Share News

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

ABN , Publish Date - Jun 04 , 2024 | 12:56 AM

రంపచోడవరంలో అసెంబ్లీ, అరకు పార్లమెంటుకు సంబంధించి ఈ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, రిటర్నింగ్‌ అధికారి ప్రశాంతకుమార్‌ మంగళవారం మీడియాకు వివరాలు అందించారు.

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
లెక్కింపు కేంద్రాన్ని పరిశీలిస్తున్న పీవో సూరజ్‌ గనోరే

  • రంప అసెంబ్లీతో పాటు పార్లమెంట్‌ ఓట్ల లెక్కింపూ ఇక్కడే

  • 2,08,025 ఓట్లు, 3,224 పోస్టల్‌ బ్యాలెట్లు

  • పోలీసు ఆధీనంలో రంపచోడవరం

  • లెక్కింపు కేంద్రం మార్గంలో షాపుల బంద్‌

రంపచోడవరం, జూన్‌ 3: రంపచోడవరంలో అసెంబ్లీ, అరకు పార్లమెంటుకు సంబంధించి ఈ సెగ్మెంట్‌ ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ మేరకు రంపచోడవరం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి సూరజ్‌ గనోరే, రిటర్నింగ్‌ అధికారి ప్రశాంతకుమార్‌ మంగళవారం మీడియాకు వివరాలు అందించారు. ఈ నియోజకవర్గంలో 11 మండలాలలో అసెంబ్లీకి, పార్లమెంటుకు 2,08,025 మంది ఓటర్లు ఈవీఎంల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వీరే కాకుండా ఎన్నికల విధులలో ఉన్న ఈ నియోజకవర్గానికి చెందిన 3,224 మంది ఓటర్లు పోస్టల్‌ బ్యాలెట్ల ద్వారా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. 399 పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించి రంపచోడవరంలోని గిరిజన గురుకుల బాలికల విద్యాలయంలో లెక్కింపు కేంద్రాలను నిర్వహిస్తున్నారు. అసెంబ్లీకి, పార్లమెంటుకు వేర్వేరుగా లెక్కింపు కేంద్రాలను ఏర్పాటు చేశారు. 20 టేబుళ్ల చొప్పున ఒక్కో కేంద్రంలో 20 రౌండ్లుగా లెక్కిస్తారు. అసెంబ్లీకి సంబంధించి తొలుత పోస్టల్‌ బ్యాలెట్లను లెక్కిస్తారు. అనంతరం ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కాగా పార్లమెంటు విషయానికి వస్తే పార్లమెంటు పోస్టల్‌ బ్యాలెట్లను పార్వతీపురానికి పంపించి వేశారు. అరకు పార్లమెంటులో అన్ని సెగ్మెంట్లకు సంబంధించి పోస్టల్‌ ఓట్లను అక్కడే లెక్కిస్తారు. రంపచోడవరం సెగ్మెంట్‌కు సంబంధించి పార్లమెంటు ఓట్లను నేరుగా ఈవీఎంలతోనే ప్రారంభిస్తారు. ఈ ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఆయా అభ్యర్థులు, వారి ప్రధాన ఏజెంట్లు, లెక్కింపు ఏజెంట్లు, గుర్తింపు పొందిన మీడియా ప్రతినిధులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇదిలా ఉండగా రంపచోడవరం మొత్తం పోలీసు ఆధీనంలోకి వెళ్లిపోయింది. ఓట్ల లెక్కింపు కేంద్రం రంపచోడవరంలోని డిగ్రీ కళాశాల వెనుక ఉండటంతో, రంపచోడవరం నుంచి అక్కడి వరకూ జన సంచారాన్ని కూడా నిషేధించారు. ముఖ్యంగా రంపచోడవరం ఏరియా ఆసుపత్రి నుంచి ఓట్ల లెక్కింపు కేంద్రం వరకూ అడుగడుగునా సాయుధ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఫలితాల అనంతరం కూడా ఎటువంటి ఊరేగింపులకు, సంబరాలకు మంగళవారం అనుమతి లేదని పోలీసు అధికారులు స్పష్టం చేశారు.

Updated Date - Jun 04 , 2024 | 02:18 AM