Share News

చి..వర్రీ మ్యాచ్‌!

ABN , Publish Date - May 27 , 2024 | 12:13 AM

ఆదివారం ఉదయం నుంచి ఒకటే టెన్షన్‌.. ఎక్కడ చూసినా .. ఎవరి నోటా విన్నా అదే మాట.. నేడు ఐపీఎల్‌ ఫైనల్‌.. హైదరాబాద్‌ గెలుస్తుందని అంతా ఆశగా ఉన్నారు..ఎందుకంటే ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. చివరకు తుస్‌ మనిపించారు.

చి..వర్రీ మ్యాచ్‌!

బెట్టింగ్‌ రాయుళ్లను నిరాశపర్చిన హైదరాబాద్‌

తక్కువ సోరుకే ఆల్‌ అవుట్‌

చెన్నైలో మ్యాచ్‌ జరిగినా జిల్లాలో సందడి

జిల్లా వ్యాప్తంగా కోట్లలో సాగిన పందాలు

లబోదిబోమంటున్న బాధితులు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

ఆదివారం ఉదయం నుంచి ఒకటే టెన్షన్‌.. ఎక్కడ చూసినా .. ఎవరి నోటా విన్నా అదే మాట.. నేడు ఐపీఎల్‌ ఫైనల్‌.. హైదరాబాద్‌ గెలుస్తుందని అంతా ఆశగా ఉన్నారు..ఎందుకంటే ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఆటగాళ్లు దూకుడుగా ఆడుతున్నారు. చివరకు తుస్‌ మనిపించారు. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ గెలుస్తుందని కొంత మంది మాత్రమే అనుకున్నారు. ఆ కొంత మంది మాటే నిజమైంది. కోల్‌కతా నైట్‌ రైడర్స్‌ చేతిలో హైదరాబాద్‌ ఘోర పరాజయం పాలైంది.ఎవరూ ఊహించలేదు.. చివరి మ్యాచ్‌ ఇంత పేలవంగా ఉంటుందని.. బెట్టింగ్‌లు చూస్తే కోట్లు దాటేశాయ్‌.. హైదరాబాద్‌ ఫైనల్‌కి చేరడంతో జిల్లావాసులు సంబురపడ్డారు.తెలంగాణతో పాటు ఏపీలోని క్రీడాకారులు కూడా హైదరాబాద్‌ ఫైనల్‌ కప్‌ తెచ్చేస్తుందని ఆశపడ్డారు. మ్యాచ్‌ చెన్నైలో జరిగినా హడావుడి జిల్లాను తాకింది. అటు బుకీలు, ఇటు బెట్టింగ్‌ బాబులు రంగంలోకి దిగారు. చాలా కాలం తర్వాత దూకుడుగా ఫైనల్‌ బరికి చేరుకున్న హైదరాబాద్‌పై వేల కోట్ల రూపాయల బెట్టింగ్‌ కాశారు. లాడ్జిలలో ప్రత్యేకంగా రూమ్‌లు తీసుకుని మరీ యువత క్రికెట్‌ తిలకించారు. ఎలాగైనా కప్‌ సాధిస్తుందని ఆశపడ్డారు. చివరి మ్యాచ్‌ కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. ఆ ఉత్కంఠ ఎంతో సేపు నిలవలేదు. ఆరంభంలోనే బెట్టింగ్‌ బాబుల ఆశలన్నీ ఆడియాశల య్యాయి.. వరుసగా వికెట్లు పడిపోతూ వచ్చాయి. స్కోర్‌ 200 దాటుతుందని.. 250 దాటుతుందని.. భారీగా పందాలు సాగాయి.. 150 లోపు ఆల్‌ అవుట్‌ అవుతుందని అతి తక్కువ సంఖ్యలో మాత్రమే బెట్టింగ్‌లు వేశారు. అదే నిజమైంది. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ దెబ్బకు హైదరాబాద్‌ సన్‌రైజర్స్‌కి సన్‌సెట్‌ తప్పలేదు. కోల్‌కతా బౌలర్లు చెలరేడంతో హైదరాబాద్‌ వరుసగా వికెట్లు కోల్పోతూ 18.3 ఓవర్లకే 113 స్కోరుతో వెనుతిరిగింది. కోల్‌కతా మూడో సారి విజేతగా కప్‌ సాధించింది. గత 40 రోజులుగా ఐపీఎల్‌ మ్యాచ్‌లు సాగుతు న్నాయి.ఈ మ్యాచ్‌లంటే క్రికెట్‌ అభిమానులకు ప్రతీ రోజూ పండగే.. ఎందుకంటే మ్యాచ్‌కి కేవలం 4 గంటల సమయమే. అదే ఐపీఎల్‌కు అభి మానులను తెచ్చి పెట్టింది. ప్రస్తుతం అదే పెద్ద నష్టం తెచ్చిపెట్టింది. ఫైనల్‌లో అనూహ్య రీతిలో కేవలం అతి తక్కువ స్కోరుకే ఆల్‌ అవుట్‌ అయ్యి బెట్టింగ్‌ కాసిన వాళ్ల గుండెల్లో బ్యాట్‌ దింపారు. బౌలింగ్‌లో రాణిస్తుందని ఆశపడ్డారు. కానీ కోల్‌కతా టీంలోని ఇద్దరు బ్యాట్స్‌మెన్లు ఫటాఫట్‌ అంటూ చితక్కొట్టేశారు. దీంతో హైదరాబాద్‌ టీంను నమ్ముకున్న వాళ్ళకు హైరానా మిగిలింది. తూర్పుగోదావరి జిల్లాలోనూ బెట్టింగ్‌లు ఐపీఎల్‌ ప్రారంభం నుంచీ జోరుగా సాగాయి. ఎన్నికల హడా వుడిలో అధికారులు ఆ వంక చూడలేదు. దీంతో బెట్టింగ్‌ మరీ రెచ్చిపోయింది. ఆన్‌లైన్‌లోనూ జోరుగా పందేలు కాశారు. అభిమానం కొద్దీ హైదరాబాద్‌ టీంపై ఎక్కువగా డబ్బులు పెట్టగా..ఇప్పుడు నిండా మునిగిపోయారు. దీంతో ఆఘాయిత్యాలు చూడాల్సి వస్తుందేమోననే ఆందోళన జనాల్లో బయలు దేరింది.

Updated Date - May 27 , 2024 | 12:13 AM