Share News

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదుకు 1912

ABN , Publish Date - Mar 22 , 2024 | 11:36 PM

విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం (సీజీఆర్‌ఎఫ్‌) పనిచేస్తోందని ఏపీఈపీడీసీఎల్‌ సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ నాయ్యమూర్తి బి.సత్యనారాయణ అన్నారు.

విద్యుత్‌ సమస్యలపై ఫిర్యాదుకు 1912
వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్న సత్యనారాయణ

  • కొవ్వూరులో వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక

కొవ్వూరు, మార్చి 22: విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా వినియోగదారుల సమస్యల పరిష్కార న్యాయస్థానం (సీజీఆర్‌ఎఫ్‌) పనిచేస్తోందని ఏపీఈపీడీసీఎల్‌ సీజీఆర్‌ఎఫ్‌ చైర్మన్‌, రిటైర్డ్‌ నాయ్యమూర్తి బి.సత్యనారాయణ అన్నారు. కొవ్వూరు ట్రాన్స్‌కో సబ్‌ డివిజనల్‌ కార్యాలయంలో శుక్రవారం విద్యుత్‌ వినియోగదారుల సమస్యల పరిష్కార క్యాంపు కోర్టు (సమస్యల పరిష్కార వేదిక) నిర్వహించారు. ఆయన విద్యుత్‌ వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వినియోగదారులు తమ సమస్యలను టోల్‌ఫ్రీ నెంబరు 1912కు ఫిర్యాదు చేయవచ్చని, నిర్ణీత సమయంలో పరిష్కరిస్తామన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 2016 నుంచి ఇప్పటివరకు సీజీఆర్‌ఎఫ్‌కు 7895 ఫిర్యాదులు రాగా 7757 పరిష్కరించామని, 111 పెండింగ్‌లో ఉన్నాయన్నారు. 100 కేసుల్లో ఫిర్యాదుదారులకు విద్యుత్‌ సేవల అమలులో జాప్యానికి రూ.5,45,050 చెల్లించామన్నారు. గతేడాది 536 ఫిర్యాదులొచ్చాయని, వాటిలో 437 పరిష్కరించామన్నారు. నిర్ణీత సమయంలో పరిష్కారం కాని ఫిర్యాదుదారులకు సేవల అమలులో జాప్యానికి పరిహారం చెల్లిస్తారన్నారు. ఇప్పటివరకు సంస్థ ఆధ్వర్యంలో 68 అవగాహన సదస్సులు ఏర్పాటుచేసి అవగాహన కల్పించామన్నారు. కొవ్వూరు మండలం దొమ్మేరులో 19 వ్యవసాయ మోటార్లకు భూగర్భజలాలు అడుగంటి నీరు రాకపోవడంతో 5హెచ్‌పీ మోటార్లను తీసివేసి 7.5 హెచ్‌పీ మోటార్లను అనధికారికంగా వేశా రని, వాటిని క్రమబద్ధీకరించి మోటార్లు కెపాసిటీకి అనుగుణంగా ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటుచేయాలని రైతులు రాత పూర్వకంగా ఫిర్యాదుచేశారు. కార్యక్రమంలో సీజీఆర్‌ఎఫ్‌ సభ్యులు ఎం.శ్రీనివాస్‌, రాయసం సురేంద్రకుమార్‌, విద్యుత్‌శాఖ ఈఈ బి.వీరభద్రరావు, ఏడీఈ పి.అచ్యుతాచారి, ఏఈలు డి.జగదీశ్వరరావు, సీహెచ్‌ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2024 | 11:36 PM