Share News

నకిలీ నెయ్యి తయారీ గుట్టురట్టు

ABN , Publish Date - Feb 15 , 2024 | 01:26 AM

మార్కెట్‌లో లభించే ఏ సరుకు కొనాలో, ఏది అసలో ఏది నకిలీనో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మార్కెట్‌లో లభించే నెయ్యి కొంత తక్కువ ధరకు విక్రయించేందుకు ఒక వ్యాపారి నకిలీని ఎన్నుకున్నాడు. వెన్న లేకుండానే టన్నుల నెయ్యిని తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నాడు.

నకిలీ నెయ్యి తయారీ గుట్టురట్టు

అనపర్తి, ఫిబ్రవరి 14: మార్కెట్‌లో లభించే ఏ సరుకు కొనాలో, ఏది అసలో ఏది నకిలీనో తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మార్కెట్‌లో లభించే నెయ్యి కొంత తక్కువ ధరకు విక్రయించేందుకు ఒక వ్యాపారి నకిలీని ఎన్నుకున్నాడు. వెన్న లేకుండానే టన్నుల నెయ్యిని తయారు చేసి విక్రయాలు సాగిస్తున్నాడు. అనపర్తి మండలం పొలమూరులో వరి పొలాలకు ఆనుకుని గ్రామానికి చెందిన తమలంపూడి రాజారెడ్డి స్వీట్స్‌ తయారీ పేరుతో కార్ఖానా ఏర్పాటు చేసి రెండేళ్లుగా నకిలీ నెయ్యి తయారు చేస్తూ విక్రయాలు సాగిస్తున్నాడు. తయారు చేసిన కొంత భాగాన్ని ఒడిసాకు తరలిస్తుండగా కొంత భాగాన్ని ఇక్కడ రిటైల్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నాడు. మార్కెట్‌లో లభ్యమైన నకిలీ నెయ్యి డబ్బాపై ఎటువంటి నిర్దిష్టమైన ప్రచురణలు లేకపోవడంతో విజిలెన్స్‌ అధికారులు తయారీ కేంద్రంపై దృష్టి సారించారు. బుధవారం జిల్లా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఎస్పీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో విజిలెన్స్‌, పుడ్‌ సేఫ్టీ, లీగల్‌ మెట్రాలజీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. నకిలీ నెయ్యి తయారీకి వినియోగించే సన్‌ప్లవర్‌ ఆయిల్‌, వనస్పతి, పామాయిల్‌, జాబిలాల సీడ్స్‌, ఆర్టిఫిషియల్‌ ప్లేవర్‌తో ధనేశ్వరి బ్రాండ్‌పై నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్టు గుర్తించారు. నకిలీ నెయ్యి తయారీకి వినియోగించే సుమారు రూ.7 లక్షల విలువైన ముడి సరుకును సీజ్‌ చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఎస్పీ ముత్యాల నాయుడు మాట్లాడుతూ నకిలీ నెయ్యి తయారీ చేస్తున్నారన్న సమాచారంతో దాడులు నిర్వహించామన్నారు. స్వీట్‌ తయారీ పేరుతో అనుమతులు తీసుకుని నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు గుర్తించామని, సుమారు టన్ను నకిలీ నెయ్యి స్వాధీనం చేసుకున్నామన్నారు. జిల్లా అసిస్టెంట్‌ ఫుడ్‌ కంట్రోలర్‌ శ్రీనివాస్‌ మాట్లాడుతూ సిద్ధి పేరుతో నకిలీ నెయ్యి తయారు చేస్తున్న రాజారెడ్డిపై కేసు నమోదు చేస్తున్నట్టు తెలిపారు. తయారీ కేంద్రంలో సేకరించిన శాంపిల్స్‌ను ల్యాబ్‌కు తరలిస్తున్నామని నివేదిక ప్రకారం క్రిమినల్‌ కేసులు కూడా నమోదు చేస్తామన్నారు. జిల్లా లీగల్‌ మెట్రాలజీ అసిస్టెంట్‌ కంట్రోలర్‌ శామ్యూల్‌ రాజు మాట్లాడుతూ ప్యాకింగ్‌ రిజిస్ట్రేషన్‌ సర్టిఫికెట్‌, కాటాపై సీల్‌, ప్యాకింగ్‌పై కస్టమర్‌ కేర్‌ నెంబరు ముద్రించి ఉండాలని ఈ మూడు నిబంధనలను పాటించక పోవడంతో మూడు కేసులు నమోదు చేశామన్నారు. విజిలెన్స్‌ సీఐ నాగేంద్రకుమార్‌, ఎస్‌ఐ జగన్నాథరెడ్డి, డీటీ శశిధర్‌ పాల్గొన్నారు.

Updated Date - Feb 15 , 2024 | 01:26 AM