Share News

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి

ABN , Publish Date - Mar 27 , 2024 | 12:56 AM

స్వాత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మోడల్‌ ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించే బృందాలదే కీలక బాధ్యత అని రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఆర్‌వో, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌భరత్‌ అన్నారు.

ఎన్నికలు సజావుగా నిర్వహించాలి
అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఆర్వో తేజ్‌భరత్‌

  • క్షేత్రస్థాయిలో పర్యటించే బృందాలదే కీలక బాధ్యత

  • రాజమహేంద్రవరం రూరల్‌ ఆర్వో తేజ్‌భరత్‌

రాజమహేంద్రవరం రూరల్‌, మార్చి 26: స్వాత్రిక ఎన్నికలకు సంబంధించి ఎన్నికల మోడల్‌ ప్రవర్తనా నియమావళి అమలు విషయంలో క్షేత్రస్థాయిలో పర్యటించే బృందాలదే కీలక బాధ్యత అని రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ ఆర్‌వో, జాయింట్‌ కలెక్టర్‌ తేజ్‌భరత్‌ అన్నారు. మంగళవారం ఎన్నికల విధులు నిర్వహించే బృందాలతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఎన్నికలు సజావుగా నిర్వహించే క్రమంలో ఎంసీసీ, ఎఫ్‌ఏస్‌టీ, వీఎస్‌టీ బృందాలపై ఎంతో గురుతరమైన బాధ్యత వుందన్నారు. సువిధ యాప్‌లో వివిధ సభలు సమావేశాలు, ప్రచారం, ప్రచురణల కోసం అనుమతులు నిష్పక్షపాతంగా ఇస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. 48 గంటల ముందు అనుమతి తప్పనిసరి అన్నారు. క్షేత్రస్ధాయిలో పర్యటించే బృందాలు తనిఖీలు నిర్వహించి ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాలను ఖచ్చితంగా అమలు జరిగేలా చూడాలన్నారు. సమావేశంలో సహాయ ఆర్‌వో వైకేవీ అప్పారావు, ఎంపీడీవో డి.శ్రీనివాసరావు, మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌, పంచాయతీరాజ్‌, బొమ్మూరు సీఐ, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలి: సిటీ ఆర్వో

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 26: ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరించాలని అన్ని బృందాలను రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ ఆర్‌వో, కమిషనర్‌ దినేష్‌కుమార్‌ ఆదేశించారు. కార్పొరేషన్‌ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం ప్రవర్తనా నియమావళి పర్యవేక్షించే బృందాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై కేసులు పెట్టాలన్నారు. ఎన్నికలు సజావుగా జరిపే బాధ్యత నిఘా బృందాలపై ఉందన్నారు. సమావేశంలో డీఎస్పీ సెంట్రల్‌, అర్బన్‌ తహశీల్దార్‌, సిటీ ప్లానర్‌, డిప్యూటీ తహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 27 , 2024 | 12:56 AM