Share News

భర్త చెంపపై కొట్టడంతో మహిళ మృతి

ABN , Publish Date - Mar 06 , 2024 | 12:24 AM

ర్షణ పడే క్రమంలో భర్త.. భార్య చెంపపై గట్టిగా కొట్టడంతో మృతిచెందింది. కొవ్వూరు మండలం మద్దూరులో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం..

భర్త చెంపపై కొట్టడంతో మహిళ మృతి

కొవ్వూరు, మార్చి 5: ఘర్షణ పడే క్రమంలో భర్త.. భార్య చెంపపై గట్టిగా కొట్టడంతో మృతిచెందింది. కొవ్వూరు మండలం మద్దూరులో ఈ ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. మద్దూరుకు చెందిన సండ్ర వీరబాబుకు, అత్తిలి గ్రామానికి చెందిన లావణ్య సాయిదీపికతో 2010లో వివాహం జరిగింది. వీరికి కుమారుడు జయశంకర్‌, కుమార్తె కుందన ఉన్నారు. వీరబాబు తాపీ పనిచేస్తుంటాడు. మద్యం, పేకాట, కోడి పందాలకు బానిస కావడంతో భార్యాభర్తల మద్య తరచూ డబ్బు విషయమై గొడవలు జరుగుతున్నాయి. మంగళవారం ఉదయం డ్వాక్రా రుణానికి సంబంధించిన వాయిదా డబ్బు చెల్లింపు విషయంలో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఈ కొట్లాటలో కోపంతో వీరబాబు భార్య చెంపపై గట్టిగా కొట్టాడు. దీంతో మాటలేకుండా లావణ్య కిందపడి మరణించింది. జరిగిన సంఘటనను వీరబాబు అత్తిలిలో ఉన్న అత్తమామలకు ఫోనులో తెలియజేయగా వారు హుటాహుటిన మద్దూరు రావడంతో లావణ్య చనిపోయిన విషయం బయటకు వచ్చింది. కొవ్వూరు డీఎస్పీ కె.రామారావు, సీఐ పి.శ్రీనివాసరావు, రూరల్‌ ఎస్‌ఐ కె.సుధాకర్‌ సంఘటనా స్థలానికి చేరుకుని కుటుంబ సభ్యులు, బంధువుల నుంచి వివరాలు సేకరించారు. లావణ్య తల్లిదండ్రులు బడేటి గణపతి, వెంకటలక్ష్మి మాట్లాడుతూ వివాహం జరిగినప్పటి నుంచి తమ కుమార్తెను సరిగా చూసుకోలేదని, భర్తతోపాటు అత్త సండ్ర సూర్యకుమారి బాధలు పెడుతూనే ఉన్నారని, అన్యాయంగా తమ కుమార్తెను చంపేశారని ఆరోపించారు. తండ్రి ఫిర్యాదు మేరకు భర్త, అత్తపై హత్య కేసు నమోదు చేసినట్టు ఎస్‌ఐ సుధాకర్‌ తెలిపారు.

Updated Date - Mar 06 , 2024 | 08:17 AM