Share News

బంగారు దొంగలను పట్టేశారు

ABN , Publish Date - Feb 27 , 2024 | 12:27 AM

కేటుగాళ్లు సినీ ఫక్కీలో భారీ దొంగతనం చేస్తే.. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తమదైన రూటులో వెళ్లి కేవలం ఐదు రోజుల్లో ఆటకట్టించారు.

బంగారు దొంగలను పట్టేశారు

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 26(ఆంధ్రజ్యోతి): కేటుగాళ్లు సినీ ఫక్కీలో భారీ దొంగతనం చేస్తే.. తూర్పుగోదావరి జిల్లా పోలీసులు తమదైన రూటులో వెళ్లి కేవలం ఐదు రోజుల్లో ఆటకట్టించారు. ఈ మేరకు ఎస్పీ జగదీశ్‌ వివరాలను వెల్లడించారు. భీమవరానికి చెందిన బాలు నాథూరామ్‌ బంగారం షాపుల నుంచి వచ్చే ఆర్డర్ల ప్రకారం అభరణాలను సరఫరా చేసే వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 21న తన కారులో ఆభరణాలు షాపులకు ఇవ్వడానికి దూబచర్ల, జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం బయలు దేరారు. చీకటి పడుతున్న సమయంలో కొయ్యలగూడెం దాటిన తర్వాత ఇన్నోవాలో ఐదుగురు దుండగులు వచ్చి తాము ఇన్‌కంట్యాక్స్‌ అధికారులమంటూ నాథూరామ్‌ని ఆపారు. బాలును, డ్రైవరు సురేశ్‌ని తమ కారులో ఎక్కించుకున్నారు. ఐదుగురిలో ఇద్దరు దుండగులు నాథూరామ్‌ కారులో బయలుదేరారు. రాజమహేంద్రవరం దగ్గరలోని దివాన్‌ చెరువు, లాలాచెరువు ప్రాంతాలు తిప్పి నాలుగో వంతెన సమీపంలోని జీరో పాయింట్‌ వద్ద నాథూరాంను దించేసి ఆయన కారును అప్పగించి దుండగులు పరారయ్యారు. కారులోని 3.50 కిలోల ఆభరణాలు, రూ.5 లక్షల నగదు అపహరణకు గురైందని గమనించి నాథూరాం పోలీసులను ఆశ్రయించారు. ఎస్పీ ఆదేశాలతో దోపిడీ నల్లజర్ల పోలీస్‌ స్టేషను పరిధిలో జరిగినట్టు గుర్తించి ఆ స్టేషనులో కేసు నమోదు చేశారు. ఎస్పీ జగదీశ్‌ స్వీయ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలను నియమించారు. దర్యాప్తులో కొందరు అనుమాస్పద వ్యక్తులు ఇన్నోవాలో విజయవాడ వైపు వెళ్తున్నారనే సమాచారంతో తనిఖీలు నిర్వహించారు. కారులోని వాళ్లను ప్రశ్నించిన అనంతరం 12 మందిని నిందితులుగా గుర్తించామని ఎస్పీ వివరించారు. వీళ్లలో జంగారెడ్డిగూడెంకు చెందిన చలపాక వెంకటేశ్‌, మద్దిపాటి కల్యాణ్‌, కోడూరి రవితేజ, కోనా శ్రీనివాస్‌, వేముల మంజుబాబు, షేక్‌ నాగూర్‌ మీరావలి, వేముల మోహన్‌ సాయి, మోహన్‌ నారాయణ్‌ కుంబాకర్‌, పమిడిపల్లి బ్రహ్మాజీలను అరెస్టు చేశామన్నారు. వీరందరూ పాత నేరస్తులని, నగల వ్యాపారం చేసేవాళ్లు, తయారీ దారులు కూడా ఉన్నారన్నారు. పఽథకం ప్రకారం దోపిడీకి దిగారన్నారు. మరో ముగ్గురి కోసం గాలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. సుమారు రూ.2 కోట్ల విలువైన 181 బంగారు గొలుసులు, కరిగించిన బంగారు కడ్డీలు మొత్తం 3.50 కిలోల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసులో ప్రతిభ చూపిన కొవ్వూరు డీఎస్పీ కేసీహెచ్‌ రామారావు, నార్త్‌ జోన్‌ డీఎస్పీ కె.శ్రీనివాసులు, నల్లజర్ల సీఐ కె.దుర్గాప్రసాద్‌, రాజమహేంద్రవరం సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు కె.రజనీకుమార్‌, కె.విజయబాబు, ఉమామహేశ్వరరావు, దేవరపల్లి ఎస్‌ఐ కె.శ్రీహరి, టీవీ సురేశ్‌, ఐటీ కోర్‌ ఎస్‌ఐ ఎం.అయ్యప్పరెడ్డి తదితర సిబ్బందికి ఎస్పీ ప్రశంసాపత్రాలు అందజేసి అభినందించారు.

Updated Date - Feb 27 , 2024 | 12:27 AM