సుడిగుండాలు!
ABN , Publish Date - Oct 20 , 2024 | 01:25 AM
గోదావరి.. పేరు వినగానే ఒక మనోహర దృశ్యం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. పేరులోనే గోదావరి.. కనుచూపు మేర కనిపించే గోదారి అందాలు..
నీళ్లే ఆధారం.. నీళ్లే శాపం
ప్రకృతి కరుణతోనే జీవనం
లేదంటే నష్టాల ఊబిలోకి
వర్షాలతో అస్తవ్యస్తం
రైతుల జీవనం ఎదురీతే
జాలర్ల బతుకులూ అంతే
ఈ ఏడాది వరుస తుఫాన్లు, వరదలు
ఏటా కోట్లలో నష్టాలు
ఇటు వర్షాల నష్టం.. గోదావరి ముంపు కష్టం
అటు సముద్రం అల్లకల్లోలంతో గుండె‘కోత’
ఇదీ గోదావరి ప్రాంత ప్రజల జీవన చిత్రం
గోదావరి.. పేరు వినగానే ఒక మనోహర దృశ్యం కళ్ల ముందు ప్రత్యక్షమవుతుంది. పేరులోనే గోదావరి.. కనుచూపు మేర కనిపించే గోదారి అందాలు.. పరవళ్లు తొక్కుతూ పరుగులుతీసే ప్రవాహ వేగం.. మంద్రంగా సాగిపోయే మత్స్యకారుల నాటు పడవలు, రాజమండ్రి రోడ్ కం రైలు బ్రిడ్జి, ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ.. ఇలా ఒక్కొక్కటి ఓ దృశ్యకావ్యంలా కదలాడుతుంటాయి. అందుకే గోదావరిపై ఎన్నెన్నో సినిమాలు, పాటలు, కవితలు, కావ్యాలు.. ఉప్పొంగే గోదారంటే ఓ పరవశం..!
ఎన్నెన్నో అందాలు గోదావరి జిల్లాల సొంతం. ఎగువున గోదావరిని ఆనుకుని ఆకుపచ్చ లోకంలా దట్టమైన అడవులు, ఏజెన్సీ అందాలు... మరోవైపు సుదీర్ఘమైన సముద్రతీరం.. అలరించే బీచ్‌లు.. చేపల కోసం వేటకెళ్లే జాలర్లు.. ప్రతీదీ సుందర దృశ్యమే. దిగువున పచ్చని కొబ్బరి వనాల కోనసీమ, గలగలా పారుతున్న పంట కాల్వలు, భూమి తల్లి పచ్చని చీరకట్టినట్టుగా పైరుపంటలు.. లోగిలి ఇళ్లు.. పొలాల మధ్య డాబాలు.. కోడిపందాలు.. పండుగల సందళ్లు.. అతిథి మర్యాదలు.. అబ్బో, గోదారోళ్లంటే అదృష్టవంతులే.. అక్కడ ఉండాలంటే పెట్టిపుట్టాలని అనుకోవడం ఓ మధురానుభూతి..!
కానీ...
గోదావరి జీవనం అనుకున్నంత హాయి కాదు. సంతోషాల తీరం కాదు.. నిత్యం కనిపించని శత్రువు ప్రకృతి వైపరీత్యాలతో పోరాడాలి. ఎటుచూసినా నీళ్లు.. నీళ్లు.. ఇక వీళ్లకేం లోటు.. అదృష్టవంతులు.. ఇలాంటి అభిప్రాయమే అందరిదీ. కానీ సినిమాల్లో గోదావరిని చూపించినంత అందంగా నిజజీవితం ఉండదు. నిత్యం ఆటుపోట్లు.. వైపరీత్యాలు.. చెప్పాలంటే ప్రకృతి కనికరం మీద సాగే జీవనం.. క్షణాల్లో తల్లకిందులైపోయే బతుకులు.. గోదావరి జీవనానికి ఇది రెండోవైపు...
(కాకినాడ/ రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)
తూర్పుగోదావరి జిల్లా అంటే ప్రశాంతతకు.. ప్రకృతి అందాలకు.. పరవశించిపోయేంతటి పచ్చద నానికి నిలువెత్తు చిరునామా.. ఒకపక్క అందాల గోదావరి... మరోపక్క కవ్వించే సాగరతీరం.. భూ మికి పచ్చని రంగేసినట్టు నలుదిక్కులా కనిపించే వరి పైరులు.. అందాల తీరంపై కదలాడే పడవ లు.. మత్స్యకారుల జీవన సిత్రాలు. ఇలా ఒకటేంటి ఉమ్మడి తూర్పుగోదావరికి దేవుడు ప్రసాదించిన అందాలను వర్ణించడానికి మాటలు చాలవు.. అయి తే కనువిందు చేసే ఈ అందాల ప్రాంతాన్ని ప్రకృతి పగబట్టింది. గత దశాబ్దకాలంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనేక ఆటుపోట్లకు గురైంది. ఈ ఏడాది సంగతి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వర్షాలు.. తుఫాన్లు.. వరదలు కల్లోలం సృష్టిస్తున్నాయి. ఇప్పటివరకు అలరించే అందాల జిల్లాలో ప్రకృతి వైపరీత్యాల సమయంలో ఒకపక్క గోదావరి ఉగ్రరూపం.. మరోపక్క సాగరతీరం అల్ల కల్లోలం... పచ్చటి పైర్ల కకావికలం.. అన్నదాతల ఆందోళనలు.. కన్నీళ్లు.. మత్స్యకారుల ఆకలికేకలు చెప్పాలంటే.. ప్రకృతి విలయతాండవం చేస్తోంది.
జీవనం అతలాకుతలం
గోదావరి జిల్లాల ప్రజలంటే అందరి దృష్టిలో అదృష్టవంతులుగా కనిపిస్తారు. వాస్తవ జీవితం ఇక్కడ పుట్టి ఇక్కడ జీవించిన వాళ్లకే అర్థమవు తుంది. తుఫాన్ల రాజ్యంలో ప్రతిఏటా నరకమే. గోదావరి వరదల వెనుక ఎంతో నష్టం. మరెంతో కష్టం.. రెండు మూడు దశాబ్దాల కిందట వర్షా కాలం వచ్చిందంటే లక్షలాది మంది సామాన్య ప్రజలు నివసించడానికి కూడా చోటుండేది కాదు. తినడానికి తిండి కూడా ఉండేది కాదు. ఏదొక సురక్షిత ప్రాంతానికి వలస వెళ్లి ఆ గడ్డు రోజుల నుంచి గట్టెక్కేవాళ్లు. ఇప్పుడు ఆ పరిస్థితి తగ్గింది. శాశ్వత ఇళ్ల నిర్మాణాలతో తుఫాన్ల నుంచి ప్రాణ గండం లేకుండా బతుకుజీవుడా అని కోలుకొం టున్నారు. కానీ సముద్రతీరంలో 1996లో తుఫాను సమయంలో జరిగిన ప్రాణనష్టం, ఆస్తినష్టం ఒక విషాద ఘట్టం. అలాగే 1986లో గోదావరి వరదల సమయంలో జరిగిన నష్టం గోదావరి జిల్లాలను అతలాకుతలం చేసింది. తర్వాత కూడా ఏటా సం భవిస్తున్న తుఫాన్ల వల్ల సముద్రతీరంలో వేలాది మంది షెల్టర్లలోనో, సురక్షిత ప్రాంతంలోనో తల దాచుకోవాల్సి వస్తోంది. తీవ్రమైన ఈదురుగాలు లు, వర్షాలకు అపారమైన నష్టం జరుగుతూనే ఉంది. ఇటు చూస్తే ఏటా జూలై, ఆగస్టు మాసాల్లో సంభవించే గోదావరి వరదలకు వేలాది మంది ముంపు బాధితులుగా రోడ్డున పడుతున్నారు. ఈ ఏడాది సెప్టెంబరు, అక్టోబరులో కూడా గోదావరి వరదలు లంక గ్రామాలను అతలాకుతలం చేశాయి.
ఛిద్రమవుతున్న రైతు జీవన చిత్రం
గోదావరి జిల్లాల్లో వర్షాలు, వరదలు ఏటేటా నరకం చూపిస్తున్నాయి. ప్రధానంగా అన్నదాతల జీవనం ఛిద్రమవు తోంది. కొన్నేళ్లుగా ఏటా అన్నిరకాల పంటలు తుఫాన్ల నేపథ్యంలో కురిసే భారీ వర్షాలకో, గోదావరి వరదలకో ముంపు బారిన పడుతు న్నాయి. వరి రైతులైతే నాట్ల దశ నుంచి ధాన్యం పట్టుబడి జరిగే లోపు ఏదో ఒక దశలో ప్రకృతి విపత్తుకు బలవుతున్నాడు. పెట్టిన పెట్టుబడి నీటిపాలవుతోంది. కన్నీళ్లు మిగులుతున్నాయి. ఒకప్పుడు ఊళ్లో దర్పంగా తిరిగే రైతన్న ఇప్పుడు దిగులుతో రోజులు వెళ్లదీస్తు న్నాడు. ఇక్కడ వరి తర్వాత అరటి, పొగాకు, చెరకు, అపరాల పంట లు, మొక్కజొన్న, కూరగాయలు వంటివి ఎక్కువగా సాగు చేస్తారు. భారీ వర్షాల వల్ల ప్రతిఏటా పంటలు నాశనం అవుతూనే ఉన్నాయి. తుఫాను వస్తోందని, భారీ వర్షాలు వస్తున్నాయని ముందస్తు హెచ్చ రికలున్నా పొలంలో పరిస్థితిని ఎవరూ మార్చలేరు. ప్రస్తుతం పంటలు కోత దశలో ఉన్నాయంటే కోత కోయడం మానే స్తారు అంతే. కానీ భారీవర్షాలు, తుఫాన్ వల్ల నష్టం జరగక తప్ప దు. ఇక మాసూలు దశలో నష్టం జరిగితే రైతు అప్పులపాలే.
పంట నష్టాలు.. వందల కోట్లలో..
అయిదారేళ్ల నుంచి ఏటా పంట నష్టాలు తీవ్రస్థాయిలోనే ఉంటు న్నాయి. పంటల బీమా పరిహారం ఉన్నా అది కంటితుడుపు చర్య మాత్రమే. పంట నష్టాలు ఏటా వందల కోట్లలో ఉంటే పరిహారం మాత్రం పదుల కోట్లలో ఉంటుంది. ఒక రైతు ఖరీఫ్ మాసూలు సమయంలో వర్షాలకు పంట నష్టం జరిగింది అనుకోండి. ఈ కష్టం నుంచి బయటపడడం, మిగిలినదాన్ని ఒడ్డుకు చేర్చి అమ్ముకోవడం నరకం లాంటిది. అదే సమయంలో రబీకీ కూడా సన్నద్ధం కావాలి. అంటే ఒకే సమయంలో అవిశ్రాంతంగా కష్టపడాలి. నష్టమంతా అప్పుల్లోకి మార్చి కొత్త పంట కోసం సన్నాహాలు చేసుకోవాలి. ఇంత కష్టం మరెవరికీ ఉండదని వేరే చెప్పాల్సిన పనిలేదు. అధిక పెట్టుబ డులతో కూరగాయల పంటలు, అరటి వేస్తే సర్వనాశనమవుతాయి. ఒక్క రూపాయి కూడా చేతికి రాదు. అప్పుల ఊబిలోకి మెల్లగా జారిపోవాల్సిందే. ఉదాహరణకు తూర్పుగోదావరి జిల్లాలో 2023 మార్చిలో భారీ వర్షాల వల్ల 97.554 హెక్టార్లలో నష్టం. 2023 ఏప్రి ల్‌లో భారీ ఈదురుగాలుల వల్ల 233.79 హెక్టార్లలో నష్టం. అదే ఏడాది డిసెంబరులో మిచౌంగ్ తుఫాను వల్ల 10487.02 హెక్టార్లలో పంటనష్టం జరిగింది. ఈ ఏడాది జూలైలో భారీ వర్షాలు, గోదావరి వరదల వల్ల 10260.01 హెక్టార్లలో నష్టం జరిగింది. ఆగస్టు, సెప్టెం బర్లలో వరదలు, భారీ వర్షాల వల్ల 983.1939 హెక్టార్లలో పంట నష్టపోయింది. ఇందుకు రూ.35కోట్ల 95లక్షల 82వేల ఇన్‌ఫుట్ సబ్సి డీ ఇవ్వాల్సి ఉంది. అందులో జూలై నుంచి నష్టాలకు ఇన్‌ఫుట్ సబ్సి డీ ఇంకా ఇవ్వలేదు. కాకినాడ జిల్లా వరుసగా వర్షాలు, తుఫాన్లు, వరదలతో వణుకుతోంది. అయితే అల్పపీడనం.. లేదంటే తుఫాను.. అదీ ఎక్కువైతే ఏలేరు, సుద్దగడ్డ వరదలు... ఇంకాస్త తీవ్రత పెరిగే ఉప్పాడ సముద్రపు కోత.. ఇలా వరుసగా ఉత్పాతాలు జిల్లాకు కంటిపై కునుకు లేకుండా చేస్తోంది. గడచిన మూడేళ్లను పరిశీలిస్తే ఈ జిల్లాలో 2023 మార్చిలో భారీ వర్షాలకు 340 హెక్టార్లలో పంట నష్టపోయింది. 2023 ఏప్రిల్, మేలో కురిసిన భారీ వర్షాలకు 883 హెక్టార్లలో వరి దెబ్బతింది. డిసెంబరులో మిచౌంగ్ తుఫానుతో జిల్లాలో 26,905 మంది రైతులు 12,568 ఎకరాల్లో వరి పంట నష్టపోయారు. దీనివల్ల రూ.21.33 కోట్ల పంటనష్టం వాటిల్లింది. ఈ ఏడాది ఆగస్టు, సెప్టెంబరులో ఏకధాటిగా కురిసిన భారీ వర్షాలు, ఏలేరు వరదలకు జిల్లాలో 26,612 మంది రైతులకు చెందిన 14, 425 హెక్టార్లలో వరి, ఐదు వేల ఎకరాల్లో వాణిజ్య పంటలు దెబ్బతి న్నాయి. రూ.52 కోట్ల నష్టం నమోదైంది. 2024లో జూలై వరదలకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 1596 ఎకరాల్లో ఉద్యా నవన పంటలు, 3453 ఎకరాల్లో వరి పంట దెబ్బతింది.
భారీ వర్షాలు. జీవనం అస్తవ్యస్తం
ఉమ్మడి తూర్పుగోదావరిలో జిల్లాలో ఏటా వర్షాలు, వరదలు, తుఫాన్లు జలవిలయాన్ని తలపిస్తున్నాయి. ఎగువ నుంచి ప్రళ యంలా వచ్చిపడుతున్న గోదావరి వరద ఇటు ముందుకు దూసుకొస్తున్న సము ద్రం.. ఆకాశానికి చిల్లులు పడ్డాయా అన్నట్టు నిత్యం భారీ వర్షాలు, తుఫాన్లు.. జనజీవనాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాయి. ఈ ఏడాది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కురిసిన వర్షపాతం అవసరానికి మించిపోయింది. భూగర్భజలాలు తన్నుకు వచ్చేలా చేసింది. ప్రధానంగా కాకినాడ జిల్లాలో ఈ వర్షాకాలం సీజన్‌లో జూన్ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు లెక్కలు తీసుకుంటే 660 మిల్లీ మీటర్ల వర్షపాతం కురవాల్సి ఉంటే ఏకంగా 927 మిల్లీ మీటర్లు కురిసింది. తూర్పుగోదావరి జిల్లాలో 775.9 మి.మి.కిగాను 1,022 మి.మి. కురిసింది. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో 778 మి.మి.కిగాను 979 మి.మి. నమోదైంది. కొత్త తూర్పుగోదావరి జిల్లాలో చూస్తే జూన్‌లో 3767.4 మిల్లీమీటర్లు, జూలైలో 7118.8 మిల్లీమీటర్లు నమోదైంది. ఆగస్టులో 3596.1 మిల్లీమీటర్లు, సెప్టెంబరులో 4157 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవి సాధారణ వర్షపాతాలకంటే చాలా ఎక్కువ. కానీ ఒక ఆగస్టులో మాత్రం సాధారణ వర్షపాతం 4532.8 మిల్లీమీటర్లుగా ఉండగా, ఈసారి కాస్త తక్కువగా 3596.1 మిల్లీ మీటర్లు నమోదైంది. ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో సాధారణ జనజీవనంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రైతులూ కలవరపడుతున్నారు.