Share News

ఖర్చు చేశారా.. నొక్కేశారా!

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:56 AM

ఎక్కడైనా నొక్కేయ్‌.. అవకాశం వస్తే దోచెయ్‌.. వైసీపీ పాలనలో ఇదీ అధికారుల తీరు.. నేటికీ ఆ తీరు మార్చుకోలేదు. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేస్తుంది.

ఖర్చు చేశారా.. నొక్కేశారా!

ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌కు రూ.8 వేలు

ఎన్నికల కమిషన్‌ విడుదల చేసిందిదే

అదనంగా రూ.10 వేలు ఖర్చయిందట

పంచాయతీల వారీగా బిల్లులు

రాజమహేంద్రవరం రూరల్‌లో ఇదీ సీన్‌

రాజమహేంద్రవరం రూరల్‌ , జూన్‌ 8 : ఎక్కడైనా నొక్కేయ్‌.. అవకాశం వస్తే దోచెయ్‌.. వైసీపీ పాలనలో ఇదీ అధికారుల తీరు.. నేటికీ ఆ తీరు మార్చుకోలేదు. సాధారణంగా ఎన్నికలకు సంబంధించిన ఖర్చులు ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేస్తుంది. నిబంధనలకు అనుగుణంగా సంబంధిత కమిటీకి దేనికి ఎంత ఖర్చవుతుందన్న దానిపై నివేదిక విడుదల చేస్తారు. దీనిలో భాగంగా రూరల్‌ నియోజకవర్గం పరిధిలో ఎన్నికల రోజు పోలింగ్‌ నిమిత్తం అయిన ఖర్చుకు పోలింగ్‌ బూత్‌ అధికారులు, సిబ్బంది భోజన, వసతి, టెంట్లకు ఒక్కొక్క పోలింగ్‌ బూత్‌కు రూ.8 వేలు చొప్పున ఆయా ఏఈఆర్వోల ద్వారా గ్రామ కార్యదర్శులకు పంపిణీ చేశారు. దీనిలో రూ.వెయ్యి బీఎల్‌వోలకు ఇవ్వాలంటూ పీవో గ్రూప్‌ మెసేజ్‌ పంపారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే ఒక్కొక్క బూత్‌కు ఎలక్షన్‌ కమిషన్‌ పంపిణీ చేసిన సొమ్ములు సరిపోలేంటూ పంచాయతీల నుంచి ఒక్కొక్క బూత్‌కు మరొక రూ. 8 వేల నుంచి రూ.10 వేల వరకు పంచాయతీ నిధుల నుంచి అదనంగా ఖర్చులు చూపించి బిల్లులు తీసుకుంటున్నట్టు తెలిసింది. ఆదే విషయాన్ని పరోక్షంగా ఆయా పంచాయతీ అధికారులే చెబుతున్నారు. పోలింగ్‌ రోజున పోలింగ్‌ అఽధికారులు, సిబ్బందికి ఏ లోటు రాకుండా చూడాలంటూ ఉన్నతాధికా రులు చేటభారతం అంత మెనూ ఇచ్చి సమావేశాలు పెట్టి ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఖర్చు పెట్టాల్సి వచ్చిందని కొంతమంది కార్యదర్శులు చెబుతూ తలలు పట్టుకుంటున్నారు. రూరల్‌ నియోజకవర్గం పరిధి రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, నగరం పరిధిలో 243 బూత్‌లు ఉన్నాయి. రూరల్‌ మండల పరిధిలో 10 గ్రామాలతో పాటు కడియం మండల పరిధిలో వేమగిరి, నగరపాలక సంస్థలో వార్డులకు ప్రత్యేకాధికారులు కావడంతో ప్రజాధనాన్ని పక్కదారి పట్టించా రని పలువురు విమర్శిస్తున్నారు. జిల్లాలో ఈ ఒక్క నియో జకవర్గంలోనే ఎన్నికల కమిషన్‌ ఇచ్చిన నిధులు ఎందుకు సరిపోలేదని ప్రశ్నిస్తున్నారు.

పోలింగ్‌ బూత్‌ల నిర్వహణ ఖర్చు పెరిగింది..

ఒక్కొక్క బూత్‌ నిర్వహణకు మొదటగా రూ.3 వేలు మాత్రమే మంజూరు చేశారు. నిర్వహణ ఖర్చు సరిపోదంటూ పీవోను అడిగిన మీదట మరో రూ.5 వేలు మంజూరు చేశారు. ఆపై డియాండ్‌ చేసి అడిగేందుకు ధైర్యం సరిపోలేదు. అయితే నిర్వహణ ఖర్చు ఎలక్షన్‌ కమిషన్‌ ద్వారా మంజూరైన సొమ్ముల కంటే అధికంగా ఖర్చుచేసినట్టు ముభావంగా చెప్పారు.

- శ్రీనివాసరావు,రూరల్‌ ఏఈఆర్‌వో

Updated Date - Jun 09 , 2024 | 12:56 AM