Share News

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల విజయం ఖాయం

ABN , Publish Date - Mar 24 , 2024 | 01:28 AM

శనివారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాలులో అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులు, అజ్జర్వర్లతో నిర్వహించిన వర్స్‌షాపులో అనపర్తి నియోజక వర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.

వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థుల విజయం ఖాయం

అనపర్తి ఉమ్మడి అభ్యర్థి రామకృష్ణారెడ్డి

మంగళగిరిలో ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో బాబు వర్క్‌షాప్‌

అనపర్తి, మార్చి 23: శనివారం విజయవాడలోని ఏ కన్వెన్షన్‌ హాలులో అసెంబ్లీ, పార్లమెంట్‌ అభ్యర్థులు, అజ్జర్వర్లతో నిర్వహించిన వర్స్‌షాపులో అనపర్తి నియోజక వర్గ టీడీపీ, జనసేన, బీజేపీ అభ్యర్థి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రంలో భారీ మెజార్టీ సాధించడం ఖాయమ ని అన్నారు. అభ్యర్థులు అనుసరించాల్సిన వ్యూహాలపై చంద్రబాబు దిశా నిర్ధేశం చేశారన్నారు. రాష్ట్రంలో గెలుపు అవకాశాలను దృష్టిలో ఉంచుకుని టిక్కెట్లు ఇచ్చా మని ఆయన పేర్కొన్నారని అన్నారు. వైసీపీ తప్పుడు ప్రచారాలను ప్రజలకు వివరించాలని ఆయన ఈసందర్భంగా కోరినట్లు రామకృష్ణారెడ్డి తెలిపారు.

టీడీపీ వర్క్‌షాప్‌లో ఆదిరెడ్డి వాసు

రాజమహేంద్రవరం సిటీ: విజయవాడలోని టీడీపీ సెంట్రల్‌ కార్యాలయంలో శనివారం సాయంత్రం నిర్వహించిన వర్క్‌షాప్‌లో రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత చంద్రబాబు అభ్యర్థులందరికీ దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన విధానాలపై చర్చించారు. ఈ వర్క్‌షాప్‌లో రాష్ట్రంలోని అభ్యర్థులు, ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.

ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యం

రాబోయే ఎన్నికల్లో టీడీపీ గెలుపు తథ్యమని రాజమహేంద్రవరం టీడీపీ-జనసేన-బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి వాసు అన్నారు. స్థానిక 40వ డివిజన్‌లో శనివారం జరిగిన భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమంలో ఆయన, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌, మజ్జి రాంబాబులతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కరపత్రాలు పంపిణీ చేశారు. జగన్‌ ప్రభుత్వం అవలంభించిన ప్రజావ్యతిరేక విధానాలను వివరించారు. ఈ సందర్భంగా వాసు మాట్లాడుతూ ఎంపీ భరత్‌ తన స్వార్ధం కోసం వలంటీర్లును వినియోగించుకుని వారి ఉపాధికి గండి కొట్టారని విమర్శించారు. రౌడీషీటర్లు, గంజాయి, బ్లేడ్‌ బ్యాచ్‌లతో ప్రజలు భయపెట్టేందుకు చూస్తున్నారని, సొంత వ్యక్తికి మునిసిపల్‌ కాంట్రాక్టు ఇప్పించుకుని, ప్రతి పనికి 25శాతం కమీషన్‌ తీసుకున్నారని, అటువంటి వ్యక్తికి మళ్ళీ పదవి ఇవ్వడం శ్రేయస్కరం కాదని ప్రజలు భావిస్తున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సింహా నాగమణి, సింహా వెంకటేష్‌ , కొల్లి నాని తదితరులు పాల్గొన్నారు.

వలంటీర్లను ఇరకాటంలో పెట్టింది ఎంపీ భరతే

25 శాతం కమీషన్‌ తీసుకుని నీతి కబుర్లు : అనుశ్రీ

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 23: ఎన్నికల కోడ్‌ అమలులో వుందని తెలిసి కూడా వలంటీర్లను పిలిచి సమావేశం పెట్టి వాళ్లను ఇరకాటంలో పెట్టింది ఎంపీ భరతేనని జనసేన రాజమహేంద్రవరం ఇన్‌చార్జి అత్తి (అనుశ్రీ) సత్యనారాయణ విమర్శించారు. రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో అనుశ్రీ మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి పనులమాటున 25శాతం కమీషన్‌ తీసుకునే భరత్‌.. పవన్‌ కళ్యాణ్‌ను విమర్శిస్తాడా, రాజమహేంద్రవరంలో డిపాజిట్లు కూడా రావని అన్నా రు. పవన్‌ను అత్యధిక మెజార్టీతో పిఠాపురం ప్రజలు గెలిపించబోతున్నారని చెప్పారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్నప్పుడు మీటింగ్‌లు పెట్టకూడదని తెలిసి కూడా వలంటీర్లతో మీటింగ్‌ పెట్టి వాళ్లకు ఉద్యోగాలు లేకుండా చేశాడని, పైగా ఆ బురద తమ అభ్యర్థిపై జల్లే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కాంట్రాక్టరు మార్గాని సురేష్‌ కనుసన్నల్లో మునిసిపల్‌ కార్పొరేషన్‌కు సంబంధించి అన్నిపనులు జరగడం వెనుక భరత్‌ ఉన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. సమావేశంలో జనసేన ఉపాధ్యక్షుడు గుత్తుల సత్యనారాయణ, పైడి రాజు, నల్లంశెట్టి వీరబాబు, శ్యాంసుందర్‌, విన్నవాసు పాల్గొన్నారు.

‘వ్యాపారులంటే ఎంపీ భరత్‌కు కక్ష’

రాజమహేంద్రవరం సిటీ, మార్చి 23: రాజమహేంద్రవ రంలో వ్యాపారులపై ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ కక్షగట్టారని టీడీపీ నగర ఉపాధ్యక్షుడు ఉప్పులూరి జానకిరామయ్య, మజ్జి రాంబాబు, యిన్నమూరి రాంబాబు విమర్శించారు. స్థానిక ప్రెస్‌క్లబ్‌లో శనివారం జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ నగరంలో తాము 22 రోజుల పాటు పర్యటించామని, వ్యాపారాలు ఎక్కువగా జరిగే ప్రాంతాల్లోనే భరత్‌రామ్‌ రోడ్డు తవ్వేసి నెలల తరబడి అలాగే ఉంచేస్తున్నారన్నారు. తన 25శాతం కమిషన్‌ కోసం ఆయన ఏం చేయడానికైనా ఎవరిని ఇబ్బంది పెట్టడానికైనా సిద్ధమేనన్నారు. ఎంపీ భరత్‌ మెయిన్‌ రోడ్డులో సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటు చేయించారని, అయితే ఆదిరెడ్డి వాసు ఆ ప్రాంతంలో పర్యటించిన సమయంలో స్థానిక వ్యాపారులు సెంట్రల్‌ లైటింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేశారని, తాము అధికారంలోకి వచ్చాక తొలగిస్తామని వాసు హామీ ఇవ్వడంతో రాత్రికి రాత్రే వాటిని ఎంపీ తొలగించాడని విమర్శించారు. నగరంలో ఏవీఏ రోడ్డు, దానవాయిపేట రోడ్లును తవ్వేసి నెలల గడచినా పూర్తి చేయలేదని, దీంతో స్థానిక వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ఎంపీ భరత్‌రామ్‌ వన్‌టైమ్‌ పొలిటీషియన్‌ అనివర్ణించారు. సమావేశంలో నగర ట్రేడర్స్‌ సెల్‌ అధ్యక్షు డు నిమ్మలపూడి గోవింద్‌, మస్తాన్‌ చౌదరి, ముప్పన రుద్ర, మదినా సాహెబ్‌ పాల్గొన్నారు.

స్థానిక రైతు బిడ్డకు ఒక్క అవకాశం ఇవ్వండి

ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ

కోరుకొండ, మార్చి 23: తాను కోరుకొండ మండలం గాదరాడ గ్రామానికి చెందిన సామాన్య రైతు బిడ్డనని..తనకు ఒక్క అవకాశం ఇస్తే రైతును రాజును చేస్తానని జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. కోరుకొండ జనసేన పార్టీ కార్యాలయం వద్ద శనివారంఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు, రాష్ట్రాలకు తరలిపోవడంతో తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని వ్యవసాయం మరుగున పడుతుందని జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపాధి కల్పించే విధంగా రాజానగరంను అభివృద్ధి చేస్తానని బలరామకృష్ణ పేర్కొన్నారు. వైసీపీలో కుదేలైన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. కాలువల్లో పూడిక తీసి ప్రతి ఎకరానికి నీరు అందిస్తామన్నారు. గోదావరి ప్రక్కనే ఉన్న మంచినీరు అందక గొంతు ఎండుతుందన్నారు. ప్రతి ఇంటికి విద్య, వైద్య, సంక్షేమం, రోడ్లు, డ్రైనేజీలు, వీధిలైట్లు ఏర్పాటు చేసి ప్రజలకు మేలైన పాలన అందిస్తామన్నారు. సమావేశంలో జనసేన నాయకులు డాక్టర్‌ అడపా శ్రీనివాస్‌, అద్దాల శ్రీనివాస్‌, భూషణం, తాతాజీ, రాంబాబు, బాపిరాజు, మట్టా సత్యనారాయణ పాల్గొన్నారు.

Updated Date - Mar 24 , 2024 | 01:28 AM