Share News

పోరు మొదలైంది

ABN , Publish Date - Apr 18 , 2024 | 12:27 AM

అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ తేదీ, ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ జారీచేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిం దంటే అసలుసిసలు ఎన్నికల వేడి ప్రారంభమైనట్టుగా పార్టీలు భావిస్తాయి.

పోరు మొదలైంది

  • ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల నేడే..

  • నేటి నుంచి 25వ తేదీ వరకు కొనసాగనున్న అభ్యర్థుల నామినేషన్లు

  • 26న నామినేషన్ల పరిశీలన.. ఉపసంహరణ గడువు ఏప్రిల్‌ 29

  • మే 13న పోలింగ్‌.. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు

  • ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసిన అధికారులు

  • అటు ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ నియోజకవర్గ కేంద్రాల్లో

  • ఎంపీ అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ జిల్లా కలెక్టరేట్‌లలో

కాకినాడ/రాజమహేంద్రవరం/అమలాపురం, ఏప్రిల్‌ 17(ఆంధ్రజ్యోతి): అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో కీలక ఘట్టమైన ఎన్నికల నోటిఫికేషన్‌ గురువారం విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియ, పోలింగ్‌ తేదీ, ఓట్ల లెక్కింపునకు సంబంధించి అధికారిక గెజిట్‌ నోటిఫికేషన్‌ను ఈ సందర్భంగా ఎన్నికల కమిషన్‌ జారీచేయనుంది. ఎన్నికల నోటిఫికేషన్‌ జారీ అయిం దంటే అసలుసిసలు ఎన్నికల వేడి ప్రారంభమైనట్టుగా పార్టీలు భావిస్తాయి. నోటిఫికేషన్‌ ప్రకారం గురువారం నుంచి ఈనెల 25వ తేదీ వరకు అభ్యర్థుల నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది. 26న నామినేషన్ల పరిశీలన చేపడతారు. దాఖలు చేసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు ఏప్రిల్‌ 29. మే 13న పోలింగ్‌ జరగనుంది. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. అయితే నోటిఫికేషన్‌ విడుదలైన రోజునుంచే అధికారులు ఆయా పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల నుంచి నామి నేషన్లను స్వీకరించనున్నారు. ప్రధానంగా అసెంబ్లీ స్థానాలకు పోటీచేసే అభ్యర్థులు ఆ నియోజకవర్గ కేంద్రంలో రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో నామినేషన్లు దాఖలు చేయాలి. ఎంపీ స్థానానికి పోటీచేసే అభ్యర్థుల నుంచి మాత్రం ఆయా జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్‌ కార్యాలయాల్లోనే నామినేషన్లు స్వీకరిస్తారు. అంటే కాకినాడ జిల్లాకు సంబంధించి కాకినాడ కలెక్టరేట్‌ లోను, తూర్పుగోదావరి జిల్లాకు రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్‌లోను, డాక్టర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాకు అమలాపురం లోని కలెక్టరేట్‌ కార్యాలయంలోనూ ఎంపీ అభ్యర్థులు నామినేషన్లు అందించాల్సి ఉంటుంది. ఇందుకోసం ఇప్పటికే ఆయా జిల్లా కేంద్రాల్లో అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు. కాగా గురువారం నుంచి ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు అధికారులు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని ఆయా నియోజకవర్గ కేంద్రాల్లోని రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు స్వీకరిస్తారు. సెలవుదినాల్లో నామినేషన్ల స్వీకరణ ఉండదు. ఒక అభ్యర్థి గరిష్ఠంగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయవచ్చు. రెండుకంటే ఎక్కువ నియోజకవర్గాలకు ఒక అభ్య ర్థి నామినేషన్లు దాఖలు చేయకూడదు. నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థితోపాటు అయిదుగురికి మాత్రమే ఆర్వో కార్యాలయంలోకి అనుమతి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. కాగా జిల్లాలో గురువారం ఎక్కువగా నామినేషన్లు దాఖలు కానున్నాయి. ఆరోజు మంచిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్ల దాఖలుకు ముహూర్తం నిర్ణయించుకున్నారు.

Updated Date - Apr 18 , 2024 | 12:27 AM