Share News

ప్రభుత్వ స్థలాల్లో అనధికార నిర్మాణాలు

ABN , Publish Date - Mar 12 , 2024 | 12:30 AM

పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో అనధికార నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టౌన్‌ ప్ల్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు.

ప్రభుత్వ స్థలాల్లో అనధికార నిర్మాణాలు
సమావేశంలో పాల్గొన్న మున్సిపల్‌ కౌన్సిలర్లు

  • ఇన్‌చార్జిలకు ఇచ్చే గౌరవం కౌన్సిర్లకు ఇవ్వడం లేదు

  • కొవ్వూరు కౌన్సిల్‌ అత్యవసర సమావేశంలో కౌన్సిలర్ల ఆగ్రహం

  • నిధుల కేటాయింపులో వివక్ష: కౌన్సిలర్‌ రామారావు

కొవ్వూరు, మార్చి 11: పట్టణంలో ప్రభుత్వ స్థలాల్లో అనధికార నిర్మాణాలు యథేచ్ఛగా జరుగుతున్నాయని టౌన్‌ ప్ల్లానింగ్‌ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంపై కౌన్సిలర్లు ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బావన రత్నకుమారి అధ్యక్షతన మున్సిపల్‌ కౌన్సిల్‌ అత్యవసర సమావేశం నిర్వహించారు. బీజేపీ కౌన్సిలర్‌ పిల్లలమర్రి మురళీకృష్ణ మాట్లాడుతూ గోష్పదక్షేత్రంలోను, గోదావరి బండ్‌పై అనధికారికంగా శాశ్వత భవనాల నిర్మాణం జరుగుతోందని, నిలుపుదల చేయాలని టౌన్‌ప్లానింగ్‌, మున్సిపల్‌ కమిషనర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. నిర్మాణాలు ఎవరి ప్రోద్బలంతో జరుగుతున్నాయని, ప్రశ్నించారు. తక్షణం తొలగించాలన్నారు. టీపీవో శ్రీధర్‌ మాట్లాడుతూ వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో నిర్మాణాలను అడ్డుకోలేకపోయామని, వెంటనే తొలగింపు చర్యలు తీసుకుంటామన్నారు. కండెల్లి రామారావు మాట్లాడుతూ రోడ్డు కం రైలు బ్రిడ్జి టోల్‌గేట్‌ వద్ద రోడ్డు పక్కన పెద్ద పెద్ద రేకులషెడ్లు వేసి కాంక్రీట్‌తో నిర్మాణాలు చేపట్టారన్నారు. టీడీపీ ఫ్లోర్‌లీడర్‌ సూరపనేని చిన్ని మాట్లాడుతూ వరుస సెలవులు వచ్చాయని అక్రమ కట్టడాలను అడ్డుకోలేక పోయామని చెప్పడం సరికాదన్నారు. అక్రమ నిర్మాణాలపై గతంలో అనేకసార్లు సభ దృష్టికి తీసుకొచ్చామని, కౌన్సిలర్లతో కమిటీ కూడా వేశారన్నారు. పట్టణంలో మెయిన్‌రోడ్‌, రైట్‌ చికెన్‌ రోడ్డు పూర్తిగా మరమ్మతులకు గురయ్యాయని, కాంట్రాక్టర్‌ను పిలిచి మరమ్మతులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కంటమణి రమేష్‌బాబు మాట్లాడుతూ గోష్పదక్షేత్రంలో అక్రమ నిర్మాణాలపై 2,3 నెలలుగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. కండెల్లి రామారావు మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో చేపట్టిన పనుల్లో ఔరంగాబాద్‌కు కేవలం రూ.3.50 లక్షలు కేటాయించి తనపై వివక్ష చూపుతున్నారన్నారు. పనులు అజెండాలోకి తీసుకువచ్చే ముందు కౌన్సిలర్‌ను సంప్రదిస్తే అత్యవసర పనులను సూచిస్తామన్నారు. బొండాడ సత్యనారాయణ మాట్లాడుతూ వైసీపీ వార్డు ఇన్‌చార్జులకు ఇస్తున్న గుర్తింపు, టీడీపీ కౌన్సిలర్లకు ఇవ్వడం లేదన్నారు. కౌన్సిలర్ల పట్ల ప్రొటోకాల్‌ పాటించడం లేదన్నారు. ఎన్నికల కోడ్‌ వస్తుందని అభివృద్ధి పనులకు హడావుడిగా కొబ్బరికాయలు కొడుతున్నారన్నారు. సూరపనేని చిన్ని మాట్లాడుతూ కొవ్వూరు ఎమ్మెల్యే తానేటి వనిత అని, తలారి వెంకట్రావు కాదని, ఆయన కొవ్వూరు నియోజకవర్గానికి వైసీపీ నియమించిన ఇన్‌చార్జి మాత్రమేనన్నారు. ఇప్పటివరకు గడప గడపకు కార్యక్రమంలో 82 పనులు చేపట్టి, 15 పనులు పూర్తిచేశారని, నాలుగు రోజుల్లో ఎన్నికల కోడ్‌ వస్తుంది మిగిలిన పనులు ఎప్పుడు చేస్తారని అధికారులను ప్రశ్నించారు. మార్కెట్‌ ఆశీల పాటకు సంబందించి కౌన్సిల్‌ అజెండాలోకి తీసుకురాకుండా చైర్‌పర్సన్‌తో ర్యాటిఫికేషన్‌ చేయించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపారు. చీర అరుణ మాట్లాడుతూ బ్రిడ్జిపేటకు వచ్చే తాగునీటి పైపులైను లీకులను అరికట్టాలన్నారు. చైర్‌పర్సన్‌ రత్నకుమారి మాట్లాడుతూ సమావేశంలో సభ్యులు సభామర్యాదను పాటించాలని, అజెండా చదువుతున్నప్పుడు ఎవ్వరికి వారు కబుర్లు చెప్పుకోవడంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. రహదారి మరమ్మతులు, తాగునీటి పైపులైను లీక్‌లను అరికట్టాలని అధికారులకు సూచించారు.

Updated Date - Mar 12 , 2024 | 12:30 AM