Share News

గోదావరిలో ముగ్గురు గల్లంతు

ABN , Publish Date - May 19 , 2024 | 12:31 AM

వాళ్లు ఐదుగురు స్నేహితులు.. సెలవులు కావడంతో సరదాగా బయటకు వెళదామనుకుని గోదావరి ఒడ్డుకు వచ్చారు. సరదాగా ఈత కొడదామనుకుని వారిలో నలుగురు గోదావరిలో దిగారు. అయితే దురదృష్టవశాత్తూ ముగ్గురు మునిగిపోయి గల్లంతయ్యారు.

గోదావరిలో ముగ్గురు గల్లంతు

ఇద్దరి మృతదేహాలు లభ్యం

ఒకరి ఆచూకీ కోసం గాలింపు

రావులపాలెం, మే 18: వాళ్లు ఐదుగురు స్నేహితులు.. సెలవులు కావడంతో సరదాగా బయటకు వెళదామనుకుని గోదావరి ఒడ్డుకు వచ్చారు. సరదాగా ఈత కొడదామనుకుని వారిలో నలుగురు గోదావరిలో దిగారు. అయితే దురదృష్టవశాత్తూ ముగ్గురు మునిగిపోయి గల్లంతయ్యారు. వారిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా, మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. ఈ విషాదకర సంఘటన శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రావులపాలెం గౌతమి పాతబ్రిడ్జి సమీపంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రావులపాలెం చినవంతెన వద్ద ఉంటున్న సబ్బెళ్ళ ఈశ్వరరెడ్డి(20), అతని సోదరుడు సత్యనారాయణరెడ్డి, పిన్ని కొడుకు సత్తి సంపతరెడ్డి(16), అక్కడే నివాసం ఉంటున్న పెంటా జయకుమార్‌(19), కొమ్మర్తి రాజేష్‌ ఈ ఐదుగురు స్నేహితులు. కాగా సంపతరెడ్డి విజయనగరం నుంచి వేసవి సెలవులకు రావులపాలెం పిన్ని ఇంటికి వచ్చాడు. ఐదుగురు స్నేహితులు కలిసి మధ్యాహ్న సమయంలో గోదావరి స్నానం చేద్దామని గౌతమి గోదావరి పాతబ్రిడ్జి వద్దకు వెళ్లి అక్కడ నుండి ఇసుక మేటలో కిలోమీటరు మేర నడిచి నీటి ప్రవాహం వద్దకు చేరుకున్నారు. వీరిలో పెద్దవాడైన సత్యనారాయణరెడ్డికి ఈత రాకపోవడంతో గట్టున కూర్చుని ఉన్నాడు. మిగిలిన నలుగురు గోదావరిలో స్నానానికి దిగారు. కొంతసేపటికే అందరూ మునిగిపోయారు. వారిలో కొమ్మర్తి రాజేష్‌ కంగారుగా బయటకు వస్తుండటంతో అక్కడే ఉన్న సత్యనారాయణరెడ్డి ముగ్గురు గల్లంతయినట్లు గుర్తించి కేకలు వేశాడు. ఆ సమీపంలో ఉన్న ఇద్దరు వ్యక్తులు వచ్చి గల్లంతైన వారి కోసం వెతికిన ప్రయోజనం లేకపోయింది. పోలీసులకు సమాచారం అందించడంతో సీఐ ఎం.ఆంజనేయులు, రెవెన్యూ, కొత్తపేట ఫైర్‌ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టారు. సబ్బెళ్ళ ఈశ్వరరెడ్డి, పెంటా జయకుమార్‌, మృతదేహలు లభ్యం కాగా గల్లంతైన సంపతరెడ్డి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. మృతదేహాలను కొత్తపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు సీఐ ఆంజనేయులు, తహసీల్దారు అశోక్‌వర్మ తెలిపారు.

గుండెలవిసేలా రోదిస్తున్న

సోదరుడు

ఐదుగురులోని ముగ్గురు అన్నదమ్ములు కాగా మరో ఇద్దరు స్నేహితులు. సబ్బెళ్ళ సత్యనారాయణరెడ్డి మృతిచెందిన సబ్బెళ్ళ ఈశ్వరరెడ్డిలు సొంత అన్నదమ్ములు కాగా వాళ్ళ పిన్ని కొడుకు సత్తి సంపతరెడ్డి వేసవి సెలవులు అని పెద్దమ్మ ఇంటికి రావులపాలెం వచ్చాడు. గోదావరి స్నానానికి వెళ్లిన సమయంలో తమ్ముళ్లు ఇద్దరు నదిలో గల్లంతు కావడంతో సత్యనారాయణరెడ్డి గుండెలవిసేలా రోదించాడు. ఈశ్వరరెడ్డి మృతదేహం లభ్యం కాగా సంపతరెడ్డి మృతదేహం కోసం గాలిస్తున్నారు. సత్యనారాయణరెడ్డి తండ్రి సూర్యనారాయణరెడ్డి వ్యవసాయం చేసుకుంటూ కంద అమ్ముతూ జీవనం సాగిస్తున్నాడు. చిన్న కుమారుడు ప్రమాదంలో మృతిచెందడంతో ఆ కుటుంబం తీవ్రవిషాదంలో మునిగిపోయింది. వేసవి సెలవులకు వచ్చిన సంపతరెడ్డి గల్లంతవ్వడంతో విజయనగరంలో నివాసం ఉంటున్న తండ్రి దుర్గారెడ్డికి బంధువులు సమాచారం అందించారు. అక్కాచెల్లెళ్ల బిడ్డలు ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా ఒకరు గల్లంతు కావడంతో ఆ కుటుంబాలు రోదిస్తున్న తీరు స్థానికులను సైతం కంటతడిపెట్టించింది.

చేతికి వచ్చిన కొడుకు మృతిపై

తండ్రి ఆవేదన..

రావులపాలెం చినవంతెన వద్ద నివాసం ఉంటున్న జయకుమార్‌ తండ్రి వడ్రంగి పనిచేస్తూ కొడుకును చదివిస్తున్నాడు. జయకుమార్‌ స్థానిక డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతూ ఖాళీ సమయంలో ఫొటో స్టూడియోలో పనిచేస్తూ తండ్రికి చేదొడువాదొడుగా ఉంటున్నాడు. చేతికి అందివచ్చిన కొడుకు మృతిచెందడంతో ఆ కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవ్వరివల్ల కాలేదు. కాగా సబ్బెళ్ళ ఈశ్వరరెడ్డి ఓడలరేవు ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. సంపతరెడ్డి 10వ తరగతి చదువుతున్నాడు.

గోదావరిలో

వరుస ఘటనలతో ఆందోళన...

గోదావరిలో వరుస ఘటనలు జరగడంతో నదీ పరివాహక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఆలమూరు మండలం మడికికి చెందిన ముగ్గురు మహిళలు వాడపల్లి వెంకన్న దర్శనానికి వెళ్తూ బడుగువారిలంక వాని వద్ద ముగ్గురు మృతిచెందిన సంఘటన మరువక ముందే ఐదు కిలోమీటర్ల దూరంలో వారం తిరగకుండా రావులపాలెం గౌతమి పాతబ్రిడ్జి వద్ద గోదావరిలో ఇద్దరు గోదావరిలో ఈతకు వెళ్లి మృతిచెందడం, మరొకరు గల్లంతు కావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కాలువలకు నీటిసరఫరా నిలుపుదల చేయడం వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నీటి ప్రవాహం అధికంగా ఉండటమే ఈ ప్రమాదాలకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. గోదావరి చెంతకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Updated Date - May 19 , 2024 | 12:31 AM