ఏలేరు.. వరదేరు!!
ABN , Publish Date - Sep 10 , 2024 | 01:15 AM
ఏలేరు రిజర్వాయరుకు గంటగంటకూ అంచ నాలకు అందనంత రీతిలో వరద పోటెత్తుతోంది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియా అయిన ఏజెన్సీలో వర్షాలు భారీగా కురుస్తుండడంతో వేల క్యూసె క్కుల వరద రిజర్వాయరును ముంచెత్తుతోంది. గంటగంటకు ప్రవాహ ఉధృతి పెరిగిపోతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం అయిన 24.11 టీఎంసీలకుగాను రాత్రి 11 గంట లకు 23.25 టీఎంసీల నీరొచ్చిచేరింది.
మహోగ్రరూపం దాల్చిన ఏలేరు
నాలుగేళ్ల తర్వాత రిజర్వాయరుకు అంచనాలకు మించి వరద
గంటగంటకు ప్రాజెక్టుకు పోటెత్తుతున్న వరద ఉధృతి
ఇన్‌ఫ్లో 27,275 వేల క్యూసెక్కులు
ప్రాజెక్టు నిండిపోవడంతో దిగువకు కాలువల్లో 27,275 వేల క్యూసెక్కులు విడుదల
కిర్లంపూడి, పెద్దాపురం, గొల్లప్రోలు, పిఠాపురం, ప్రత్తిపాడు మండలాల్లో కాలువలకు భారీ గండ్లు
కిర్లంపూడిలోని రాజుపాలెంలో గండిపడడంతో నాలుగు గ్రామాలను ముంచెత్తిన వరద
పెద్దాపురంలో కొట్టుకుపోయిన దబ్బ కాల్వ వంతెన.. ఏలేశ్వరంలో కుంగిన అప్పనపాలెం వంతెన
ఏలేరు వరదతో 22 వేల ఎకరాల్లోకిపైగా మునిగిన వరి, ఇతర వాణిజ్య పంటలు
గొల్లప్రోలు టోల్‌గేట్ సమీపంలో ఏకంగా జాతీయ రహదారిపైకి వచ్చేసిన వరద నీరు
మరోపక్క జిల్లావ్యాప్తంగా భారీ వర్షాలతో కొన్ని రహదారులపైకి పది అడుగుల ఎత్తులో నీరు
ఏలేరు రిజర్వాయరుకు గంటగంటకూ అంచ నాలకు అందనంత రీతిలో వరద పోటెత్తుతోంది. ఎగువన క్యాచ్‌మెంట్ ఏరియా అయిన ఏజెన్సీలో వర్షాలు భారీగా కురుస్తుండడంతో వేల క్యూసె క్కుల వరద రిజర్వాయరును ముంచెత్తుతోంది. గంటగంటకు ప్రవాహ ఉధృతి పెరిగిపోతోంది. దీంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటినిల్వ సామర్థ్యం అయిన 24.11 టీఎంసీలకుగాను రాత్రి 11 గంట లకు 23.25 టీఎంసీల నీరొచ్చిచేరింది. దీంతో ప్రాజెక్టు పూర్తిగా నిండిపోయింది. అదే సమయంలో ఇంకా ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 27,275 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరుతోంది. అంతకు ముందు 8 గంటలకు 46,625 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి చేరింది. ఇందులో సోమవారం సాయంత్రానికి 27,000 క్యూసెక్కుల వరదను కాల్వల్లోకి, విశాఖకు 275 క్యూసెక్కులను వదులుతున్నారు. ఒకరకంగా చెప్పాలంటే గడచిన నాలుగున్నరేళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు ఈ స్థాయిలో వరద ఏలేరును చుట్టుముడుతోంది. గతంలో 2013, 2019, 2020ల్లో ప్రాజెక్టుకు 40 వేల క్యూసెక్కుల నుంచి 48 వేల క్యూసెక్కుల వరకు వరద వచ్చింది. ఇప్పుడు ఆ స్థాయికి మించి వరద పోటెత్తుతుండంతో దిగువకు వరద నీటిని వదిలేస్తున్నారు. అయి తే ఊహించని వరద కాలువలను ముంచేస్తుండడంతో ఎక్కడికక్కడ కాలువలకు భారీగా గండ్లు పడుతున్నాయి. సోమ వారం ఒక్కరోజే వరద తీవ్రతకు పదిచోట్లకుపైగా గండ్లు పడ్డాయి. ముఖ్యంగా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో ఏలేరు కాలువకు అత్యంత భారీగా గండిపడింది. దీంతో రాజుపాలెం, భూపాలపట్నం, ఎస్.తిమ్మాపురం, శృంగరాయునిపాలెం గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. అనేక ఇళ్లల్లోకి వరద వచ్చేసింది. మండలంలో మొత్తం ఆరువేలకుపైగా ఎకరాల్లో వరి నీటమునిగింది. పెద్దాపురం మండలంలో దబ్బ కాల్వ వంతెన అయితే వరద తీవ్ర తకు కొట్టుకుపోయింది. దీంతో వంద లాది ఎకరాలు మునిగిపోయాయి. ఏలేశ్వరంలో అయితే అప్పన్నపాలెం వంతెన కుంగి పోవడంతో వరద నీరు పైనుంచి ప్రవహిస్తోంది. అటు ప్రత్తిపాడు మండలం పెద్దిపాలెం వద్ద ఏలేరు ఎడమ కాలువకు గండిపడింది. దీంతో సమీప పంట పొలాలను వరద ముంచేసింది. మరోపక్క వరద తీవ్రత అధికంగా గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో అధికంగా ఉంది. ఈ రెండు మండలాల్లో భోగాపురం, రాపర్తి, పిడిందొడ్డి సమీపంలో ఈ గండ్లు భారీగా పడ్డాయి. దీంతో పిఠాపురం నియోజ కవర్గంలో 10 వేల ఎకరాల్లో వరి, వాణిజ్య పంటలు పూర్తిగా నీటము నిగి చెరువులను తలపిస్తున్నాయి. కూరగాయలు, ఇతర వాణిజ్య పంటలైతే వర ద తీవ్రతకు కొట్టుకుపోయాయి. అలాగే వరద తీవ్రత పెరగడంతో 216వ జాతీ య రహదా రిపై గొల్లప్రోలు టోల్‌గేట్‌కు అటు ఇటు రెండుచోట్ల వరద నీరు వచ్చేసింది. గొల్లప్రోలులో పేదల ఇళ్లకాలనీ రహదారిపైకి నీరు చేరడంతో స్థాని కులు ఇబ్బందిపడ్డారు. ఈ నేపథ్యంలో గొల్లప్రోలు మండలంలోని వరద ముంపు ప్రాంతాల్లో డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పిఠా పురం మాజీ ఎమ్మెల్యే వర్మతో కలిసి సోమవారం సాయంత్రం పర్యటించారు. తొలుత పవన్ గొల్లప్రోలులోని తన నివాసానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా కలెక్టర్, ఎస్సీ తదితర అధికారులతో సమీక్ష నిర్వహించారు. వరద తీవ్రత మరింత పెరిగే ప్రమాదం ఉన్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశానిర్దేశం చేశారు. మంగళగిరిలో పవన్‌కల్యాణ్ సమీక్ష ఉన్నందున కలెక్టరేట్‌లో నిర్వహించాల్సిన సమీక్షను రద్దుచేసుకుని సా యంత్రం రాజమహేంద్రవరం విమానాశ్రయం నుంచి అమరావతి వెళ్లారు.
రాకపోకలు బంద్.
వాయుగుండం ప్రభావంతో జిల్లావ్యాప్తంగా ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం రాత్రి వరకు అనేకచోట్ల భారీ వర్షాలు కురిశాయి. దీంతో పలుచోట్ల రహదారులపైకి వరద నీరు భారీగా ప్రవహించింది. దీంతో ప్రత్తిపాడులో పలు ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే తుని-నర్సీపట్నం మధ్య వరద నీరు పొంగడంతో ఆర్టీసీ సర్వీసులను నిలిపివేశారు. ప్రైవేటు వాహనాలూ లేక జనం ఇబ్బందులు పడ్డారు.
ఏలేశ్వరంలో వరద ప్రవాహానికి కుంగిన వంతెన
ఏలేశ్వరం, సెప్టెంబరు 9: ఏలేశ్వరం నగర పంచాయతీ పరిధిలో అప్పనపాలెం వంతెన భారీ వరదకు కుంగింది. భారీ వర్షాలకు ఏలేరు రిజర్వాయర్ నుంచి అధిక మొత్తంలో నీటిని విడుదల చేయడంతో వంతెన పైభాగం నుంచి నీరు ప్రహహించడంతో కాజ్‌వే పూర్తిగా కుంగింది. పట్టణం నుంచి అప్పనపాలెం ప్రజలకు రాకపోకలు నిలిచిపోయాయి. జేసీ రాహుల్‌మీనా, తహశీల్దార్ వెంకటేశ్వరరావు సోమవారం వంతెనను పరిశీలించారు.
కిర్లంపూడి మండలంలో ఆందోళనకరం
రాజుపాలెం, భూపాలపట్నంలో ఏలేరు కాల్వకు గండి
-గ్రామాల్లోకి వరద నీరు.. పొంచి ఉన్న ముప్పు
నాలుగు వేల ఎకరాల్లో పంట మునక
బాధితులను పునరావాసాలకు తరలిస్తున్న అధికారులు
కిర్లంపూడి, సెప్టెంబరు 9: ఏలేరు ఉధృతితో కిర్లంపూడిలో పరిస్థితి ఆందో ళనకరంగా మారింది. మండలంలోని రాజుపాలెం, భూపాలపట్నం గ్రామాల్లో ఏలేరు కాల్వకు గండి పడడంతో 8 గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ముప్పు పొంచి ఉంది. నాలుగువేల ఎకరాల్లో పంట ముంపుకు గురికావడంతో రైతు లు గగ్గోలు పెడుతున్నారు. పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలతో జలాశయాల వరద గేట్లు ఎత్తివేయడంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యా యి. రాజుపాలెంలో కాలువ గండిపడడంతో 300 ఎకరాలకుపైగా పంట పొలాలు ముంపునకు గురయ్యాయి. భూపాలపట్నం, తిమ్మాపురం, శృంగరాయునిపాలెం గ్రామాల్లో కాలువ గండ్లు కొట్టడంతో ఆయా గ్రామాలు ముం పునకు గురై రాకపోకలు స్తంభించాయి. ఎస్సీపేట ముంపునకు గురైంది. వర ద ప్రభావంతో రాజుపాలెం, ముక్కోలు, భూపాలపట్నం, శృంగనాయుని పాలెం, ఎస్.తిమ్మాపురం, గెద్దనాపల్లి, వేలంక, సోమరాయణంపేట, పాలెం గ్రామాల్లో నీరు చేరడంతో అధికారులు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశా రు. కొంతమందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. పెద్దాపురం ఆర్డీవో సీతారామారావు పర్యవేక్షణలో ప్రజలకు ముందస్తుగా పునరావాస కేంద్రాలు ఏర్పాటుచేశారు. గండికొట్టిన ప్రాంతాన్ని జేసీ రాహూల్‌మీనాతోపాటు ఇరిగేషన్ సీఈ పుల్లారావు, ఎస్‌ఈ జి.శ్రీనివాస్, ఈఈ జి.శేషగిరిరావు, జేఈ శ్రీనివాసకుమార్ పర్యవేక్షిస్తున్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఎస్‌ఈ సత్యనారాయణ, ఈఈ చౌదరి, జేఈ అప్పలరాజు కూడా పరిశీలించారు.
పొలాలను ముంచెత్తిన ఏలేరు వరద
కాలువలకు పలుచోట్ల గండ్లు
గట్లపై నుంచి ప్రవహిస్తున్న వరద నీరు
జలాశయాలను తలపిస్తున్న చేలు
పిఠాపురం/గొల్లప్రోలు, సెప్టెంబరు9: ఏలేరు వరద పంట పొలాలను ముంచె త్తింది. ఏలేరు రిజర్వాయర్ నుంచి 27వేలకుపైగా క్యూసెక్కుల వరద నీటిని విడుదల చేయడంతో గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాలతోపాటు మండలాల పరిధిలోని గ్రామా ల్లో ఏలేరు కాలువల్లో వరద నీరు గట్లపై నుంచి ప్రవహిస్తున్నాయి. గొల్లప్రోలు-పిఠాపురం మధ్య గల పిడిందొడ్డి సమీపంలో ఏలేరు కాలువకు రెండుచోట్ల, రాపర్తి వద్ద గొర్రిఖండికి, భోగాపురం వద్ద పులిదొడ్డి సమీపంలో, జిరాయితీ దొడ్డి ప్రాంతంలో కాలువలకు గండ్లు పడ్డాయి. గట్లపై నుంచి నీరు ప్రవహించడంతో గొల్లప్రోలు, లక్ష్మీపురం, సీతానగరం, మల్లవరం, చెందుర్తి గ్రామాలతోపాటు పిఠాపురం పట్టణ శివారు ఇల్లిం ద్రాడ, మండలంలోని బి.ప్రత్తిపాడు, భోగాపురం, రాపర్తి, రాయవరం, మాధవపురం, నవఖండ్రవాడ గ్రామాల్లో వేల ఎకరాల్లో వరిపంటతోపాటు పత్తి, కాయగూరలు తదితర పంటలు నీట మునిగాయి. గొల్లప్రోలు-పిఠాపురం మధ్య 216వ జాతీయ రహదారిని చేర్చి ఉన్న పంటపొలాలు జలాశయాలను తలపిస్తున్నాయి. గొల్లప్రోలు కాలువ పై ఉన్న ఫుట్‌పాత్ బ్రిడ్జికి సమాంతరంగా నీరు ప్రవహిస్తోంది. అలాగే జాతీయ రహదారిపైకి ఏలేరు వరద నీరు చేరింది. గొల్లప్రోలు టోల్‌గేట్ సమీపంలో ఏలేరు కాలువకు గండిపడడంతో పంటపొలాలు మీదుగా వరద నీరు ప్రవహించి మళ్లీ కాలువలోకి చేరుతోంది. అ టు చేబ్రోలు ఆదర్ష్ ఇంజనీరింగ్ కళాశా ల సమీపంలో 216 వ జాతీయ రహదారిపైకి వర్షపునీరు చేరింది. ఒకవైపు నీరు ప్రవహిస్తుండడంతో వాహనాల రాకపోకలకు స్వల్ప అంతరాయం ఏర్పడింది. అక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటుచేశారు. మరోవైపు సుద్దగడ్డ వరద ఉధృతమైంది. ఎగువ ప్రాంతాల నుంచి చేరుతున్న వరద నీటితో సుద్దగడ్డ(కొండ)కాలువ గట్లుకు సమాంతరంగా ప్రవహిస్తోంది. దీంతో గొల్లప్రోలు జగనన్న కాలనీకి వెళ్లే రహదారిపై ఐదున్నర అడుగుల ఎత్తున వరద నీరు చేరింది. సూరంపేట జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో వీరికి నాలుగు బోట్లు ఏర్పాటుచేశారు.