Share News

జిల్లా ఆసుపత్రిలో జలగలు

ABN , Publish Date - Jul 05 , 2024 | 12:55 AM

కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో బుధవారం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చాడు. కడియం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఎంఆర్‌ఐ చేయించుకోవాలని సూచించడంతో జీజీహెచ్‌కు వచ్చి ఓపీ చీటి రాయించుకున్నాడు.

జిల్లా ఆసుపత్రిలో జలగలు
జిల్లా ఆసుపత్రి భవనం

పేద రోగులను పీడిస్తున్న వైనం

ఎంఆర్‌ఐ, సీటీస్కాన్‌లకు డబ్బులు

ఆర్థోపెడిక్‌, క్యాజువాలిటీ డ్యూటీ పండగే

రోజుకు రూ.3 వేలు అదనపు సంపాదన

వైద్యాధికారుల చర్యలు శూన్యం

కలెక్టరమ్మా కాస్త ఇటు చూడమ్మా

రాజమహేంద్రవరం అర్బన్‌, జూలై 4 : కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి అనారోగ్యంతో బుధవారం రాజమహేంద్రవరం జీజీహెచ్‌కు వచ్చాడు. కడియం ప్రభుత్వాసుపత్రి వైద్యులు ఎంఆర్‌ఐ చేయించుకోవాలని సూచించడంతో జీజీహెచ్‌కు వచ్చి ఓపీ చీటి రాయించుకున్నాడు. ఎంఆర్‌ఐ స్కానింగ్‌ కోసం అక్కడున్న ఒక ఎంఎన్‌వోను సంప్రదించాడు. ఆ ఎంఎన్‌వో రూ.2 వేలు డిమాండ్‌ చేయడంతో అతనికి ఒక్కసారిగా కళ్లుబైర్లు కమ్మాయి. రోగంతో ఆసుపత్రికి వస్తే డబ్బులు డిమాండ్‌ చేస్తారా అంటూ ఆ వ్యక్తి ఆసుపత్రి బయట పెద్ద పెద్ద కేకలు వేయడంతో అక్కడున్న మరో ఎంఎన్‌వో అతనికి సర్దిచెప్పాడు. ముందు వైద్యం చేయించుకో అంటూ నచ్చచెప్పి పంపేశాడు...

రాజమహేంద్రవరం జీజీహెచ్‌లో కొందరు ఎంఎన్‌వోల (మేల్‌ నర్సింగ్‌ ఆర్డర్లీ) వసూళ్ల భాగోతం. ఇలా ఈ ఒక్క సంఘటన వెలుగు చూసినా ... బయటకు రాని అనేక వ్యవహారాలు జీజీహెచ్‌లోని ఎంఎన్‌వో విభాగంలో నిత్యకృత్యమవుతున్నాయి. ఎంఎన్‌వోల చేతులు తడిపితేనే కానీ రోగులకు వైద్యం అందని పరిస్థితి నెలకొంది. రూ.50, రూ.100 కాదు వేల రూపాయలు డిమాండ్‌ చేస్తుండడంతో పేదలు, సామాన్యులు వైద్యానికి ముడుపులు ఇచ్చుకోలేక పెద్దాసుపత్రి అంటేనే హడలిపోతున్నారు. ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌, ఆల్ర్టాసౌండ్‌ స్కానింగ్‌, ఎక్స్‌రే ఇలా అనేక పరీక్షలకు దర్జాగా డబ్బులు గుంజేస్తున్నారు. ఎంఎన్‌వోలు పేద రోగులను డబ్బుల కోసం జలగల్లా పట్టిపీడిస్తున్నా జీజీహెచ్‌ అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. అసలు ఎంఎన్‌వోలకు డ్యూటీలు వేసే సూపర్‌వైజర్‌ పైనా గతంలో అనేక ఆరోపణలున్నా పై అధికారులు పట్టించుకోకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఒకరికి బదులు మరొకరు ఉద్యోగం చేస్తున్నారంటూ కొద్ది రోజుల కిందట సూపర్‌వైజర్‌పై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో ఆర్‌ఎంలతో కమిటీ వేసి విచారణ జరిపించారు. ఆ నివేదిక ఏమైందో, ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియని దుస్థితి జీజీహెచ్‌లో దాపురించింది. అధికారులు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తినే మళ్లీ సూపర్‌వైజర్‌ను చేయడంతో ఎంఎన్‌వోల వసూళ్లకు అధికారులు పరోక్షంగా లైసెన్సు ఇచ్చినట్టయిందని వైద్య ఉద్యోగుల్లో చర్చించుకుంటున్నారు.

ఎంఎన్‌వోలదే కీలకపాత్ర..

తీవ్ర అనారోగ్యంతో ఉన్నవారు, వృద్ధులు, నడవలేని పరిస్థితిలో వైద్యం కోసం వచ్చే రోగులకు ఎంఎన్‌వోలు తక్షణ సహాయం అందించాల్సి ఉంటుంది. క్యాజువాలిటీ ప్రధాన ద్వారం నుంచి వీల్‌ఛైర్‌, స్ర్టెచర్‌ వంటి వాటి ద్వారా వారిని ఆసుపత్రిలోపలకు తీసుకువచ్చి డాక్టర్లకు చూపించాల్సి ఉంటుంది. వైద్యుడు చూసిన తర్వాత అవసరమైతే వారిని ఇన్‌పేషెంట్లుగా అడ్మిట్‌ రాస్తే ఆయా వార్డుల్లో చేర్పించాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌పేషెంట్లుగా ఉన్నవారికి ఎక్స్‌రే, ఈసీజీ, ఎంఆర్‌ఐ, సీటీ స్కాన్‌ వంటి టెస్ట్‌లు రాస్తే రోగిని అక్కడకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఓపీలో డాక్టర్‌కు చూపించుకునే వృద్ధులు, నడవలేని వారికి సహాయం చేయాల్సి ఉంటుంది. డాక్టర్‌కు సహాయకునిగాను వ్యవహరించాలి. కట్లు కట్టడం, గాయాలను శుభ్రం చేయడం, ప్రాథమిక వైద్యసేవలు వంటి విధులు నిర్వర్తించాలి. కొందరు ఎం ఎన్‌వోలు కేవలం డాక్టర్లకు మాత్రమే సహాయకులుగా వ్యవహరిస్తూ పైరవీలు సాగిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఇన్‌పేషెంట్లు, ఇతర రోగులను టెస్టులకు తీసుకెళ్లి, మరలా తీసుకురావడానికి బాధిత కుటుంబీకులనుంచి డబ్బులు డిమాండ్‌ చేస్తున్నారనే ఫిర్యాదులున్నాయి.

ఆ డ్యూటీలకు మంచి గిరాకీ ..

జీజీహెచ్‌లోని క్యాజువాలిటీ, ఆర్థోపెడిక్‌, ఈఎన్‌టీ వంటి కీలక విభాగాలతో పాటు మరికొన్ని చోట్ల ఎంఎన్‌వో డ్యూటీలకు విపరీతమైన గిరాకీ ఉంటుంది. ఇక్కడ డ్యూటీలు పడితే ఆ ఎంఎన్‌వోలకు పండగే. ఎందుకంటే ఒకొక్కక్కరు ఎంత లేదన్నా రోజుకు రెండు, మూడు వేలు ఇంటికి పట్టుకెళతారని ఎంఎన్‌వో ఉద్యోగుల్లోనే ప్రచారంలో ఉంది. అందుకే ఇక్కడ డ్యూటీ వేయించుకోవడానికి వారం వారం గోకవరం నుంచి నాటుకోళ్లు, వేటమాంసాలు, కూరగాయలు వంటివి సమర్పించుకోవాల్సిందేననే ప్రచారం జీజీహెచ్‌లో గుప్పుమంటోంది. జీజీహెచ్‌ ఉన్నతాధికారులు ఒక్కసారి ఎంఎన్‌వోల అటెండెన్స్‌ రోస్టర్‌ పరిశీలిస్తే ఈ డ్యూటీల భాగోతం వెలుగు చూసే అవకాశం ఉన్నా అవేమీ పట్టించుకున్న దాఖలాలేవు. దీంతో కొందరు ఎంఎన్‌వోలు దండుకోవడంలో దూకుడు చూపిస్తున్నారు. ఇదేంటని రోగులు, వారి సహాయకులుగాని, ఇతరులు ఎవరైనా అడిగితే వారిపైనా దౌర్జన్యం చేయడానికి కూడా వెనుకాడడంలేదంటే పరిస్థితులు ఎంత అదుపుతప్పాయో అర్థమవుతోంది.

మొత్తం 45 మంది..

రెగ్యులర్‌, ట్రామాకేర్‌, జీడీఏలు (జనరల్‌ డ్యూటీ అటెండెంట్లు) కలిపి మొత్తం 45 మంది ఎంఎన్‌వోలుగా జీజీహెచ్‌లో పనిచేస్తున్నారు. వీరిలో నలుగురు రెగ్యులర్‌, ఏడుగురు ట్రామాకేర్‌ మినహా మిగిలిన వారంతా జీడీఏలే ఉన్నారు. జీడీఏల్లో 8 మందిని ఆఫీసులో సహాయకులుగా నియమించారు. మిగిలిన వారంతా ఎంఎన్‌వోలుగా పనిచేస్తున్నారు. ఎంఎన్‌వోలు, జీడీఏలకు నెలరోజులకు ఒకసారి డ్యూటీ రోస్టర్‌ అమలు చేస్తుంటారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ, 2 నుంచి రాత్రి 8 గంటల వరకూ, రాత్రి 8 నుంచి మర్నాడు ఉదయం 8 గంటల వరకూ షిప్టులుగా పనిచేస్తుంటారు. రోస్టర్‌ ప్రకారం మొదటి షిప్టులో సుమారు 20 మంది వరకూ ఎంఎన్‌వోలు పనిచేస్తున్నా రోగులకు పూర్తిస్థాయిలో వైద్యసేవలు లభించడంలేదు సరికదా వీరిలో కొందరిపై తీవ్రమైన డబ్బుల వసూళ్ల ఆరోపణలున్నాయి. నెలలో పదిరోజులకు ముగ్గురు చొప్పున జీడీఏలకు ప్రత్యేకంగా ఎమర్జన్సీ ఓపీ రిజిస్ర్టేషన్‌ వేస్తున్నా వీరంతా ఎక్కడ విధులు నిర్వర్తిస్తున్నారనేది ప్రశ్నార్థకం.ఈ పరిస్థితుల్లో కాస్త ఇటు చూడమ్మా అంటూ కలెక్టర్‌ను పేద రోగులు దీనంగా వేడుకుంటున్నారు.

Updated Date - Jul 05 , 2024 | 12:55 AM