Share News

మృత్యుపాశం

ABN , Publish Date - Nov 05 , 2024 | 01:15 AM

వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ... రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వీరివి.. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుంటారు. సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహ ఏర్పాటులో కూడా అంతే ఉత్సాహం చూపారు. 18 నెలలుగా వివాదం నెలకొనడంతో ఎప్పుడెప్పుడు విగ్రహావిష్కరణ జరుగుతుందా అని ఎదురు చూశారు.

మృత్యుపాశం

సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహావిష్కరణకు ఏర్పాట్లు

ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతం

తాడిపర్రులో తీవ్ర విషాదం

గ్రామంలో 144 సెక్షన ఏర్పాటు

ఫ్లెక్సీల తొలగింపునకు తహసీల్దారు ఆదేశాలు

కన్నీరుమున్నీరుగా విలపించిన బంధువులు

మృతుల కుటుంబాలకు మంత్రి దుర్గేశ, కలెక్టర్‌ ప్రశాంతి పరామర్శ

ప్రభుత్వం తరపున రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటన

వీర్రాజు, నాగేంద్ర, మణికంఠ, కృష్ణ... రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు వీరివి.. గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినా ముందుంటారు. సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహ ఏర్పాటులో కూడా అంతే ఉత్సాహం చూపారు. 18 నెలలుగా వివాదం నెలకొనడంతో ఎప్పుడెప్పుడు విగ్రహావిష్కరణ జరుగుతుందా అని ఎదురు చూశారు. వేర్వేరు కారణాలతో ఇరు వర్గాల మధ్య తరచూ ఘర్షణలు జరగ్గా జిల్లా అధికారులు, నాయకులు శాంతి చర్చలు జరిపారు. ఒక కమిటీ వేసి కొన్ని నిబంధనలతో విగ్రహాన్ని ఏర్పాటు చేసుకునేందుకు అనుమతిచ్చారు. దీంతో ప్రారంభోత్సవ ఏర్పాట్లలో భాగంగా భారీ ఫ్లెక్సీ కడుతుండగా విద్యుదాఘాతంతో ఆ నలుగురు యువకులూ తనువు చాలించారు.

ఉండ్రాజవరం/పెరవలి, నవంబరు 4 (ఆంధ్ర జ్యోతి): తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం తాడిపర్రులో సోమవారం ఉదయం సర్దార్‌ పాపన్న గౌడ్‌ విగ్రహానికి ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. విగ్రహా విష్కరణను ఎంతో ఘనంగా నిర్వహించాలని తలంచారు. అనుకున్నదే తడవుగా 20 అడుగుల భారీ ఫ్లెక్సీ చేయించారు. దానిని ఎంతో ఉత్సాహంగా తీసుకొచ్చి తెల్లవారుజామున ఏర్పాటుకు ఉపక్రమించారు. ఐరన్‌ చట్రానికి ఫ్లెక్సీని అంటించి కర్రలతో నిలబెట్టే సమయంలో రోడ్డు పక్క నుంచి వెళ్లిన 6.3 కేవీ సింగిల్‌ ఫేజ్‌ వైరు తగిలింది. ఐరన్‌ చట్రానికి విద్యుత ప్రవహించగా ఫ్లెక్సీ పట్టుకున్న ఏడుగురు యువకుల్లో బొల్లా వీర్రాజు (26), పామర్తి నాగేంద్ర (25), మారిశెట్టి మణికంఠ (26), కాసగాని కృష్ణ (25) అక్కడికక్కడే మరణించారు. కోమటి అనంతరావు తీవ్ర గాయాలపాలయ్యాడు. వెలిగట్ల పవన్‌, కోమటి వీర వెంకట సత్యనారాయణలకు స్వల్ప గాయాలయ్యాయి. రోజువారీ కూలితో కుటుంబాలు నెట్టుకొస్తున్న పేదల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి.

తాడిపర్రు గ్రామానికి చెందిన బొల్లా వీర్రాజుకు 14 నెలల కిందట పెళ్లయింది. రెండు నెలల పాప ఉంది. తల్లిదండ్రులు, భార్య ఉన్నారు. వ్యవసాయం, కొబ్బరి దింపు పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. మళ్లీ వస్తానంటూ వెళ్లావు కదరా... త్వరగా రా అంటూ తండ్రి త్రిమూర్తులు రోదిస్తున్న తీరు చూపరులను కంటతడి పెట్టించింది.

పామర్తి నాగేంద్రకు పట్టింపాలెం గ్రామానికి చెందిన దుర్గతో వివాహమైంది. వీరికి 8 నెలల పాప ఉంది. కొబ్బరి దింపు కార్మికుడిగా జీవనం సాగిస్తున్నాడు. భర్త మృతి వార్తను జీర్ణించుకోలేకపోతోంది. తనకు దిక్కు ఎవరూ అంటూ రోదిస్తోంది. తల్లిదండ్రులు శ్రీను, ఆదిలక్ష్మి, అన్నయ్య వెంకటకృష్ణ ఉన్నారు.

మణికంఠ పూల డెకరేషన్‌లకు వెళ్తుంటాడు. ఖాళీ సమయాల్లో వ్యవసాయ పనులకు వెళుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇతడికి భార్య భవాని, అమ్మాయి (5), అబ్బాయి (3) ఉన్నారు. నలుగురు తోబుట్టువులు ఉన్నారు. ఒక్కడే అబ్బాయి కావడంతో మణికంఠను అల్లారుముద్దుగా పెంచారు. ఒక్కగానొక్క కుమారుడు ఇక లేడని తెలియడంతో తల్లిదండ్రులు పద్దయ్య, లక్ష్మి, సోదరీమణులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

కాసగాని కృష్ణ పెయింటింగ్‌ షాపులో చిరుద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇంకా పెళ్లి కాలేదు. తండ్రి రాము ఉపాధి నిమిత్తం దుబాయ్‌లో ఉన్నాడు. ఇటీవలే అనారోగ్యం రావడంతో వచ్చి ఆపరేషన్‌ చేయించుకుని నెల కిందట దుబాయ్‌ వెళ్లాడు. అక్కడ ఆర్థిక పరిస్థితి బాగోలేకపోవడంతో వారం, పది రోజుల్లో ఇండియా వచ్చేస్తాడని బంధువులు చెప్పారు. ఒక్కగానొక్క కొడుకు మృతి చెందడంతో.... ఇక మేమెందుకు బతకాలంటూ తల్లి పద్మ కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమెను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు.

తీవ్ర గాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోమటి అనంతరావు కోడిగుడ్లు కట్టుబడి పనికి వెళుతుంటాడు. ఇతడికి ఇద్దరు మగ పిల్లలు. తీవ్ర గాయాలతో ఉన్న భర్తను చూసి భార్య, తల్లిదండ్రులు సత్యనారాయణ, వెంకటలక్ష్మి కన్నీటిపర్యంతమయ్యారు.

తణుకు ఆసుపత్రిలో మృతదేహాలను మంత్రి కందుల దుర్గేశ పరిశీలించి కుటుంబసభ్యులను ఓదార్చారు. అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం నుంచి ఒక్కొక్కరికీ రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కోమటి అనంతరావు, వెలిగట్ల పవన్‌, కోమటి వీర వెంకట సత్యనారాయణలను మంత్రి దుర్గేశ, మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పరామర్శించారు. మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు.

తాడిపర్రులో ఘటనా ప్రాంతాన్ని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి సోమవారం పరిశీలించారు. సంఘటన పట్ల విచారం వ్యక్తం చేసి బాధిత కుటుంబీకులను ఓదార్చారు. గ్రామంలో మరో సామాజికవర్గంవారు తమపై తరచూ ఘర్షణకు దిగుతున్నారని గౌడ సామాజికవర్గ మహిళలు కలెక్టర్‌కు మొరపెట్టుకున్నారు. కలెక్టర్‌ కారు ముందు నిలుచుని తమకు న్యాయం చేసి వెళ్లాలంటూ నినాదాలు చేశారు. ఆర్డీవో రాణిసుస్మిత, డీఎస్పీ దేవకుమార్‌ నచ్చజెప్పడంతో మహిళలు వెనుదిరిగారు.

మృతదేహాల రాకతో ఉద్రిక్తత..

తణుకు ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తయిన అనంతరం మధ్యాహ్నం రెండున్నర గంటల సమయంలో మృతదేహాలు స్వగ్రామమైన తాడిపర్రుకు చేరుకున్నాయి. అప్పటికే సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహం వద్దకు అధిక సంఖ్యలో మహిళలు, పురుషులు చేరుకున్నారు. మృతదేహాలను విగ్రహం వద్దనే ఉంచాలని.. వివాదానికి ఆజ్యం పోసేలా ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన వేరే సామాజికవర్గం యువకులను ఇక్కడకు తీసుకురావాలని వారంతా పట్టుబట్టారు. మహిళలు, గౌడ సామాజివర్గం నాయకులతో నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు మాట్లాడారు. వివాదాలకు ఇది సమయం కాదని సర్దిచెప్పారు. దీంతో మృతదేహాలను వాహనాల నుంచి కిందకు దింపి పాపన్నగౌడ్‌ విగ్రహం ముందు పెట్టి పువ్వులు చల్లి ఆయా కుటుంబీకుల ఇళ్ల వద్దకు చేర్చారు. అనంతరం మృతదేహాలను తీపర్రు తీసుకెళ్లి గోదావరి తీరంలో దహన సంస్కారాలు చేశారు. ఏ కార్యక్రమం జరిగినా ముందుండే యువకుల మృతిని గ్రామస్తులు తట్టుకోలేకపోతున్నారు.

ఒక వర్గానికి చెందిన ఫ్లెక్సీలు చించివేత

గ్రామంలోకి మృతదేహాలు వచ్చి వెళ్లిన అనంతరం కోపోద్రిక్తులైన ఒక వర్గం యువకులు గ్రామంలో వేరొక వర్గం ఏర్పాటు చేసిన ప్లెక్సీలను చించివేశారు. పోలీసులు వద్దని వారిస్తున్నా వినకుండా రోడ్డు పొడవునా ఇరువైపులా పది నుంచి పదిహేను ఫ్లెక్సీలను చింపివేసి రోడ్డుపై పడవేశారు. అంతేకాకుండా కొంతమంది మరో వర్గం ఇళ్లపైకి వెళ్లిపోతుండగా పోలీసులు వారించి వెనక్కు తీసుకువచ్చారు. సర్దార్‌ పాపన్నగౌడ్‌ విగ్రహాన్ని సోమవారం ప్రారంభించడానికి ముందురోజు అదే రోడ్డులో ఒక ఇంటి ముందు మరో సామాజికవర్గానికి చెందిన నాయకుడి విగ్రహం ఏర్పాటు చేశారు. దానికి పోటీగా అదే సైజులో ఏడుగురు యువకులు సర్దార్‌పాపన్నగౌడ్‌ ఫ్లెక్సీని సోమవారం తెల్లవారుజామున ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగిందని మండిపడ్డారు. ఈ ఘటన అనంతరం తహసీల్దారు పీఎన్‌డీ ప్రసాద్‌... గ్రామంలో ఎటువంటి ఫ్లెక్సీ ఉండరాదని, ఎవరు ఏర్పాటు చేస్తే వారే దానిని తీసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. అలా తొలగించని ఫ్లెక్సీలను పంచాయతీ తరపున తొలగిస్తామని ఆటో ద్వారా ప్రచారం చేయించారు. దీంతో కొన్ని ఫ్లెక్సీలను ఎవరికి వారు తొలగించగా.. మరికొన్ని ఫ్లెక్సీలను పంచాయతీ, రెవెన్యూ సిబ్బంది తొలగించి పంచాయతీ కార్యాలయానికి తరలించారు. ఇరు సామాజికవర్గాల మధ్య గొడవలు జరిగే సూచనలు కనిపించడంతో తాడిపర్రులో సెక్షన 144 విధించారు. కొవ్వూరు డీఎస్పీ దేవకుమార్‌ ఆధ్వర్యంలో ఎస్‌ఐ జి.శ్రీనివాసరావు, ఇతర పోలీస్‌ స్టేషన్ల నుంచి వచ్చిన వారితో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు.

మృతుల కుటుంబాలకు పరామర్శ

మృతుల కుటుంబాలను మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు పరామర్శించారు. సంఘటనా స్థలానికి వెళ్లి మృతులకు సంతాపం తెలిపారు. సర్పంచ్‌ కరుటూరి నరేంద్రబాబు మాట్లాడుతూ.... నలుగురు యువకుల మృతి బాధాకరమని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. తమ సామాజికవర్గానికి చెందిన నలుగురు యువకులు మృతి చెందడం బాధాకరమని గౌడ సంఘ మాజీ అధ్యక్షుడు మోతుకూరి సత్యనారాయణ పేర్కొన్నారు. గ్రామంలో శాంతియుత వాతావరణం నెలకొల్పాలని కోరారు. పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతోనే ఈ ఘోరం జరిగిందన్నారు.

ప్రమాదం విచారకరం

బాలగంగాధర్‌తిలక్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ

తాడిపర్రులో విద్యుత్‌ ప్రమాదంలో నలుగురు మృతి చెందడం విచారకరం. ఫ్లెక్సీలు కట్టిన ప్రాంతంలో 6.3 కేవీ విద్యుత్‌ లైన్‌ ఉంది. 3 అడుగుల దూరంలో ఏది ఉన్నా కరెంట్‌ షాక్‌ కొడుతుంది. ఫ్లెక్సీలను నేల నుంచి 6 నుంచి 10 అడుగులు లోపే పెట్టుకోవాలి. ఎత్తు పెరిగితే ప్రమాదాలు జరుగుతాయి. మృతుల కుటుంబాలకు తమ శాఖ తరపున ప్రభుత్వానికి నివేదిక పంపుతాము.

Updated Date - Nov 05 , 2024 | 01:16 AM