Share News

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం మరింత పెంచాలి

ABN , Publish Date - Jan 21 , 2024 | 12:45 AM

వంట నూనెలు దిగుమతి తగ్గించి స్థానికంగానే ఉత్పత్తి చేసుకునే విధంగా రైతులు ఆయిల్‌పామ్‌ తోటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్‌ ఆహూజా కోరారు.

ఆయిల్‌పామ్‌ సాగు విస్తీర్ణం మరింత పెంచాలి
రైతులతో మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వ బృందం

  • కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్‌ ఆహూజా

నల్లజర్ల, జనవరి 20: వంట నూనెలు దిగుమతి తగ్గించి స్థానికంగానే ఉత్పత్తి చేసుకునే విధంగా రైతులు ఆయిల్‌పామ్‌ తోటల సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి మనోజ్‌ ఆహూజా కోరారు. మండలంలోని ముసుళ్లకుంటలోని త్రీఎఫ్‌ ఆయిల్‌పామ్‌ నర్సరీని ఆయన శనివారం సందర్శించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయిల్‌పామ్‌ సాగులో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి పరిష్కరిస్తామని, రైతుల సమస్యల పరిష్కారానికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. వంటనూనెలు దిగుమతి చేసుకోవడం ద్వారా కోట్లాది రూపాయలు ట్యాక్స్‌లుగా చెల్లించవలసి వస్తోందని, అలా కాకుండా మన దేశంలోనే వంటనూనెలు ఉత్పత్తి చేసుకుంటే తక్కువ ధరలకు వంటనూనెలు అందించగలుగుతామన్నారు. ఈ సందర్భంగా నల్లజర్ల, దేవరపల్లి, నిడదవోలు, తాడేపల్లిగూడెం మండలాల రైతులు మాట్లాడుతూ రాయితీలు త్వరగా చెల్లించాలని, ఉపాధి హామీ పథకాన్ని ఆయిల్‌పామ్‌ తోటలకు వర్తింపజేసి కూలీల కొరతను నివారించాలని, 1:3నిష్పత్తిలో నిధులు కేటాయించి పుంత రహదారులను అభివృద్ధి చేయాలని కోరారు. గెలలు కోత కూలీలకు శిక్షణ, ప్రమాదబీమా వర్తింపజేయాలని తద్వారా మ రింత మంది ఈ వృత్తిలోకి వస్తారని, గెలల కోత సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో త్రీఎఫ్‌ ఆయిల్‌పామ్‌ ఎండీ సంజయ్‌గోయింకా, ఆశీష్‌ గోయింకా, సంస్థ అగ్రీ హెడ్‌ కిలారి శ్రీనివాసరావు, విజయప్రసాద్‌, రాజమహేంద్రవరం డీవోహెచ్‌ సుజాతకుమారి, ఏలూరు డీవోహెచ్‌ రామ్మోహన్‌, ఐఐవోపీఆర్‌ సురేష్‌, రామచంద్రుడు, చదవలవాడ నవీన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2024 | 12:45 AM