Share News

జగన్‌ మళ్లీ వస్తే బతకలేం

ABN , Publish Date - Feb 12 , 2024 | 01:19 AM

రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళితులు దగా పడ్డారని, వారి ఆత్మగౌరవ పోరాటమే ఈ సింహగర్జన సభ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు.

జగన్‌ మళ్లీ వస్తే బతకలేం

దళితులను ఇంత నీచంగా చూసిన ముఖ్యమంత్రిని చూడలేదు

దగా పడ్డ దళితుల ఆత్మగౌరవ పోరాటమే సింహగర్జన

బీసీలకు తగ్గకుండా కాపుల రిజర్వేషన్లుకు మద్దతిస్తాం

అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్‌

వేమగిరిలో దళిత సింహ గర్జన సభ

రాజమహేంద్రవరం సిటీ/కడియం, ఫిబ్రవరి 11: రాష్ట్రంలో వైసీపీ పాలనలో దళితులు దగా పడ్డారని, వారి ఆత్మగౌరవ పోరాటమే ఈ సింహగర్జన సభ అని అమలాపురం మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్‌ అన్నారు. రాజమహేంద్రవరం సమీపంలో వేమగిరి జాతీయ రహదారి వద్ద మైదానంలో ఆదివారం సాయంత్రం జగన్‌ ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తూ ఆయన దళిత సింహగర్జన సభను నిర్వహించారు. విజయనగరం నుంచి అనంతపురం వరకు, ఆంధ్రాతోపాటు తెలంగాణా రాష్ట్రం నుంచి దళితులు హాజరయ్యారు. తొలుత బీఆర్‌ అంబేడ్కర్‌, బాబూజగ్జీవనరామ్‌లకు నివాళులర్పించారు. అనంతరం హర్షకుమార్‌ మాట్లాడుతూ పోరాడితే పోయేది లేదు.. బానిస సంకెళ్లు తప్ప అన్నారు. రాష్ట్రంలో అఽధికారంలోకి రావడం కోసం జగన్‌ దళితులను నమ్మించారని, క్రైస్తవులు నమ్మి జగన్‌ను అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. అయితే మణిపూర్‌లో క్రైస్తవులపై మారణ కాండ సృష్టిస్తే ఈ సీఎం కనీసం స్పందించలేదని, పైగా ఆనాడు అవిశ్వాసం పెడితే కేంద్ర ప్రభుత్వానికి ఈ వైసీపీ ఎంపీలు ఓటు వేశారని గుర్తు చేసారు. దేశంలో దళితులను ఇంత నీచంగా చూసిన జగన్‌ లాంటి ముఖ్యమంత్రిని ఎన్నడూ చూడలేదన్నారు. రాష్ట్రంలో బక్కి శ్రీను మొదలు డ్రైవరు సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ సుధాకర్‌, గుంటూరులో రమ్య, అనంతపురంలో స్నేహలత, పులివెందులలో నాగమ్మ, కడపలో డాక్టర్‌, దొమ్మేరులో మహేంద్ర, నడింపల్లి రాము హత్యాకాండలు.. అలానే మైనింగ్‌ను ప్రశ్నించిన వరప్రసాద్‌ శిరోముండనం సంఘటన ఇలా చెపుతూ పోతే చాలా మంది దళితులు బలయ్యారన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, కార్పొరేషన్‌లను నిర్వీర్యం చేశారని, దళితులకు సంబంధించిన 27 పథకాలను రద్దు చేశారని, పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు, పీజు రీయింబర్స్‌మెంట్లు లేకుండా చేశారన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దళితులకు దక్కాల్సిన రూ.75 లక్షల కోట్ల నిధులను దుర్వినియోగం చేశారని ఆరోపించారు. యాత్ర సినిమా చేసిన దర్శకునికి రెండెకరాల భూమి ఇచ్చిన ఈ ప్రభుత్వం బాధిత దళితులకు భూమిని కేటాయించలేకపోయిందని విమర్శించారు. అమ్మఒడి పథకానికి సబ్‌ప్లాన్‌ నిధులను ఖర్చుచేశారన్నారు. బేస్‌ ఎవలైబుల్‌ స్కీంను రద్దు చేసిందని, ఇంత మంచి స్కీంను తీసివేయడంపై సుప్రీంకోర్టు స్పందించి పునరుద్ధరించాలని చెప్పిందన్నారు. కులాంతర వివాహం స్కీంను జగన్‌ రద్దు చేశాడని గుర్తుచెశారు. ఎన్‌ఎస్‌సీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా గతంలో కార్లు ఇచ్చేవారని అది లేదని, ఎస్సీ కార్పోరేషన్‌ ద్వారా రూ. లక్ష సబ్సిడీ వచ్చేదని అదీ రద్దు చేశాడని ధ్వజమెత్తారు. దళితులను దగా చేసిన ఈ ముఖ్యమంత్రి మళ్లీ వస్తే దళితులు బతకలేరని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళితులంతా ఆత్మవిమర్శ చేసుకోవాలన్నారు. ఓటుకు రూ.10 వేలు ఇస్తే తీసుకోండి.. ఎందుకంటే అది ఇసుక, మద్యం, కొండలు దోచేసిన డబ్బే కదా... కాని జగన్‌కు ఓటు వేయొద్దన్నారు. జగన్‌ను దించే వరకు పోరాడదామని పిలుపునిచ్చారు. ఇక రాష్ట్రంలో బీసీలకు తగ్గించకుండా కాపులకు రిజర్వేషన్లు కల్పించే అంశంపై తమ పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. తొలుత ఆలిండియా క్రిస్టియన్‌ ఫెడరేషన్‌ నేత జార్జి సీమంతుల మాట్లాడుతూ దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని హర్షకుమార్‌ డిమాండ్‌ను స్వాగతిస్తున్నామన్నారు. జగన్‌.. పాస్టర్లకు గౌరవ వేతనం అంటూ 29 వేల మందిని గుర్తించి కేవలం 8 వేల మందిని ఎంపిక చేశారన్నారు. క్రిస్టియన్‌ కార్పొరేషన్‌ అని పెట్టి చర్చిలు కడతామని మాట ఇచ్చి ఒమ్ము చేశారన్నారు. జంగా బాబూరావు మాట్లాడుతూ దళితులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని, అభివృద్ధి కుంటుపడిందన్నారు. దళిత సత్తా అధ్యక్షుడు కామేశ్వరరావు మాట్లాడుతూ దళిత సైన్యం సిద్ధంగా ఉందని, జగన్‌ అంతం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా బాధితులు బక్కి శ్రీను భార్య, నడింపల్లి గంగమ్మ తదితరులు తమకు జరిగిన అన్యాయాన్ని వివరించారు. జీవీ శ్రీరాజ్‌ మాట్లాడుతూ దళిత సింహగర్జన సభలో చర్చించిన అంశాలు, తీసుకున్న నిర్ణయాలపై అమరావతిలో ఓ సమావేశం పెడతామని అటుపై గ్రామగ్రామాన చైతన్య కార్యక్రమాలు చేపడుతున్నట్టు ప్రకటించారు. ఈ సభలో ఏలూరు మాలమహాసేన అధ్యక్షుడు రవికుమార్‌, బొజ్జా ఐశ్వర్య, నడింపల్లి గంగమ్మ, అయితాబత్తుల సుభాషిణి మాట్లాడారు. సభలో ఉభయ తెలుగురాష్ట్రాలకు చెందిన దళిత నాయకులు చిట్టిరాజు, హైదరబాదు గుడిమెళ్ళ వినోద్‌, కప్పల వెలుగు, శ్యాంబాబు, సింగపల్లి రమేష్‌, కోరుకొండ చిరంజీవి, తాళ్లూరి విజయ్‌కుమార్‌, గెడ్డం వెంకట్రాజు, ఇసుకపట్ల వెంకటరమణ, గెడ్డం శ్రీను, కరుణాకర్‌, శ్యాంసుందర్‌, విజయనగరం ఆదాల మోహన్‌, నిడదవోలు బండి శ్యామ్‌బాబు పాల్గొన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 01:19 AM