Share News

ఎవరి కోసం.. సంతకం!

ABN , Publish Date - Feb 07 , 2024 | 12:50 AM

ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ ఆగడాలు మరింత పెచ్చుమీరుతున్నాయి. జగనన్న కాలనీలో నాడు దారి మార్గాల కోసం వదిలిపెట్టిన భూమినీ నేడు వదలకుండా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నారు.

ఎవరి కోసం.. సంతకం!
120 ఇళ్ల పట్టాలపై తహశీల్దార్‌ పాత తేదీలతో సంతకాలు చేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తున్న టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామకృష్ణారెడ్డి

బదిలీపై వెళ్లిన తహశీల్దార్‌ సండే రాక

120 ఇళ్ల పట్టాలపై సంతకాలు?

పాత తేదీలో చేయడంపై అనుమానాలు

స్థలాలు అమ్ముకున్నారని ఆరోపణలు

కలెక్టర్‌కు రామకృష్ణారెడ్డి ఫిర్యాదు

అనపర్తి, ఫిబ్రవరి 6 : ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో అధికార పార్టీ ఆగడాలు మరింత పెచ్చుమీరుతున్నాయి. జగనన్న కాలనీలో నాడు దారి మార్గాల కోసం వదిలిపెట్టిన భూమినీ నేడు వదలకుండా ఇళ్ల పట్టాల పంపిణీకి ప్రయత్నాలు చేస్తున్నారు. బదిలీపై వెళ్లిన అధికారిని పిలి చి మరీ పాత తేదీల్లో సంతకాలు చేయించి పట్టాల పంపిణీకి రంగం సిద్దం చేస్తున్నారు.. ఇంత చేస్తున్నదీ అర్హులైన లబ్ధిదారుల కోసం కాకుండా పైసల కోసమేనని గ్రామంలో ప్రచారం సాగుతోంది.. ఇదంతా మండల కేంద్రమైన బిక్కవోలులో గత నాలుగు రోజులుగా జరుగుతున్న సీన్‌.. బిక్కవోలు గ్రామంలో జగనన్న కాలనీకి రెండు చోట్ల స్థలాలను సేకరించారు. లేఅవుట్‌ 1 కోసం 18.19 ఎకరాల భూమిని సేకరించి 730 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశారు. లేఅవుట్‌ 2కోసం 9.45 ఎకరాల భూమిని సేకరించి 284 మంది లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ రెండు లేఅవుట్ల వద్ద పక్కనే ఉన్న రైతులకు దారి మార్గం ఇవ్వకుండా పూర్తి స్థలాలుగా విభజించారని రైతులు అడ్డుకోవడంతో అక్కడ ఇవ్వవలసిన 120 పట్టాలను పెండింగ్‌లో ఉంచారు. నాటి నుంచి నేటి వరకు ఆ పట్టాల జోలికి పోలేదు. అయితే గత కొద్ది రోజులుగా ఆ పట్టాలను పంపిణీ చేసేందుకు వైసీపీ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. చివరకు లబ్ధిదారుల జాబితాను సిద్ధం చేసుకునే సమయానికి అధికారులకు ఎన్నికల బదిలీలు రావడంతో ఇక్కడ పనిచేస్తు న్న తహసీల్దార్‌ పోసిబాబు గత నెల 30న బదిలీపై వెళ్లిపోయారు. జాబితా సిద్ధం చేసుకున్న వైసీపీ నేతలకు తహశీల్దార్‌ సంతకాలతో పనిపడడంతో ఈ నెల 4న ఆదివారం మధ్యాహ్నం రప్పించి సచివాలయ కార్యాలయంలో 120 ఇళ్ల పట్టాలపై సంతకాలు చేయించారు. అయితే ఈ పట్టాలను నాయకులు రూ.1.50 లక్షల నుంచి రూ.2లక్షల వరకు విక్రయించారని ప్రచారం జర గడంతో విషయం పెద్దదైంది. మండల టీడీపీ నాయకులు విషయాన్ని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి వివరించడంతో ఆయన సోమవారం తహశీల్దార్‌ కార్యాలయానికి చేరుకుని అదికారులను నిలదీశారు. దీనిపై తనకేమీ తెలియదని డిప్యూటీ తహశీల్దార్‌ చెప్పడంతో సంతకాల సమయంలో అక్కడే ఉన్న వీఆర్‌వో అశోక్‌ను పిలిపించి ప్రశ్నించారు. దీంతో ఆయన తహశీల్దార్‌ ఆదివారం వచ్చి 120పట్టాలపై సంతకాలు పెట్టి వెళ్లిన మాట వాస్తవమేనని చెప్పారు. ఏ తేదీలతో సంతకాలు చేశారని ప్రశ్నించగా పాత తేదీలతో సంతకాలు చేశారని చెప్పారు. దీనిపై రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన అధికారులు వైసీపీ నేతలతో కలిసి పాత తేదీలతో సంతకాలు చేయాల్సి అవసరం ఏమి వచ్చిందని ప్రశ్నించారు. దీనిపై మం గళవారం రాజమహేంద్రవరంలో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి మాదవీలతకు ఫిర్యాదు చేశారు. విచారణ నిర్వహించి భాద్యులపై చర్యలు చేపట్టాలని కోరారు. ఈ విషయమై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

సంతకాలు ఇప్పుడు చేసినవి కాదు..

గత నెల 30న విధుల నుంచి రిలీవ్‌ అయిన మాట వాస్తవమే.. ఆదివారం బిక్కవోలు వచ్చిన మాట వాస్తవమే.. అయితే పాత తేదీలతో సం తకాలు చేసినట్టు వస్తున్న ఆరోపణల్లో నిజం లేదని అవి ఎప్పుడో సంతకాలు చేసినవి ఇప్పుడు చేయలేదన్నారు. బదిలీపై వెళితే బిక్కవోలు రాకూడదా అని ప్రశ్నించడం కొసమెరుపు..

- పోసిబాబు, బిక్కవోలు నుంచి బదిలీ అయినా తహశీల్దార్‌

Updated Date - Feb 07 , 2024 | 12:50 AM