Share News

సంక్షోభంలో మామిడి తాండ్ర పరిశ్రమ

ABN , Publish Date - May 24 , 2024 | 11:59 PM

ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా దేశ ప్రజలందరి నోటిని తీపి చేసే మామిడి తాండ్ర తయారీదారులకు మాత్రం చేదును మిగులుస్తోంది.

సంక్షోభంలో మామిడి తాండ్ర పరిశ్రమ

ఆకాశాన్నంటుతున్న ముడి సరుకు ధరలు

గత ఏడాదికంటే టన్నుకు రూ.8వేల వరకు ధర

గత ఏడాది యజమానులకు చేదును మిగిల్చిన తాండ్ర

తొండంగి, మే 24: ఉత్తరాది దక్షిణాది అన్న తేడా లేకుండా దేశ ప్రజలందరి నోటిని తీపి చేసే మామిడి తాండ్ర తయారీదారులకు మాత్రం చేదును మిగులుస్తోంది. గత సంవత్సరం ముడి సరుకు ధరల్లో తీవ్ర వ్యత్యాసం, తాండ్రకు సరైన ధర లేకపోవడంతో నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఫ్యాక్టరీల యజమానులకు ఈ ఏడాది కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. కాకినాడ జిల్లాలో పండూరు, సర్పవరం, గొల్లప్రోలు, చేబ్రోలు,కొమ్మనాపల్లి, పిఈ చిన్నయ్యపాలెం, ధర్మవరం, మండపం, లోవకొత్తూరు తదితర ప్రాంతాల్లో 40 వరకూ మామిడితాండ్ర పరిశ్రమలు ఉన్నాయి. ఈ పరిశ్రమలకు అవసరమైన ముడిసరుకు తోతాపురి(కలెక్టర్‌) రకం మామిడి కాయలను 30 శాతం మేర స్థానికంగాను మిగిలిన 70 శాతం కాయను నూజివీడుతో పాటు ఎన్టీఆర్‌ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరిస్తారు. వీటిని మగ్గించి మిషన్ల ద్వారా గుజ్జును తీసి ప్రాసెసింగ్‌ అనంతరం జ్యూస్‌ను డ్రమ్ముల్లో భద్రపరుస్తారు. దీనిని ఉపయోగించి చాపలపై పొరలు పొరలుగా మామిడి రసం పూసి తాండ్ర తయారు చేస్తారు. సంవత్సరం పొడవునా నిల్వచేసిన జ్యూస్‌ ద్వారా తాండ్ర త యారవుతుంది. ఈ ప్రక్రియలో పాల్గొనేందుకు ఒక్కొ క్క ఫ్యాక్టరీలో సుమారు 100 నుంచి 150 మంది అవసరమవుతారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 5 వేల మందికి తాండ్ర పరిశ్రమ ద్వారా ఉపాధి లభిస్తోంది.

తగ్గిన తోతాపురి రకం మామిడి దిగుబడి

తాండ్రకు ఉపయోగపడే తోతాపురి రకం మామిడి దిగుబడి తక్కువగా ఉండడంతో ధర అంతకంతకూ పెరిగి తారాస్థాయికి చేరింది. ప్రారంభంలో 16,500 ఉన్న టన్ను ధర అమాంతం పెరిగి 22,500కు చేరింది. గత అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రారంభంలో కొనుగోలుకు యజమానులు వెనుకడుగు వేశారు. ఒక్కసారిగా టన్ను వద్ద ఆరువేల వరకూ అధిక ధర చెల్లించాల్సి వస్తోంది. దీనికి కూడా ముందుగా రైతులకు అడ్వాన్సులు చెల్లించి ఖాయపర్చుకుంటున్నారు. ఫ్యాక్టరీని ఖాళీగా ఉంచలేక అధిక ధర అయినప్పటికీ వెచ్చించి కాయలు కొనుగోలు చేస్తున్నామని తీరా తాండ్ర తయారయ్యాక సరైన ధరలేకపోతే ఈ ఏడాది కూడా తీవ్ర నష్టాలు చవిచూడక తప్పదని యజమానులు వాపోతున్నారు. తయారైన తాండ్ర కలకత్తా, ఢిల్లీ, ముంబై, వారణాసి తదితర ప్రాంతాకు ఎగుమతి చేస్తున్నామని అక్కడ స్థానిక పరిస్థితులు ఆధారంగా డిమాండ్‌ ఉంటుందంటున్నారు. గతేడాది ఒక కేజీ తాండ్ర 50 రూపాయల కనిష్టానికి విక్రయించాల్సి వచ్చిందంటు న్నారు. కేజీ 75 రూపాయల ధర పలికితే నష్టాలు లేకుండా బయటపడే అవకాశం ఉంటుందని గతేడాది కేజీకి 25 రూపాయల వరకూ నష్టపోవడం వలన వాటి నుంచి ఇంకా తేరుకోలేదని పలువురు పేర్కొంటున్నారు. ఈ ఏడాది ఇంకా సీజన్‌ ప్రారంభంకాకపోవడంతో ఎంత ధర పలుకుతుందో తెలియని అయోమయ పరిస్థితి నెలకొందంటున్నారు. ఇప్పటికే అధిక ధరలకు కాయలు కొనుగోలు చేయడం వలన ధరలు పతనమైతే తీవ్ర నష్టాలు తప్పవంటున్నారు. తాండ్ర పరిశ్రమ పరిస్థితి గాలి లో దీపం మాదిరిగా ఉందని ఎప్పుడు మునుగుతామో ఎప్పుడు తేలుతామో తెలియదని, అయినా కోట్లాది రూపాయల వ్యయం తో నిర్మించిన ఫ్యాక్టరీలను నడపాలి కనుక నడుపుతున్నామంటున్నారు. తాండ్ర పరిశ్రమ ఈ ఏడాది యజమానులకు తీపి మిగులుస్తుందా, చేదు అన్నది వేచి చూడాలి.

Updated Date - May 24 , 2024 | 11:59 PM