Share News

ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం

ABN , Publish Date - Feb 17 , 2024 | 01:25 AM

తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన శుక్రవారం కొనసాగింది.

ఉద్యోగులను దగా చేసిన ప్రభుత్వం

కొనసాగుతున్న ఉపాధ్యాయులు, ఉద్యోగుల నిరసన కార్యక్రమం

రాజమహేంద్రవరం అర్బన్‌, ఫిబ్రవరి 16: తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఏపీ జేఏసీ చేపట్టిన ప్రభుత్వ ఉద్యోగుల నిరసన శుక్రవారం కొనసాగింది. పంచాయతీరాజ్‌, మున్సిపల్‌, ఈఎస్‌ఐ, ట్రెజరీ, ఎస్‌కేవీటీ కళాశాల తదితర కార్యాలయాల్లో ఉద్యోగులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏపీ జేఏసీ అధ్యక్ష కార్యదర్శులు సుబ్బారావు నాయుడు, ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడుతూ ఉద్యోగులను, ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నరేళ్లుగా మోసం చేస్తూ కాలం గడిపిందని, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులకు సుమారు రూ.23,500 కోట్లు బకాయి పడిందన్నారు. వీటిని తక్షణమే చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పింఛనుదారుల సంఘం నాయకుడు కేజీకే మూర్తి మాట్లాడుతూ పింఛనుదారుల విషయంలోనూ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించడం అన్యాయమన్నారు. ఈనెల 20న జిల్లా కేంద్రం కాకినాడలో జరిగే ధర్నాను, 27న చలో విజయవాడ కార్యక్రమంలోనూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పింఛనుదారులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వేణుమాధవ్‌, నగర ఎన్జీఓ సంఘం నాయకులు అనిల్‌కుమార్‌, మాధవరావు, 4వ తరగతి ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, యూటీఎఫ్‌ కార్యదర్శి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ నేడు సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా

జేఏసీ ఆందోళనలో భాగంగా శనివారం రాజమహేంద్రవరం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని సుబ్బారావునాయుడు, ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పింఛనుదారులు పాల్గొని నిరసన తెలపాలని కోరారు.

Updated Date - Feb 17 , 2024 | 01:26 AM