Share News

పండగొచ్చేసింది!

ABN , Publish Date - Jan 14 , 2024 | 01:29 AM

సంక్రాంతి అంటే పల్లెల నిండా సందడే. ఇంటిల్లపాదీ ఆనందంగా గడిపే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను ఎంతో సందడిగా జరుపుకో వడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు.

పండగొచ్చేసింది!
అనపర్తి మండలం పొలమూరులో కోడిపందాల నిర్వహణకు ఏర్పాట్లు

కాలు దువ్వుతున్న కోళ్లు

(రాజమహేంద్రవరం-ఆంధ్రజ్యోతి)

సంక్రాంతి అంటే పల్లెల నిండా సందడే. ఇంటిల్లపాదీ ఆనందంగా గడిపే పండుగ. భోగి, సంక్రాంతి, కనుమ పండగలను ఎంతో సందడిగా జరుపుకో వడానికి ప్రజలంతా సిద్ధమయ్యారు. కొందరికి కోడిపందాలు లేకపోతే పం డగ అనిపించనట్టు అయిపోయింది. చివరకు కోడి పందాలు రాజకీయ నేత ల కనుసన్నల్లో జరిగే స్థాయికి చేరిపోయాయి. అసలే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పందెంరాయుళ్లను సైతం ఆనందపరిచేలా ఇప్పటికే అటు రాజకీయ నాయకులు, ఇటు పోలీసుల అనధికార గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన ట్టు కనిపిస్తోంది. దీనికి అనుగుణంగానే పందాల బరులు సిద్ధమైపోతున్నా యి. కోర్టులు వద్దన్నా, పోలీసులు అడ్డుకున్నా.. రాజకీయ నేతలు మాత్రం కోడిపందాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ పండగ మూడు రోజులు ఎవరు అవునన్నా కాదన్నా కోడి పందాలు ఆగే పరిస్థితి లేదు. జిల్లాలో పోలీ సులు మాత్రం పందాలు ఆడనిచ్చేలేదని, కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఇవి నిషేధమని చెబుతున్నారు. కానీ రాజకీయ నేతలు ఈ మూడు రోజులు ఎలాగైనా పం దాలాడిస్తామని చెబుతున్నారు. కోడి పందెం అంటే కేవలం రెండు కోళ్ల కొట్టుకోవడం కాదు. దాని ముసుగులో కోట్లాది రూపాయల లావాదేవీలు జరిగే గుండాటలు, పేకాటలు, మూడు ముక్కాటలు, మద్యం అమ్మకాలు ఇలా అనేక చట్టవిర్ధుమైన కార్యకలాపాలకు ఆలవాలమవుతాయి. కేవలం కోడిపందాలకు అనుమతి ఇస్తామని చెప్పినా కత్తులు లేకుండా ఆడుకోమని చెప్పినా ఎవరూ ముందుకురారు. గుండాటలు, పేకాటలు తప్పనిసరి. బరుల నిర్వాహకులకు ఆదాయం గుండాటలు, పేకాటల నిర్వహణ వల్లే వస్తుంది. ఒక్కో బరికి రూ.లక్షల ఆదాయం వస్తుంది. అందుకే పందాల ముసుగులో జూదం జరుగుతుంది. వాస్తవానికి సంప్రదాయకంగా కోడి పందాలకు చాలాసార్లు అనుమతిచ్చారు. కానీ దీనిని జూదం చేయడం వల్లే ఇబ్బందవుతోంది. ఇక జిల్లాలో కోడి పందాలకు బరులు సిద్ధమవుతున్నాయి. ఓపక్క పోలీసులు బరులను ఽధ్వంసం చేస్తున్నా, ఫ్లెక్సీలు కడుతున్నా లెక్క చేసే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలోని అన్ని మండలాల్లో కోడిపందాలు బరులు రెడీ అవుతున్నాయి. రాజమహేంద్రవరం రూరల్‌, కడియం, రాజా నగరం, కోరుకొండ, గోకవరం, సీతానగరం, రంగం పేట, అనపర్తి, బిక్కవోలు తదితర అన్ని ప్రాంతాల్లో బరులను సిద్ధం చేస్తున్నారు. కొవ్వూరు డివిజన్‌లో కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం నియోజవర్గాల్లోని అన్ని మండలాల్లోనూ పుంజులు కాళ్లు దువ్వుతున్నాయి. భోగి రోజు కాస్త నెమ్మదిగా మొదలైనా రెండో రోజు నుంచి కనుమ వరకూ పందాలు పుంజుకుంటాయని నిర్వాహ కులు చర్చించుకుంటున్నారు. మరోపక్క పోలీసులు అవగాహన సదస్సులు పెడుతున్నారు. కోడి పందాలు నిషేధమని, కోర్టు ఆదేశాలు కూడా ఉన్నా యని, ఎవరైనా ఆడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని, యువత ఆడి కేసు నమోదెతే ఉద్యోగ అవకాశాలకు కూడా పోతాయని హెచ్చరిస్తున్నారు. ఇలా ఒకపక్క పోలీసులు పందాలు ఆడనిచ్చేలేదని పట్టుబడుతుంటే, మరో పక్క రాజకీయనేతలు ప్రభుత్వం నుంచే అనుమతి వస్తుందని, పోలీసులు మౌనం వహించక తప్పదని నిర్వాహకులకు నచ్చచెబుతున్నారు.

పందాలకు సై అంటున్న పందెంరాయుళ్లు

అనపర్తి, జనవరి 13 : సంక్రాంతి సందర్భంగా కోడి పందాలకు పందెం రాయుళ్లు ఏర్పాట్లు శరవేగంగా పూర్తి చేస్తున్నారు. ఏదిఏమైనా కోడిపందాలు నిర్వహిస్తామంటూ నిర్వాహకులు, జరగనివ్వమంటూ పోలీసుల హెచ్చరికల ఫ్లెక్సీ కడుతూ ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. అనపర్తి మండలం లోని పలు గ్రామాల్లో ఇప్పటికే ఊరి చివర ప్రాంతాల్లో టెంట్‌లను ఏర్పాటు చేయడంతో నిర్వాహకులు కోడి పందాలకు, ఇతర జూడ క్రీడలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏ క్షణంలోనైనా పందాలకు అనుమతులు వచ్చాయనే భావన తో నిర్వాహకులు ఏర్పాట్లు చేసుకున్నారు. మండలంలోని పొలమూరు, పీరా రామచంద్రపురం గ్రామాల్లో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ రామారావు మాట్లాడుతూ కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని, గతంలో పందాలు జరిగిన ప్రాంతాల్లోనే కాకుండా అనుమానం ఉన్నచోట్ల బరులు ఏర్పాటుచేయకుండా నిఘా పెట్టామని చెప్పారు.

జూదం జోలికెళ్తే జైలుకే : ఎస్పీ జగదీశ్‌

రాజమహేంద్రవరం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పండుగ సందర్భంగా కోడి పందాలు, గుండాట, జూదం, అశ్లీల నృత్యాలు తదితర చట్ట వ్యతిరేక కార్య కలాపాలను నిర్వహిస్తే జైలుకు వెళ్లక తప్పదని ఎస్పీ జగదీశ్‌ ఘాటుగా హెచ్చరించారు. కోడిపందాలు వేయడానికి అనుమతులు వస్తాయంటూ వదంతులు వ్యాప్తిచేసి బరుల ఏర్పాటుకు సన్నద్ధమవుతున్నారన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతులు వచ్చే అవకాశం లేదన్నారు. అసాంఘిక కార్య కలాపాల నిర్వాహకులతోపాటు పాల్గొన్న వారిపై కూడా కేసులు పెడతామ న్నారు. జిల్లాలోని ఇప్పటికే కోడి పందాల బరులను ధ్వంసం చేస్తున్నామని ఆయన చెప్పారు. రెవెన్యూశాఖతో సమన్వయం చేసుకొని అన్ని పోలీస్‌ స్టేష న్ల పరిధిలో కోడి పందాలు జరిగే ఆస్కారం ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు అవ గాహన కల్పించడంతోపాటు ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోడిపందాలు అడిన వారిపై కూడా బైండోవర్‌ కేసులు నమోదు చేస్తున్నామ న్నారు. చెడు వ్యసనాల దారి పట్టకుండా ముఖ్యంగా యువత సంప్రదాయ వాతావరణంలో సంతోషంగా సంక్రాంతి సంబురాలు చేసుకోవాలని ఎస్పీ కోరారు. బొమ్మూరు పీఎస్‌ పరిధిలో ఈస్ట్‌జోన్‌ డీఎస్పీ కిషోర్‌ కుమార్‌, సీఐ విజయ్‌కుమార్‌ తమ సిబ్బందితో కలిసి శాటిలైట్‌ సిటీలోని కోడిపందాల బరు లను, కడియం పీఎస్‌ పరిధిలో సౌత్‌ జోన్‌ డీఎస్పీ కె.శ్రీనివాసులు, సీఐ తిలక్‌ ఆధ్వర్యంలో వీరవరం గ్రామంలో కోడిపందాల కోసం ఏర్పాటుచేసిన టెంట్లను ధ్వంసం చేయడం జరిగిందన్నారు. త్రీటౌన్‌ పరిధిలో పందాలు వేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాల్లో సీఐ ప్రసన్నవీరయ్యగౌడ్‌, నల్లజర్లలో సీఐ దుర్గా ప్రసాద్‌, గోపాలపురం పరిధిలో సీఐ సతీశ్‌కుమార్‌, కోరుకొండలో ఎస్‌ఐ శారదా సతీశ్‌, నిడదవోలులో ఎస్‌ఐ పి.నాగరాజు ఆయా గ్రామాల్లో తనిఖీలు చేసి ఫ్లెక్సీలు ఏర్పాటుచేశారని ఎస్పీ చెప్పారు. కోడిపందాలు, జూదాలపై దగ్గ రలోని పోలీసులకు లేదా నేరుగా తనకు సమాచారం అందించాలని కోరారు.

ఆర్టీసీకి లోకల్‌ ట్రాఫిక్‌!

రాజమహేంద్రవరం అర్బన్‌, జనవరి 13: ఆర్టీసీ లోకల్‌ ట్రాఫిక్‌ ఒక్కసారిగా ఊపందుకుంది. ఆదివారం భోగి పండుగను కన్నవారింట్లో జరుపుకోవడానికి మహిళలంతా తమ భర్త, పిల్లలతో కలసి ప్రయాణమయ్యారు. దీంతో శనివారం రాజమహేంద్రవరం ఆర్టీసీ బస్‌ కాంప్లెక్స్‌ ప్రయాణి కులతో కిటకిటలాడింది. సంక్రాంతి పండక్కి సొంతూర్లకు వెళ్లేందుకు ఆర్టీసీ ప్రయాణికులు పోటెత్తడంతో అధికారులు స్పెషల్‌ బస్సులు నడపడానికి నానా హైరానా పడ్డారు. ఉదయం నుంచే రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీ కనిపించింది. రాత్రి వరకూ కొనసాగింది. రాజమహేంద్రవరంతోపాటు రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాల నుంచి విశాఖప ట్నం, విజయవాడ.. అమలాపురం, తుని, జంగారెడ్డిగూడెం, భద్రాచలం, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లడానికి ప్రజలు పిల్లాపాపలతో తరలిరావడంతో రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ కిక్కిరిసిపోయింది. ప్ర యాణికులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో విశాఖపట్నం, విజయవాడ రూట్లలో ఆర్టీసీ స్పెషల్‌ బస్సులు నడుపుతోంది. గత రెండు రోజులుగా ప్రయాణికుల సంఖ్య పెరగడంతో ఇప్పటివరకూ షెడ్యూలు బస్సులతోపాటు విశాఖపట్నం, 53 సర్వీసులు, విజయవాడకు 18 సర్వీసులు నడిపినట్టు ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. మరోపక్క పాలకొండ, ఇచ్చాపురం, పలాస తదితర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు కూడా పెద్ద సంఖ్యలో ఆర్టీసీ బస్సులను ఆశ్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి విశాఖపట్నం వరకూ వెళితే అక్కడ నుంచి తమ సొంతూర్లకు సులువుగా చేరుకోవచ్చని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణాలు సాగిస్తున్నారు. భోగి పండుగ రోజైన ఆదివారం కూడా రష్‌ ఎక్కువగానే ఉంటుందని ఆర్టీసీ అధికారులు అంచనా వేస్తున్నారు. దీంతో స్పెషల్‌ సర్వీసులు నడపడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

కాకినాడ నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద భారీ క్యూలు ...

విశాఖపట్నం, విజయవాడ ప్లాట్‌ఫారాలపై ప్రయాణికులు పెద్దసంఖ్యలో బస్సుల కోసం ఎదురుచూస్తూ కనిపించారు. కాకినాడ నాన్‌స్టాప్‌ కౌంటర్‌ వద్ద భారీ క్యూలు దర్శనమిచ్చాయి. బస్సు రాగానే పరుగులు పెడుతూ ఎక్కాల్సి వచ్చింది. బస్సులు ఎక్కడానికి, బస్సుల్లో సీటు కోసం తోసుకుంటూ, తొక్కుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రధానంగా అమలాపురం వైపు వెళ్లే బస్సుల కోసం ప్రయాణికులు గంటల కొద్దీ వేచి చూడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. రాజమహేంద్రవరం-అమలాపురం రూటులో కేవలం అమలాపురం డిపో నుంచి మాత్రమే బస్సులు నడుపుతారు. దీంతో అమలాపురం, రావులపాలెం వైపు నుంచి బస్సులు వస్తేనే ప్రయాణం సాగించాల్సి రావడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు.

పండుగ వేళ మద్యం బాదుడు

క్వార్టర్‌ బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 పెంపు

రాజమహేంద్రవరం, జనవరి 13(ఆంధ్రజ్యోతి): పండుగ వేళ జగన్‌ ప్రభుత్వం మద్యంపై మళ్లీ బాదేసింది. దీంతో మందుబాబులు గగ్గోలు పెడుతున్నారు. ఇటీవలే ఎక్కువగా విక్రయం జరిగే మద్యంపై ప్రభుత్వం ధరలు పెంచింది. ఒక్కో క్వార్టరు బాటిల్‌పై రూ.10 నుంచి రూ.20 పెరిగింది. ఇప్పుడు సంక్రాంతికి మద్యం అమ్మకా లు ఎక్కువగా ఉంటాయనే ఆలోచనతో గల్లాపెట్టె నింపుకోడానికి తెరతీసింది. ఆది వారం నుంచి రెండు బ్రాండ్లపై ధరలు పెరుగుతున్నాయి. 8పీఎం ఇప్పటి వరకూ ఎంఆర్‌పీ రూ.200 ఉంటే 210.. మ్యాజిక్‌ మూమెంట్‌ వోడ్కా రూ.190పై రూ.20 పెంచుతున్నారు. రెండు బ్రాండ్లకూ ఇకపై రూ.290 వసూలు చేయనున్నారు. అయితే దీనిపై శనివారం రాత్రి వరకూ అధికారికంగా ఎక్సైజ్‌ అధికారులకు సమా చారం లేదు. దీంతో పండుగ నేపథ్యంలో మందుబాబులను దోపిడీ చేయడానికి ఎవరు సిద్ధం అవుతున్నారనే అనుమానం వ్యక్తమవుతోంది. ఇప్పటికే బీర్లు రేట్లు అమాంతం పెరిగిపోయాయి. ఒక్కో బీరు రూ.300 నుంచి రూ.330 వరకూ అమ్ము తున్నారు. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అందుబాటులో ఉండకపోవడంతో బార్లలో కొనుక్కోక తప్పని పరిస్థితి సృష్టించారు. ఇప్పుడు మళ్లీ ధరలు పెంచేసింది.

పండుగకు ఊరెళ్తున్నారా?

ఎల్‌హెచ్‌ఎంఎస్‌తో ఇల్లు భద్రం: ఎస్పీ జగదీశ్‌

రాజమహేంద్రవరం, జనవరి13(ఆంధ్రజ్యోతి): పండుగకు వేరే ఊరు వెళ్లేవాళ్లు పోలీసులు ఉచితంగా అందిస్తున్న లాక్‌డ్‌ హౌస్‌ మానిటరింగ్‌ సిస్టం (ఎల్‌హెచ్‌ ఎంఎస్‌)ను ఉపయోగించుకొని ఇంట్లోని వస్తువులకు రక్షణ కల్పించుకోవాలని ఎస్పీ జగదీశ్‌ కోరారు. ఈ సర్వీసు కోసం 9493206371, 9908454580 ఫోన్‌ నం బర్లలో సంప్రదిస్తే సిబ్బంది వచ్చి ఇంట్లో సీసీ కెమెరా ఏర్పాటు చేస్తారన్నారు. వాటిని పోలీస్‌ కంట్రోల్‌ రూంలో నిరంతరం పర్యవేక్షిస్తుంటారని చెప్పారు. దీంతో చోరీలను అరికట్టవచ్చన్నారు. అలాగే ఆభరణాలు తదితర విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో ఉంచాలన్నారు. బయటి గేటును లోపలి నుంచి లాక్‌ చేయడం, తాళం కనిపించకుండా కర్టెన్‌ని ఉంచడం, ఇంట్లో ఒకటి రెండు లైట్లు వెలిగి ఉం డేట్లు చూసుకోవడం, నమ్మకస్తుడిని వాచ్‌మెన్‌/సెక్యూరిటీ గార్డుగా ఉంచడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా ఇంటి ఆవరణలో పాలప్యాకెట్లు, దినపత్రికలు, చెత్త పేరుకుపోకుండా చూడాలన్నారు. ఊరు వెళ్తున్న, ఎన్ని రోజులు ఇంటి వద్ద ఉండరో వంటి విషయాలను సోషల్‌ మీడియాలో పోస్టు చేయకపోవ డమే మంచిదని తెలిపారు. అలాగే ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు తారసప డితే వెంటనే 100కి ఫోన్‌ చేసి పోలీసు సహాయం పొందాలని ఎస్పీ సూచించారు.

Updated Date - Jan 14 , 2024 | 01:29 AM