ఐదేళ్లు నోట్లోకి వెళ్లలేదు!
ABN , Publish Date - Apr 22 , 2024 | 12:58 AM
గోదావరి జిల్లాలంటేనే వ్యవసాయం గుర్తొస్తుంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలు కళ్ల ముందు మొదలుతారు. నిజానికి వ్యవసాయమంటేనే ఏటికి ఎదురీతలాంటిది. పెరిగిపోయిన పెట్టుబడులు, కూలీల కొరత ఓ వైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకో వైపు రైతులతో ఆటలాడుతుంటాయి.
అన్నదాతకు అష్టకష్టాలే..
వైసీపీ సాగు..బాగా లేదు
అన్నదాతలతో చెలగాటం
ప్రకృతి వైపరీత్యాల్లో ఆదుకోలేదు
పలకరింపునకూ నోచుకోలేదు
ధాన్యం కొనుగోళ్లలో మాఫియా
ఆధునికీకరణ ఊసేలేదు
గోదావరి జిల్లాలంటేనే వ్యవసాయం గుర్తొస్తుంది. ఆరుగాలం కష్టపడి పంటలు పండించే అన్నదాతలు కళ్ల ముందు మొదలుతారు. నిజానికి వ్యవసాయమంటేనే ఏటికి ఎదురీతలాంటిది. పెరిగిపోయిన పెట్టుబడులు, కూలీల కొరత ఓ వైపు, ప్రకృతి వైపరీత్యాలు మరోవైపు, సాగునీటి సమస్యలు, ప్రభుత్వ నిర్లక్ష్యం ఇంకో వైపు రైతులతో ఆటలాడుతుంటాయి. సాధారణంగా అనేక సమస్యలు చుట్టుముట్టినప్పుడు రైతు ఒడ్డున పడేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తుంటుంది. ధాన్యం కొనుగోలు ద్వారా, సాగునీటి సరఫరా ద్వారా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రకృతి వైపరీత్యాల్లో పంటలు కోల్పోతే పంటల బీమాతో సాయం అందించేందుకు ఆభయమిస్తుంది. కానీ.. గడిచిన ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం అన్నదాతలను నిలువునా ముంచింది. ప్రతి గింజా కొంటున్నామని చెప్పినవన్నీ కల్లబొల్లి కబుర్లని నిజమైన రైతులందరికీ ఆదిలోనే తెలిసిపోయింది. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనేసి మద్దతు ధర ఇచ్చేస్తున్నామని చెప్పడమూ అంతే మోసమని తేలిపోయింది. అమ్మిన ధాన్యానికి సొమ్ముల కోసం రైతన్నలు పడిన పాట్లను జన్మలో మర్చిపోలేరు. ఈ మొత్తం వ్యవహారం వెనుక దళారీలు, కొందరు మిల్లర్లు, ప్రభుత్వంలో కీలకమైన ప్రముఖులు ఆడిన నాటకంలో చివరకు దగా పడింది రైతన్నే. గోదావరి జిల్లాల్లో ఏటా సాగు నీటి సమస్యలు తప్పవు. అందుకు ఏ ప్రభుత్వమైనా అటు గోదావరి, ఇటు కాల్వల వ్యవస్థలను ఆధునికీకరణ చేస్తుండడం సర్వసాధారణం. ఈ ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం చేసింది సున్నా. సాగునీటికి ఈ క్షణం కూడా రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కూరగాయలు, ఇతర వాణిజ్య పంటల రైతుల పరిస్థితీ ఇంతే. రైతులకు ఈ ఐదేళ్లూ అప్పుల ఊబిలో కూరుకుపోయారు.. ఐదు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టం మారింది.. అందుకే ఎన్నికల సమయమిది.. ఆలోచించాల్సిన తరుణమిది...!!
సామర్లకోట, ఏప్రిల్ 21: వైసీపీ ప్రభుత్వం అన్నదాతల జీవితాలతో ఆటలాడింది. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో వ్యవసాయం చేసే రైతులు గడిచిన ఐదేళ్లలో సాగుకు అష్టకష్టాలు పడ్డారు. ఒకపక్క తుఫాన్లు, అకాల వర్షాలు, వర్షాభావం రైతుల వెన్ను విరిచాయి. పెట్టిన పెట్టుబడులు దక్కక, ప్రభుత్వం ఆదుకోక అన్నదాతలు రోడ్డునపడ్డారు. పంటలు తుడిచిపెట్టుకుపోయి అప్పులపాలయ్యారు. మిచౌంగ్ తుఫాన్‌లో ధాన్యం తడిచి మొలకలు వస్తున్నా అటు ప్రభుత్వం, ఇటు అధికారులు పట్టించుకోలేదు. పీకల్లోతు కష్టాల్లో మునిగిన అన్న దాతలను వైసీపీ నాయకులు పలకరించిన దాఖలాల్లేవ్. వ్యవసాయాధికారులు అరకొర నివేదికలు పంపినా నష్టపోయిన రైతులకు సొమ్ములు పడలేదు. ఏదోలా మిగిలిన వరి పంటను విక్రయించడానికి ప్రయత్నిస్తే అన్యాయమే జరిగింది. వైసీపీ పాలనలో ఐదేళ్లూ.. ఖరీఫ్ ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం ఎక్కడికక్కడ చేతులెత్తేసింది. ఆర్‌బీకేలకు అన్నదా తలు తెచ్చిన ధాన్యాన్ని రోజుల తరబడి కొనకుండా నరకం చూపించింది. ధాన్యం డబ్బులకు ముప్పు తిప్పలు పెట్టింది. తేమ పేరిట ధాన్యాన్ని దళారులకు అమ్ముకునేలా చేసింది. ఇక రబీలో బొండాల రకం ధాన్యం నిషేధం పేరిట నష్టపరిచింది. రైతులకు యంత్ర పరికరాలు మంజూరులో విఫలమైంది. ఈ ఐదేళ్లలో అప్పుల భారం మరింత పెరిగి రైతులకు ఐదువేళ్లూ నోట్లోకి వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. పంట కాల్వలు, డ్రెయిన్లు ఆధునికీకరించక సాగునీటి ఇబ్బందులే. ఎత్తిపోతల పఽథకాల ఆయకట్టు రైతులకు, గోదావరి పరీవాహక ప్రాంత రైతులకు మధ్య నీటి యుద్ధాలు తప్పలేదు. చెరకు పంట వైసీపీ ప్రభుత్వం పుణ్యమా అని చక్కెర పరిశ్రమలు మూతబడ్డాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో సగ్గుబియ్యం తయారీ పరిశ్రమలు సామర్లకోట, పెద్దాపురంలలోనే సుమారు 32 ఉండేవి. దుంప సాగు రైతులకు ప్రభుత్వం నుంచి ఏ సహకారం లేకపోవడంతో ఈ ఐదేళ్లలో సుమారు 18 సగ్గు బియ్యం మిల్లులు మూ తబడ్డాయి. దుంపసాగు కూడా చెరకు సాగు రీతిలోనే కనుమరుగవుతోంది.
అరటి రైతుకు లేదు బీమా ధీమా..
పెరవలి: అరటి గెలలకు రేటు లేక రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గత నాలుగేళ్లుగా ఉభయ గోదావరి జిల్లాల్లో సుమారు పది వేల ఎకరాల్లో అరటి సాగు చేస్తుంటారు. ఎకరానికి సుమారు రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకు పెట్టుబడి పెడతారు. వెదురు కొనుగోలుకు మరో రూ.50 వేల వరకు ఖర్చు. అంటే సుమారు రూ.1.20 లక్షలు ఖర్చు చేస్తారు. గెల ఒక్కిం టికీ రూ.200 నుంచి 250 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తే రైతుకు లాభసాటిగా ఉంటుంది. గత నాలుగేళ్లలో గెల ఒక్కటి రూ.100 నుంచి రూ.150 వరకు మాత్రమే ధర పలికింది. కొన్ని సమయాల్లో 100 కంటే తక్కువకే కొనుగోలు చేశారు. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోయారు. అయితే వైసీపీ ప్రభుత్వం వీరి గోడును పట్టించుకోలేదు. చివరకు బీమా సొమ్ములు తమకు దక్కట్లేదని అరటి రైతులు ఆవేదన చెందుతున్నారు.
నర్సరీ రైతులకు చేసిందేమీ లేదు..
కడియం, ఏప్రిల్ 21: దేశవ్యాప్తంగా పేరొందిన కడియం నర్సరీ రైతులకు వైసీపీ ప్రభుత్వంలో చేసిం దేమీ లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో కడియంను ప్రత్యే క హబ్‌గా గుర్తించి నర్సరీ రైతులకు సోలార్ పథకాన్ని అందించేవారు. ఈ మండు వేసవిలో నిరంతర విద్యుత్ అందక నానా అవస్థలు పడుతున్నారు. పాలీహౌస్‌లు, షేడ్ నెట్లు, సబ్సిడీపై సూక్ష్మబిందు సేద్యం, బ్యాటరీ స్ర్పేయర్లు వంటి పథకాలు రాయితీపై అందిన దాఖలా లు లేవు. అయినా ఉద్యానవనశాఖ అధికారులు పట్టించుకోలేదు. గతంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో కడియపులంకలో ఏర్పాటుచేసిన ఎకో టూరిజం కేంద్రం పునాదుల్లోనే ఆగిపోయింది. నర్సరీ రైతులను శాస్త్ర, సాంకేతికంగా అభివృద్ధిపరచాలనే ఉద్దేశంతో వేమగిరి శివారులో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాలేదు. ఈ ఐదేళ్లలో నర్సరీ రైతులకు కష్టాలే మిగిలాయి.
బీమా చెల్లించక రైతులు నష్టపోయారు..
ప్రభుత్వం రైతు బీమాకు సంబంధించి ప్రీమియం చెల్లించకపోవడంతో వర్షాల సమయంలో రైతులు నష్టపోయారు. గత తెలుగుదేశం ప్రభుత్వంలో సొసైటీల నుంచి రూ.లక్ష వరకు సున్నా వడ్డీతో రుణాలు ఇచ్చేవారు. ఇప్పుడు ముందుగానే 7శాతం చొప్పున వడ్డీ వసూలు చేస్తున్నారు. 2021 నుంచి ఇప్పటి వరకు వడ్డీ రాయితీ అందలేదు. టీడీపీ ప్రభుత్వం హెక్టారుకు రూ.20వేలు ఇన్‌పుట్ సబ్సిడీ అందించేది.. జగన్ రూ.25 వేలు అందిస్తామని చెప్పి ఇప్పుడు రూ.15 వేలిస్తున్నారు. ఇటీవల జగన్ బటన్ నొక్కినా రైతులకు ఒక్క రూపాయి జమ కాలేదు.
- మట్టా మహలక్ష్మి ప్రభాకర్, అమలాపురం రూరల్
కాల్వలు ఆధునికీకరించక ఇబ్బందే..
పది ఎకరాల వరి పొలం సాగు చేస్తున్నా. మాగాం-అయినాపురం పంటకాల్వ ఆధునికీకరణ సక్రమంగా లేక రబీలో నీటిఎద్దడి ఎదుర్కొన్నాం. ఖరీఫ్‌లో అధిక వర్షాలతో ముంపు వల్ల నష్టపోతున్నాం. నష్టపోయిన రైతులకు పరిహారాన్ని అందించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోంది. కౌలు రైతులకు రుణాలందిస్తామని ప్రకటనలు చేస్తున్నా వాస్తవంలో అమలు కావట్లేదు.
- కొప్పుల వెంకటేశ్వరరావు, ముమ్మిడివరం
ఐదేళ్లుగా..డ్రెయినేజీలకు మోక్షంలేదు..
డ్రెయిన్లలో పూడిక తీసి పంట పొలాలను ముంపు నుంచి కాపాడాలని ఐదేళ్లుగా మొరపెట్టుకుంటున్నాం. అధికారులు ప్రతి ఏటా డ్రెయిన్లను పరిశీలించి పూడికతీతకు ఉన్నతాధికారులకు నివేదిక పంపించామని చెబుతున్నారు. అయినా పని జర గడంలేదు. గత రెండేళ్లుగా సార్వాను వదిలేసుకున్నాం. దాళ్వాలోనూ మురుగునీరు దిగే మార్గం కనిపించక పంట నష్టపోతున్నాం. రైతు సంక్షేమం అంటూ గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం కనీసం డ్రెయిన్లను సకాలంలో ఆధునికీకరించడం లేదు.
- దోనిపాటి నాగేశ్వరరావు, రైతు, గొల్లవిల్లి, ఉప్పలగుప్తం
బటన్ నొక్కారు సరే.. పరిహారమేదీ..
నాలుగు ఎకరాలు కౌలుకు చేస్తున్నా. గతంలో సంభవించిన తుఫాన్‌కు మొత్తం పంట నష్టపోయినట్టు అధికారులు నమోదు చేశారు. సీఎం బటన్ నొక్కినా ఇంతవరకూ పరిహారం అందలేదు. అష్టకష్టాలు పడి దాళ్వా పండించాను. ధాన్యాన్ని ఏవిధంగా కొనుగోలు చేస్తారోనని ఎదురు చూస్తున్నా.
- నయినాల కనకయ్యనాయుడు, మామిడికుదురు
తుఫాన్ నష్టమూ ఇవ్వలేదు...
మిచౌంగ్ తుఫాన్ కారణంగా నేను పదెకరాల్లో సాగు చేసిన పంట పూర్తిగా దెబ్బతింది. కోయడానికి కూడా పనికిరాకుండా పోయింది. నష్టపరిహారం అంది స్తామని అప్పట్లో అధికారులు, నాయకులు చెప్పారు. నెల రోజులు అన్నారు... నేటికీ అతీగతీ లేదు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదు.
- గన్ని శ్రీనివాస్, రైతు, పెనికేరు, ఆలమూరు మండలం