Share News

నేత్రపర్వంగా సత్యదేవుడి శ్రీ పుష్పయాగం

ABN , Publish Date - May 25 , 2024 | 12:02 AM

రత్నగిరివాసుడైన సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా చివరిరోజైన శుక్రవారం శ్రీ పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి 7.30కి నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను, పెండ్లిపెద్దలైన సీతారాములను మంగళవాయిద్యాల నడుమ వేడుక జరిగే నిత్య కల్యాణమండపం వద్దకు తోడ్కొనివచ్చారు.

నేత్రపర్వంగా సత్యదేవుడి శ్రీ పుష్పయాగం

సుగంధభరిత పుష్పాలతో అర్చన

విశేషపదార్థాలు, మధురఫలాలు నివేదన

అన్నవరం, మే 24: రత్నగిరివాసుడైన సత్యదేవుడి దివ్యకల్యాణోత్సవాలలో భాగంగా చివరిరోజైన శుక్రవారం శ్రీ పుష్పయాగం నేత్రపర్వంగా జరిగింది. రాత్రి 7.30కి నవదంపతులైన సత్యదేవుడు, అనంతలక్ష్మి అమ్మవార్లను, పెండ్లిపెద్దలైన సీతారాములను మంగళవాయిద్యాల నడుమ వేడుక జరిగే నిత్య కల్యాణమండపం వద్దకు తోడ్కొనివచ్చారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన వేర్వేరు వేదికలపై ఆశీనులు గా వించి ప్రధానార్చకులు కోట సుబ్రహ్మణ్యం, ఇంద్రగంటి నరసింహమూర్తి ఆధ్వర్యంలో రుత్విక్‌లు గణపతిపూజ, పుణ్యాహవచనం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. అనంత రం నవదంపతులను వివిధ సుగంధభరిత పుష్పాలతో తీర్చిదిద్దిన ఊగుటూయలలో శేషపాన్పుపై పవళించే విష్ణుమూర్తిగా సత్యదేవుడను ఆయన పాదాలు సుతిమెత్తగా ఒత్తుతు న్న దేవిగా అమ్మవారిని అలంకరించి వేడుకకోసం తీసుకొచ్చిన వివిధ జాతుల పుష్పాలతో అష్టోత్తర సహస్ర నామాలతో అర్చకస్వాములు అర్చించారు. ఈసందర్భంగా వివిధ రకాలైన తీపిపదార్థాలు, మధురఫలాలను నివేదించారు. చతుర్వేదపండితుల వేదాశీర్వచనాలు అందించారు. భక్తులు ఈ వేడుకను ఊగుటూయలకు ఎదురుగా ఏర్పాటుచేసిన అద్దం లో వీక్షించి పునీతులయ్యారు. అనంతరం దంపతులకు దంపతీతాంబూలాలు కార్యక్రమానికి హాజరైన మహిళా భక్తులకు రవికవస్త్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఈవో రామచంద్రమోహన్‌, చైర్మన్‌ రోహిత్‌లు పాల్గొన్నారు. వైదిక కార్యక్రమాలను ఇంద్రగంటి సుధీర్‌, ఇంద్రగంటి వెంకటేశ్వర్లు, చామర్తి కన్నబాబు, పాలంకి చినపట్టాభి తదితరులు నిర్వహించారు. అన్నవరం పరిసర ప్రాంతాల నుంచి వందలాదిగా మహిళలు ఈవేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకతో సత్యదేవుని క్రోధి నామసంవత్సర కల్యాణోత్సవాలు ముగిశాయి.

అన్నవరం సత్యదేవునికి కంత సమర్పణ

మండపేట: అన్నవరం సత్యదేవుని కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి జరిగిన శ్రీపుష్పయాగానికి డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం తాపేశ్వరానికి చెందిన సురుచి ఫుడ్స్‌ తరపున కంత సమర్పిం చినట్టు పీఆర్వో యు.రామభద్రిరాజు తెలిపారు. కొంతకా లంగా ఆనవాయితీగా సమర్పిస్తున్నామని ఆయన చెప్పారు.

సత్యదేవుడి బంగారు ధ్వజస్తంభ పనులకు శ్రీకారం

అన్నవరం, మే 24: సత్యదేవుడి ఆలయంలో నూతన ధ్వజస్థంభం ప్రతిష్ఠా కార్యక్రమం గతనెల 22న జరుగగా దానికి బంగారుపూత పనులకు శుక్రవారం శ్రీకారం చుట్టారు. ముందుగా సుమారు 64 అడుగుల పొడవుకలిగిన ధ్వజస్థంభంకు రాగిరేకును అమర్చి దానిపై బంగారుపూతను పూస్తారు. దీనికి సుమారు 3.5 కోట్లు వ్యయం కానుండగా నెల్లూరుకు చెందిన ఒకదాత కుటుంబసభ్యులు చేయిస్తున్నారు. వచ్చేనెల 15 నాటికి ఆలయంలో బంగారు ధ్వజస్తంభం పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకుంటున్నారు.

ముగిసిన భావనారాయణస్వామి కల్యాణోత్సవాలు

సర్పవరం జంక్షన్‌, మే 24: కాకినాడ రూరల్‌ మండలం సర్పవరం శ్రీరాజ్యలక్ష్మి సమేత భావనారాయణస్వామి వార్షిక దివ్య కల్యాణోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. స్వామివారి కల్యాణోత్సవాలు గత వారంరోజులుగా భక్తుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగాయి. ఆలయ పండితుల ఆఽధ్వర్యాన స్వామివారికి సుప్రభావ సేవ, ప్రత్యేక అర్చనలు, పలు రకాల పంచామృతాలతో ప్రత్యేక అభిషేకాలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం ముగింపు రోజు పురస్కరించుకుని 12 రకాల వాయిద్యాలతో స్వామికి ద్వాదశ ప్రదక్షిణాలు చేశారు. అనంతరం పుష్పయాగ ఉత్సవం, బేడా ఉత్సవం, నివేదన, లక్ష్మీ సంవాదం, పవళింపు సేవ రాత్రి దేవదాయ,ధర్మదాయశాఖ ఆధ్వర్యంలో 1008 మంది దంపతులకు దంపతుల తాంబూలాలు, తీర్థప్రసాదాలందజేశారు. ఉత్సవాలు వి జయవంతం చేసేందుకు సహకరించిన కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలకు ఆలయ ఈవో జొ న్నాడ భీమశంకరరావు కృతజ్ఞతలు తెలిపారు.

29 నుంచి పంచారామ శివలింగ జీర్ణోద్ధరణ

సామర్లకోట, మే 24: పంచారామ పుణ్య క్షేత్రమైన సా మర్లకోట కుమారా రామ భీమేశ్వరాలయంలో శివ లింగ జీర్ణోద్ధరణ పనులు ఈనెల 29 నుంచి ప్రారంభి ంచి జూన్‌ 8శనివారం వరకూ నిర్వహించనున్నట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి బళ్ళ నీలకంఠం శుక్రవారం తెలిపారు. ఈ మేరకు విలేకరులతో ఈవో నీలకంఠం మాట్లాడుతూ శివలింగం రూపురేఖలు ఏమాత్రం చెక్కు చెదరకుండా భావితరాల భక్తులచే విశేష పూజలందుకు నేలా భారతీయ పురావస్తుశాఖ ఉన్నతాధికారుల ఆదే శాల మేరకు వారి ఆధ్వర్యంలోనే ఈ పనులు నిర్వహించ నున్నట్లు తెలిపారు. గతంలో పదిహేను సంవత్సరాల క్రితం శివలింగ జీర్ణోద్ధారణ చర్యలు నిర్వహించినట్లు ఆలయ పండితులు తెలిపారు. ఇందుకోసం రాష్ట్ర దేవదాయశాఖ కమిషనర్‌ ప్రత్యేక ఆదేశాలతో భారతీయ పురావస్తుశాఖ అధికారులకు ఈనెల 29నుంచి జూన్‌ 8వరకూ ఆలయంలోని గర్భాలయాన్ని అప్పగించనున్నట్లు చెప్పారు. శివలింగ జీర్ణోద్ధరణ పూర్తయ్యేవరకూ ఆలయంలో నంది మండపంవద్ద స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు నిత్యపూజలు నిర్వహించి భక్తులకు అక్కడి నుంచే దర్శన ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. పంచారామ యాత్రికులు, భక్తులు ఈ మార్పులు గమనించి నంది మండపం వద్దనే స్వామి,అమ్మవారిని దర్శించి కృపకు పాత్రులు కాగలరని ఈవో తెలిపారు.

Updated Date - May 25 , 2024 | 12:02 AM