Share News

కందిపప్పు పంపిణీకి మంగళం పాడినట్టేనా?

ABN , Publish Date - Feb 07 , 2024 | 01:25 AM

కందిపప్పు పంపిణీకి మంగళం పాడినట్టేనా?

కందిపప్పు పంపిణీకి మంగళం పాడినట్టేనా?

ఫిబ్రవరి నెల రేషన్‌ కోటా కేటాయింపులు నిల్‌

డిసెంబరు, జనవరి నెలల్లో సగం మంది కార్డుదారులకే

గత ఏడాది ఆరు నెలలపాటు పంపిణీ నిల్‌

అధిక ధరల నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కార్డు దారులకు తక్కువ ధరకు అందించే కందిపప్పు పంపిణీకి ప్రభుత్వం మంగళం పాడిందా.. గతేడాది నుంచి జరుగుతున్న తతంగం చూస్తుంటే అవుననే అనిపి స్తోంది. డిసెంబరు, జనవరి నెలల్లో కందిపప్పు కోటాలో సగానికి పైగా కోత పెట్టిన ప్రభుత్వం ఫిబ్రవరి నెలకు ఇంకా కోటా విడుదల చేయలేదు. దీంతో ఈనెల కోటా అనుమానమే.

పిఠాపురం, ఫిబ్రవరి 6: బహిరంగ మార్కెట్‌లో నిత్యావసర సరుకుల ధరలు అధికంగా ఉన్న సమయంలో వాటిని గతంలో చౌకధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు అందించే విధానానికి శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగానే తెలుపురంగు రేషన్‌కార్డుదారులకు కిలో రూ.67కే కందిపప్పును అందించేవారు. కానీ కొంతకాలంగా కందిపప్పు రేట్లు గణనీయంగా పెరగడంతో ప్రభుత్వం ఆ బాధ్యత నుంచి తప్పించుకుంటోంది. గత ఏడాదిలో ఆరు నెలలు కందిపప్పు పంపిణీ చేయలేదు. డిసెంబరు, జనవరి నెలల్లో సగం మందికి కూడా కందిపప్పు అందించలేదు. కాకినాడ జిల్లాలో 6 లక్షల 53 వేల 750 బియ్యం (తెలుపురంగు) కార్డులున్నాయి. ఈ కార్డుదారులకు క్రమంతప్పకుండా కందిపప్పును అందించాలంటే ప్రతీ నెలా 653 టన్నుల కందిపప్పును కేటాయించాల్సి ఉంటుంది. అయితే 2023లో ఆరునెలలపాటు కందిపప్పు పంపిణీని ప్రభుత్వం నిలిపివేసింది. నవంబరులో 50 శాతం కార్డులకు మాత్రమే కేటాయింపులు జరపడంతో ఆ నెలలో సరఫరా నిలిపివేసి డిసెంబరు నెలలో కోటాతో కలిపి అన్ని కార్డులకు ఇవ్వాలని భావించినా సాధ్యపడలేదు. చివరకు నవంబరు నెలలో వచ్చిన కోటానే సరఫరా చేశారు. సంక్రాంతి సమయంలో నూరుశాతం కార్డులకు వస్తుందని భావించినా గతంలోకంటే తక్కువగా కేటాయింపులు జరిపా రు. కేవలం 43 శాతం కార్డుదారులకు అందించేందుకు వీలుగా 280 టన్నులు మాత్రమే కేటాయింపులు జరిపారు. దీంతో జనవరి నెలలో సంక్రాంతి పండుగ వేళ సగం మందికి కూడా కందిపప్పు అందలేదు. అప్పట్లోనే దీనిపై కార్డుదారులు నుంచి నిరసన వ్యక్తమైంది. ఫిబ్రవరి నెలలో అయినా పూర్తి కోటా వస్తుందని భావిస్తే మొత్తానికే ఎసరు పెట్టారు. ఇప్పటివరకూ జిల్లాకు కందిపప్పు కేటాయింపులు రాలేదు. వాస్తవానికి కందిపప్పు బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో రూ.200 వరకూ ఉంది. దీంతో కందిపప్పును కొనేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి తరుణంలో రేషన్‌కార్డుదారులకు కందిపప్పును అందిస్తే వారికి ఊరటగా ఉండేది. ఇంత రేటుకు కొనడం భారంగా ఉంటుందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ప్రతి నెలా కందిపప్పును కార్డుదారులకు పంపిణీ చేసేవారు. బహిరంగ మార్కెట్‌లో ధర ఎంతున్నా ఎప్పు డూ పంపిణీ ఆగలేదు. ధరలు అధికంగా ఉన్నప్పుడు ఇస్తే తమకు వెసులుబాటుగా ఉంటుందని, ఇటువంటి తరుణంలో బాధ్యత నుంచి తప్పుకోవడం ఏమిటని కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - Feb 07 , 2024 | 01:25 AM