Share News

భోగాపురంలో ముగిసిన జాతీయ నాటికల పోటీలు

ABN , Publish Date - Jan 20 , 2024 | 01:50 AM

భోగాపురంలో ముగిసిన జాతీయ నాటికల పోటీలు

భోగాపురంలో ముగిసిన జాతీయ నాటికల పోటీలు

పిఠాపురం, జనవరి 19: కాకినాడ జిల్లా పిఠాపురం మండలం భోగాపురంలో మూడు రోజులపాటు నిర్వహించిన జాతీయ స్థాయి నాటికల పోటీలు శుక్రవారంతో ముగిశాయి. భోగాపురం కళాపరిషత్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీల్లో ఉత్తమ ప్రదర్శనగా నాన్నా నేనొచ్చేస్తా(గుంటూరు) ఎంపికకాగా, ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా రాత(వెలగలేరు), తృతీయ ప్రదర్శనగా అమృతహస్తం(గుంటూరు), ఉత్తమ జ్యూరీ ప్రదర్శనగా కొత్త తరం కొడుకు(కొండెవరం), ఉత్తమ రచనగా తాళాబత్తుల వెంకటేశ్వరరావు, ఉత్తమ దర్శకుడిగా పి.శ్రీనివాసరావు, ఉత్తమ నటుడిగా ఎంవీ రాజర్షి, ఉత్తమ నటిగా అమృతవర్షిణి, ఉత్తమ ప్రతినాయకుడిగా వై.హరిబాబులు ఎంపికయ్యారు. వీరందరికీ కళాపరిషత్‌ అధ్యక్షుడు అడపా సూరిబాబు తదితరులు నగదు పురస్కారాలు, బహుమతులు అందజేశా రు. న్యాయనిర్ణేతలుగా జలదంకి సుధాకర్‌, ఎండీ ఖాజావలీ, యం.చిన్నారావులు వ్యవహరించారు. ఇక నాటికల పోటీలు చివరి రోజున ప్రదర్శించిన నాటికలు అందరినీ ఆలోచింపజేశాయి. ఏడు అడుగులు కలిసి వేసి జంటలో ఎవరయినా ఎనిమిదో అడుగు వేయాలని ప్రయత్నిస్తే ప్రాణాంతకమవుతుంది. ఆలుమగలు మధ్య చిన్న చిన్న అంతరాలు ఉన్నా అర్థం చేసుకోవడం ద్వారా వాటిని సరిచేసుకుంటే ఆ బంధం కడదాకా ఉంటుందనే సందేశాన్ని ఇస్తూ హైదరాబాదుకు చెందిన జయా ఆర్ట్స్‌ కళాకారులు ప్రదర్శించి ఎనిమిదో అడుగు నాటిక సాగింది. మాడభూషి దివాకరబాబు రచించిన ఈ నాటికకు డాక్టర్‌ శ్రీజ సాధినేని దర్శక త్వం వహించారు. తాను పొందాల్సినవి మంచిగా పొందుతూ తిరిగి ఇవ్వాల్సిన వాటి విషయంలో మనిషి బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరుని వివరి స్తూ ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం వెలగలేరుకు చెందిన వెలగలేరు ఆర్ట్‌ థియేటర్స్‌ కళాకారులు ప్రదర్శించిన రాత నాటిక ఆసక్తికరంగా సాగింది. మనిషికి కష్టం కలిగితే నా రాతింతే అనుకోవడం, సుఖం వస్తే మాత్రం రాతను వదిలేస్తాడనే ఈ నాటికను పి. శ్రీనివాసరావు రచించి దర్శకత్వం వహించారు.

Updated Date - Jan 20 , 2024 | 09:55 AM