Share News

భయం గుప్పెట్లో లంక గ్రామాలు..ఉధృతంగా గోదావరి

ABN , Publish Date - Jul 28 , 2024 | 12:25 AM

గోదావరి వరద కోనసీమ ప్రజలతో దోబూచులాడుతోంది. తగ్గుతున్నట్టు భావించిన తరుణంలో వరద ప్రవాహం శనివారం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కోనసీమలోని 12 మండలాల పరిధిలో లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.

 భయం గుప్పెట్లో లంక గ్రామాలు..ఉధృతంగా గోదావరి
పి.గన్నవరం: బూరుగులంక రేవు వద్ద సాగుతున్న పడవ ప్రయాణం

అమలాపురం, జూలై 27(ఆంధ్రజ్యోతి): గోదావరి వరద కోనసీమ ప్రజలతో దోబూచులాడుతోంది. తగ్గుతున్నట్టు భావించిన తరుణంలో వరద ప్రవాహం శనివారం మరోసారి ఉగ్రరూపం దాల్చింది. ఫలితంగా కోనసీమలోని 12 మండలాల పరిధిలో లంక గ్రామాల ప్రజలు భయం గుప్పెట్లో గడుపుతున్నారు. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయడంతో పాటు ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. శనివారం 13.20 లక్షల క్యూసెక్కుల నీటిని బంగాళాఖాతంలోకి వదలడంతో జిల్లాలోని గౌతమీ, వశిష్ట, వైనతేయ, వృద్ధగౌతమీ నదీపాయలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీనికి తోడు శనివారం సాయంత్రం నుంచి వర్షపు జల్లులు కురుస్తుండడంతో ప్రజలు మరింత ఆందోళన చెందుతున్నారు. మహారాష్ట్రతో సహా గోదావరి నదీ పరివాహక రాష్ట్రాల్లో భారీ వర్షాలు తీవ్రంగా కురుస్తున్న దృష్ట్యా రాగల రోజుల్లో వరద తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉందని జలవనరులశాఖ అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కలెక్టర్‌ మహేష్‌కుమార్‌ సఖినేటిపల్లి మండల పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పడవపై వెళ్లి పరిస్థితిని సమీక్షించారు. వరద ముంపునకు గురైన బాధితులకు బియ్యం పంపిణీ చేపట్టారు. కుటుంబానికి 25 కిలోల బియ్యం, కిలో వంటనూనె, కందిపప్పు వంటి నిత్యావసర సరుకులను లంక గ్రామాల బాధితులకు పంపిణీ చేస్తున్నారు. మంచినీరు కూడా టిన్నుల ద్వారా అందజేస్తున్నారు. వరద ఉధృతి కొనసాగుతున్న నేపథ్యంలో జిల్లాలోని మేజర్‌, మైనర్‌ డ్రెయిన్లు, పంటకాల్వలు పొంగి ప్రవహిస్తుండడం వల్ల ఇప్పటికే 35వేల ఎకరాల భూముల్లో ఖరీఫ్‌ పంటకు నష్టం వాటిల్లింది. ఇక ఉద్యాన, వాణిజ్య పంటలకు నష్టం అపారమే. పశువులు కూడా మేతలేక ఇబ్బందులు పడుతున్నాయి. రానున్న రెండు రోజుల్లో వరద ముంపు పెరిగితే కోనసీమలోని నదీపరివాహక లంక గ్రామాల ప్రజలకు గడ్డు పరిస్థితే. ఇళ్లు మునిగిపోవడంతో ఏటిగట్లపై తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్న బాధితులు భయం గుప్పెల్లో జీవిస్తున్నారు. వరద తగ్గుముఖం పట్టే వరకు తమ బతుకులు ఏటిగట్టుపైనే అంటూ లంకలగన్నవరం గ్రామంలో బాధితులు ఆవేదన చెందుతున్నారు.

Updated Date - Jul 28 , 2024 | 12:25 AM