా ఉన్నారు. మూడు పంటలు పండే భూములను ఏపీఐఐసీకి ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ప్రభుత్వం ఎకరాకు సుమారు 80 నుంచి లక్ష రూపాయల లోపున పరిహారం ఇస్తామని ప్రకటించడం, ఈ రేటుకు తమ భూములను ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చేదిలేదని కొంత మంది రైతులు కోర్టుకు వెళ్లారు. సీఎం జగన్‌ పాదయాత్రగా 2019లో కాకినాడ వచ్చినప్పుడు భూసమస్యను అడిగి తెలుసుకున్నారు. మూడు పంటలు పండే పొలాలు ప్రభుత్వం తీసుకోవడం మంచి పద్ధతి కాదని, తాను అధికారంలోకి వచ్చిన వెంటనే భూములు వెనక్కి వచ్చేలా డీ నోటిఫైడ్‌ చేస్తానని జగన్‌ హామీ ఇచ్చారు. ఈ హామీని నమ్మి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి ఓట్లేసి గెలిపించామని రైతులు చెబుతున్నారు. సీఎంగా జగన్‌ ప్రమాణ స్వీకారం చేయడం, మంత్రిగా స్థానిక ఎమ్మెల్యే కురసాల కన్నబాబు అయినా, ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏళ్లు గడచి తిరిగి ఎన్నికలు వచ్చినా సీఎం ఇచ్చిన హామీని మాత్రం నిలబెట్టుకోలేకపోయారని రైతులు అన్నారు. గ్రామ పంచాయతీని ఏకగ్రీవం చేస్తే మీ భూములను సీఎంతో మాట్లాడి వెనక్కి ఇప్పించే బాధ్యత తనదని అప్పటి మంత్రి, ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తమను మభ్యపెట్టి పంచాయతీని ఏకగ్రీవం చేయించుకున్నారని ఆరోపించారు. భూముల అప్పగింతపై తూతూ మంత్రంగా ఒకట్రెండు సార్లు అధికారులతో మాట్లాడటం తప్పించి, ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఎన్నికల ముందు నాయకులు ఓట్లు వేయించుకునేందుకు తమ భూములను బూచిగా చూపించి లబ్ధి పొందుతున్నారని ఆరోపించారు. తమ సమస్యకు పరిష్కారం చూపించే పార్టీలకే ఓట్లు వేస్తామని స్పష్టం చేశారు.

Updated Date - Apr 19 , 2024 | 12:45 AM