Share News

డబ్బు.. జబ్బు!

ABN , Publish Date - Oct 25 , 2024 | 12:38 AM

వైద్యో నారాయణో హరి అన్నది ఒకప్పటి నానుడి.. ఎందుకంటే అప్పటిలో వైద్యుడు దేవుడిలా ఉండేవాడు.. వైద్యమూ అలాగే చేసేవాడు.. నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేవాడు.. రోగిని చూసి వైద్యం చేసేవాడు.. మరిప్పుడో అంతా మారిపోయింది.. రోగి చెప్పింది వినాలంటే (కన్సల్టెన్సీ) రూ.500 నుంచి రూ.1000.. మరీ డిమాండ్‌ ఉంటే రూ.2 వేలు.

డబ్బు.. జబ్బు!
మందులు రాస్తున్న వైద్యుడు

ప్రైవేటు ఆసుపత్రుల్లో బాదుడే

డిమాండ్‌ను బట్టే కన్సల్టెన్సీ

రూ.500 నుంచి ఆపైమాటే

ఏడు రోజులే కార్డు

మధ్యలో వెళితే మళ్లీ చార్జ్‌

ఐసీయూ రూ.10 వేలు

జ్వరం అని వెళ్లినా పరీక్షే..

ఆసుపత్రికి వెళితే కష్టమే

అచ్చంగా ఠాగూర్‌ సినిమా

భయపడుతున్న ప్రజానీకం

తట్టుకోలేక ఆత్మహత్యలు

ఇష్టానుసారం రేట్లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

వైద్యో నారాయణో హరి అన్నది ఒకప్పటి నానుడి.. ఎందుకంటే అప్పటిలో వైద్యుడు దేవుడిలా ఉండేవాడు.. వైద్యమూ అలాగే చేసేవాడు.. నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేవాడు.. రోగిని చూసి వైద్యం చేసేవాడు.. మరిప్పుడో అంతా మారిపోయింది.. రోగి చెప్పింది వినాలంటే (కన్సల్టెన్సీ) రూ.500 నుంచి రూ.1000.. మరీ డిమాండ్‌ ఉంటే రూ.2 వేలు.. ఒకసారి చేయి పట్టుకుంటే (ఐసీయూ) రూ.10 వేలు..ఆ తరువాత టెస్ట్‌లు.. మందులు షరా మామూలే.. రోగి నుంచి ఇష్టానుసారం పిండేస్తున్నారు.. ఎమర్జన్సీ ఆసుపత్రుల్లో అయితే మరీనూ.. లక్షల ఉంటేనే వైద్యం.. లేదంటే దైన్యమే.. ప్రైవేటు వైద్యంపై ప్రభుత్వ నియంత్రణ కొరవడడంతో రోగులను పీల్చి పిప్పి చేస్తున్నారు.. కేవలం జ్వరం అని ఒక ప్రైవేటు ఆసుపత్రికి వెళితే రూ.5 వేలు అవుతుందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.. ఇక హార్ట్‌ స్ర్టోక్‌ అని వెళ్లారా.. రోగి బంధువులు చచ్చారే...!దీంతో ఆసుపత్రికి వెళ్లాలంటనే భయపడే రోజులు వచ్చాయి.. ‘వైద్యో నారాయణో హరి’ అంటే వైద్యులు సాక్షాత్తూ దైవంతో సమానం అని అర్థం. మన సమాజంలో వైద్యుడికిచ్చే గౌరవం అది.. కానీ ఇవాళ ప్రైవేటు/కార్పొరేటు ఆస్పత్రులకు వెళితే కుబేరుడు కూడా బికారి అయిపోతున్నాడు. వైద్యుల మితిమీరిన కాసుల కక్కుర్తికి రోగుల బం ధువులు బలైపోతున్నారు. వైద్యం మరీ ఖరీదైపో వడంతో రోగి కుటుంబం ఆర్థికంగా కుదేలవు తోం ది.ఏదేమైనా.. వైద్య రంగానికి డబ్బు జబ్బు ముదిరి..విలువలు మరీ తిగజారుతుండడంపై ‘ఆంధ్రజ్యోతి’ పరిశోధనాత్మక కథనం.

చూస్తే రూ.500

చూస్తే వెయ్యి..పట్టుకుంటే 5 వేలు అనేంతగా వైద్యుల తీరు మారింది. వైద్యుల వద్దకు వెళ్లి చూ పించుకోవాలంటే కన్సల్టెన్సీ కార్డు ధర తక్కు వలో తక్కువంటే రూ.500 నుంచి ఆరంభం.రూ.2 వేలు ఉండే కార్డులూ ఉన్నాయి.అయితే వీటి జీవిత కా లం మాత్రం 7 నుంచి 15 రోజులే. గతంలో అయి తే సుమారు నెల రోజులు ఉండేది. ఆ ఽమధ్యలో ఎప్పుడు వెళ్లినా చూసేవారు.ఇప్పుడు మధ్యలో వెళ్లినా రూ.100 చెల్లించుకోవాలి. మందులు మా త్రం నెలకు రాసేస్తారు.అంటే నెల తర్వాత వస్తే మళ్లీ కార్డుకు డబ్బులు సమర్పించుకోవాలి. అసలు నాడి పట్టుకోకుండా రోగి లోనికి వచ్చిన సమస్య ఏమిటని అడగడం మరుక్షణం నుంచే మందులు రాసేస్తారు..ఈ కన్సల్టెన్సీ(కార్డు) ఫీజులపై నియం త్రణ లేకపోవడంతో రోగిని పిండేస్తున్నారు. ప్రస్తుత తరం వైద్యులను చూసి ఆ తరం వైద్యు లు మారిపోయారు. డబ్బే పరమావధిగా వైద్యం చేస్తున్నారు.దీంతో రోగులు.. వారి కూడా వచ్చే బంధువులు లబోదిబోమంటున్నారు.

జనం మారాలి..

జనం కూడా మారాల్సిన పరిస్థితులు కనిపిస్తు న్నాయి. తక్కువ ధరతో చేసే వైద్యం.. తక్కువ మందులు రాసే వైద్యుడు రోగికి నచ్చడం లేదు. ఆస్పత్రికి వెళ్లిన వెంటనే హడావుడి సృష్టించి ప్రిస్ర్కిప్షన్‌ నిండా మందులు రాస్తే సంతృప్తి పడుతున్నారు. ఇదో మాయరోగంలా దాపురించిం ది. పారాసిటమల్‌ వేసుకుంటే తగ్గిపోయే జ్వరా నికి వంద రకాల మందులు రాస్తే గానీ కుదుట పడడం లేదు. చిన్న పిల్లాడికి విరేచనాలు అవుతుంటే ముద్దపప్పు పెట్టండని, తిండి తినడం లేదంటే ఇష్టమైనవి వండి పెట్టాలని చెబుతుంటే తమను తింగరోళ్ల మాదిరిగా చూసే జనం కూడా ఉన్నారని ఓ వైద్యుడు వాపోయారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. అలాగే ఏ టెస్టులూ లేకుండా మందుల రాస్తే.. ఏ టెస్టులూ చేయకుండా జబ్బు నయం చేయడంపై మీకు ఎలా అవగాహన వచ్చి ందని ప్రశ్నించి..అవసరం లేదన్నా ఇన్‌ పెషెంటు గా జాయినైపోతామని తమపైనే ఒత్తిడి చేసే రోగులూ ఉన్నారని మరో వైద్యురాలు ఆశ్చ ర్యం వ్యక్తం చేశారు.ఈ ఉదాహరణలు మనలో వైద్యం పట్ల రావాల్సిన మార్పును సూచిస్తు న్నాయి.

ఆసుపత్రికెళితే జేబు ఖాళీ..

ఇవాళ వైద్య రంగంలో కాసుల కక్కుర్తి తప్ప మానవతా దృక్పథం, నైతిక విలువలు కొరవ డ డంపై సర్వత్రా విమర్శలు వినవస్తున్నాయి. రోగి వ్యాధిని డబ్బుతో తూకం వేయడం మితి మీరిపో యింది. డాక్టర్లు టార్గెట్లు రీచ్‌ కావడానికి అవ సరం లేకపోయినా ఎక్స్‌రే, స్కానింగ్‌, మందులు రాసేస్తున్నారు. ఆస్పత్రులకు పట్టుకొన్న మరో జాడ్యం మందులు (మెడిసిన్‌). సొంతగా ఆస్ప త్రుల్లోనే మెడికల్‌ షాపులు ఉండడంతో ప్రిస్ర్కి ప్షన్‌ నిండిపోయే వరకూ మందులు రాసేస్తు న్నారు.దీని వెనుక ఆశ్చర్యపోయే మాయ దాగి ఉంది.గతంలో మందుల తయారీ కంపెనీలు రిప్రజెంటెటివ్స్‌నినియమించుకొని వాళ్లను డాక్టరు వద్దకు పంపించి ప్రొడక్టును ప్రచారం చేసుకో వడం జరిగేది. దీనిని ఎథికల్‌ మార్కెటింగ్‌ అనే వాళ్లు.ఆ ప్రొడక్టును ఎక్కువగా రాసినందుకు తాయిలాలుగా వచ్చేవి. ఈ పద్ధతి ఇప్పటికీ ఉన్నా బాగా తగ్గింది. ఇప్పుడు కొత్త ఒరవడి వచ్చింది. హరియాణ, గుజరాత్‌లోని పలు చోట్ల మందుల తయారీ కంపెనీలు కోకొల్లలుగా ఉంటాయి. ఆయా కంపెనీల నుంచి పెద్ద ఎత్తున మందులు తెచ్చి విక్రయిస్తున్నారు.ఇవి వైద్యులకు చాలా తక్కువ ధరకు వస్తాయి. వీటిని ఎక్కువ ధరకు విక్రయిస్తారు.అందుకే అవసరం ఉన్నా లేకపోయి నా ఎక్కువ మందులు రాస్తుంటారు. గ్యాస్ట్రిక్‌ లేకపోయినా గ్యాస్‌ ట్యాబ్లెట్‌ రాసేయడం ఈ మధ్య చూస్తూనే ఉన్నాం. వైరల్‌ ఫీవర్‌కి యాంటి బయోటిక్‌ రాయకూడదు.అసలు యాంటి బయో టిక్స్‌ తక్కువగా సూచించాలని ఆ తరం వైద్య నిపుణులు నెత్తీ నోరు బాదుకుంటున్నారు. అయినా తమ మెడికల్‌ షాపుల వ్యాపారం కోసం వైరల్‌ ఫీవర్‌కి సెఫిక్జిమో ఒఫలాక్సిన్‌ వంటి యాంటి బయోటిక్స్‌ చీటిలో నింపేస్తున్నారు. కాసుల కక్కుర్తితో రాసే మందులు వ్యాధి నయం మాట అటుంచితే కొత్త రోగా లు చుట్టు ముడు తున్నాయి. చివరికి రోగి ఒళ్లు, ఇల్లు గుల్లవుతోంది. తట్టుకోలేక బలవన్మరణాలకు పాల్పడేవారెందరో..

కమీషన్‌ వ్యాపారం..

అధిక శాతం ఆస్పత్రులు కమీషన్లతో లాభాలు గడిస్తున్నాయి. ఆర్‌ఎంపీ, పీఎంపీ ఆయా ఆస్ప త్రుల్లో ఎన్‌రోల్‌ చేయించుకొని పేషెంటును రిఫర్‌ చేస్తే కొంత మొత్తం లేదా 40 శాతం వరకూ కమీషన్‌ ముట్టజెబుతున్నారు. అందుకే ఈ మధ్య నగరాల్లోని ప్రైవేటు/కార్పొరేటు ఆస్పత్రుల్లో గ్రామీణ రోగులు ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇక స్కానింగ్‌, ఎక్స్‌రే తదితర టెస్టులకు తమ వద్దకు పంపిస్తే లేబోరేటరీలు ఆయా ఆస్పత్రులకు 50 శాతం వరకూ కమీషన్‌ రూపంలో ఇస్తున్నాయి. ఫలానా ల్యాబ్‌కి మాత్రమే వెళ్లాలని ఆస్పత్రుల్లో సూచించడం, వేరే దగ్గర చేయించుకొంటే తిరస్క రించడం, స్పష్టంగా ఫలితాలు రాలేదని చెప్పడం దాదాపుగా అందరికీ అనుభవమే.దీనికి ఆ కమీషన్‌ కక్కుర్తే కారణం. ఓ వ్యక్తి లిపిడ్‌ ప్రొఫైల్‌ పరీక్షకు ఓ ల్యాబ్‌కి వెళ్లారు. రూ.1200 అవు తుందని వాళ్లు చెప్పారు. ఆ వ్యక్తి డాక్టరు ఫోన్‌ చేసి వారికి ఇచ్చారు. తాను వేరే ఊరి డాక్టరునని, తనకు కమీషన్‌ వద్దని చెప్పడంతో రూ.600 మాత్రమే ల్యాబ్‌ వారు బిల్లు వేశారు. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ‘వైద్యో నారాయణో హరి’ అనే నానుడు ఎందుకు కన్నీరు పెడుతోందో చెప్ప డానికి ఈ ఉదాహరణలు మచ్చు తునకలు మాత్రమే సుమా!.. రోజూ ఇలాంటి ఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి.

ఓ పెద్దావిడ మెట్లపై జారి పడడంతో తలకు దెబ్బ తగిలింది. ఆమెను రాజమహేంద్రవరంలోని ఓ ప్రముఖ కార్పొ‘రేటు’ ఆస్పత్రికి తీసుకెళితే ముందుగా రూ.5లక్షలు లాగేశారు. ఎడాపెడా టెస్టులు చేసి మెదడులో రక్తస్రావమైందని గుర్తించారు. మరో రూ.20 లక్షలు కడితే బ్రెయున్‌ సర్జరీ చేసేస్తా మన్నారు. డిశ్చార్జి చేస్తే చనిపోతుందని ఆ వైద్య వ్యాపారులు భయపెట్టారు. ఆ సర్జరీకి అవసరమైన సదుపాయాలు లేకపోవడంతో బెంగళూరు నిమ్‌హేన్స్‌ ఆస్పత్రికి తీసుకెళ్లాలని నిర్ణయించుకు న్నారు. ఏదోలా అక్కడి నుంచి బయటపడి నిమ్‌హేన్స్‌కి తీసుకెళ్లారు. ఆస్పత్రిలో 20 రోజుల వైద్యానికి అన్నీ కలుపుకొని రూ.2 లక్షలు మాత్రమే అయ్యింది. ఆమె క్షేమంగా ఇంటికి చేరారు.

కడుపు బిగపట్టేసిందని, త్రేన్పు రావడం లేనది ఓ పెద్దాయనను నగరంలోని ఓ కార్పొరేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అంతే.. స్ట్రెచర్‌పై ఎక్కించి గదిలోకి తీసుకెళ్లి బంధువులకు ఠాగూర్‌ సినిమా చూపించారు. ఎండోస్కోపీ, యాంజియోగ్రామ్‌, స్కానింగ్‌.. ఇలా రకరకాల పరీక్షలు చేశారు. చివరికి సంచినిండా మందులు రాసి రూ.లక్ష బిల్లు వేశారు. తీరా ఆయనకు గ్యాస్‌ పెయిన్‌ వచ్చిందని రూ.5 ట్యాబ్లెట్‌ లేదా రూ.50 ఇంజక్షన్‌తో నయం అయిపోయేదని తర్వాత ఓ వైద్యుడు చెప్పడంతో పెద్దాయనతో పాటు బంధువులు అవాక్కయ్యారు. అన్నీ ఇలాంటివే కాకపోయినా నూటికి తొంభై శాతం ఇలానే జరు గుతోందనే వాదనలో వాస్తవం లేకపోలేదు.

Updated Date - Oct 25 , 2024 | 12:38 AM