Share News

తొలి జాబితాలో ముగ్గురు

ABN , Publish Date - Feb 25 , 2024 | 01:37 AM

టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు.రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు.

తొలి జాబితాలో ముగ్గురు
ఆదిరెడ్డి శ్రీనివాస్‌కి స్వీటు తినిపిస్తున్న తండ్రి అప్పారావు

గోరంట్ల, దుర్గేష్‌ ఇద్దరికీ సీట్లిస్తామన్న చంద్రబాబు

(రాజమహేంద్రవరం- ఆంధ్రజ్యోతి)

టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితాలో అనుకున్నవిధంగానే జిల్లాకు చోటు దక్కింది. జిల్లా ఏడు అసెంబ్లీ స్థానాలు ఉండగా, టీడీపీ నుంచి రాజమహేంద్రవరం సిటీ నుంచి ఆదిరెడ్డి వాసు, అనపర్తి నుంచి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఉమ్మడి అభ్యర్ధులుగా ఖరారయ్యారు.రాజానగరం నుంచి బత్తుల బలరామకృష్ణ జనసేన అభ్యర్థిగా ఖరారయ్యారు.దీంతో జిల్లాలో అభ్యర్థుల విషయంలో కొంత టెన్షన్‌ తగ్గినట్టు అయింది. టీడీపీ , జనసేన నుంచి వీరికి పూర్తి మద్దతు లభించింది. టీడీపీ అధినేత నారాచంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కలిసి ప్రకటించిన తొలి ఉమ్మడి అభ్యర్థులకు జిల్లాలో రెండు పార్టీల నుంచి స్వాగతం లభించింది. ఇంకా జిల్లాలో రాజమహేంద్రవరం రూరల్‌, కొవ్వూరు, గోపాల పురం, నిడదవోలు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఇందులో మరొకటి కచ్చితంగా జనసేనకు లభించే అవకాశం ఉంది. మిగతా మూడు చోట్ల టీడీపీ అభ్యర్థులే ఉంటారు.

గోరంట్ల, దుర్గేష్‌ ఇద్దరికీ పోటీ చేసే అవకాశం

రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గంలో అభ్యర్థుల కేటాయింపు పెద్ద పీటముడిగా ఉంది. టీడీపీ-జనసేన అధినేత లిద్దరికీ సవాల్‌గా మారింది. ఇక్కడ నుంచి టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, సిట్టింగ్‌ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి తిరిగి పోటీ చేస్తానని చెబుతున్న సంగతి తెలిసిందే. దీనికి కూడా ఓ కారణం ఉంది.గతంలో టీడీపీ అధినేత చంద్రబాబు సిట్టింగ్‌లందరికీ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. అందులో భాగంలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు ఉండగా, పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్పకు, మండపేట నుంచి వేగుళ్ల జోగేశ్వరరావుకు తిరిగి టికెట్‌ ఇచ్చారు. రాజ మహేంద్రవరం సిటీలో ఆదిరెడ్డి కుటుంబం కోరిక మేరకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ స్థానంలో ఆమె భర్త ఆదిరెడ్డి వాసుకు చోటు కల్పించారు. గోరంట్లకు రూరల్‌ నుంచి సీటు కేటాయిం చాల్సి ఉంది. కానీ ఇక్కడ జనసేన ఇన్‌చార్జి కందుల దుర్గేష్‌ కూడా పట్టుబడుతున్నారు. 2019 ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు తెచ్చుకున్నారు.ఇక్కడ త్రిముఖ పోటీలో విజయం సాధించిన గోరంట్ల బుచ్చయ్యచౌదరి 74,166 ఓట్లు తెచ్చుకోగా,వైసీపీ అభ్య ర్థి ఆకుల వీర్రాజుకు 63,762 ఓట్లు, జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్‌కు 42,685 ఓట్లు లభించాయి. దుర్గేష్‌ జనసేనలో కీలకనేతగా ఉన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఆయన పార్టీని నడిపించారు. జనసేన పొలిటికల్‌ అఫైర్స్‌కమిటీ సభ్యుడిగా ఉన్నారు.దీంతో ఈ సీటు విషయంలో ఇద్దరు నేతలను ఎవరూ కాదనలేని పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు సీటిస్తామని చంద్రబాబు గోరంట్లకు మాటివ్వగా, రూరల్‌ నుంచి జనసేన పోటీ చేస్తుందని, దుర్గేష్‌ను వదులుకోలేమని ఇటీవల రాజమహేంద్రవరంలో పవన్‌ కల్యాణ్‌ ప్రకటించిన సంగతి తెలి సిందే. ఈనేపథ్యంలో ఈ సీటుకు పీటముడిపడింది. దీంతో తొలిజాబితాలో అభ్యర్థిని ప్రకటించలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవాళ చంద్రబాబు,పవన్‌ విలేకరుల సమావేశంలో తొలి అభ్య ర్థుల ప్రకటన చేసిన తర్వాత వేదిక కింద చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ గోరంట్ల, దుర్గేష్‌ ఇద్దరికీ ఈ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తామని చెప్పడం గమనార్హం.ఇద్దరిని పిలిచి మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని చెప్పడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఎవరిని ఎక్కడ నుంచి పోటీ చేయిస్తారనేది అధిష్ఠానం నోటి నుంచే రావాల్సి ఉంది.ఎమ్మెల్యే గోరంట్ల మాత్రం తనకు చంద్రబాబు హామీ ఇచ్చారని, రూరల్‌ నుంచే పోటీ చేస్తానని చెబుతున్నారు.కందుల దుర్గేష్‌కు పిలుపు రావడంతో విజయవాడ వెళ్లారు. దుర్గేష్‌కు రూరల్‌ ఇస్తే, గోరంట్లకు ఎక్కడ కేటాయిస్తారో మరి. లేక గోరంట్లకే ఈ సీటు కేటాయిస్తే దుర్గేష్‌కు నిడదవోలు సీటు కేటాయించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ టీడీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు, సీనియర్‌నేత కుందుల సత్యనారాయణ పోటీ పడు తున్నారు. మొత్తం ఈ వ్యవహారం పెద్ద పీటముడిగా బిగిసింది.

Updated Date - Feb 25 , 2024 | 01:37 AM