తూర్పు కలెక్టర్‌గా ప్రశాంతి
ABN , Publish Date - Jun 23 , 2024 | 12:39 AM
తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియమితులయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది.
రాజమహేంద్రవరం, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : తూర్పుగోదావరి జిల్లా నూతన కలెక్టర్‌గా పి.ప్రశాంతి నియమితులయ్యారు.ఈ మేరకు ప్రభుత్వం శనివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత కలెక్టర్ కె.మాధవీలతను బదిలీ చేసి పోస్టింగ్ ఇచ్చే వరకూ జనరల్ అడ్మిస్ర్టేషన్ డిపార్ట్‌మెంట్ (జీఏడీ)కు రిపోర్టు చేయవలసిందిగా ప్రభుత్వం ఆదేశించింది. కొత్తగా ఏర్పడిన తూర్పుగోదావరి జిల్లాకు తొలి కలెక్టర్‌గా మాధవీలత నియమితులయ్యారు. 2022లో కొత్త జిల్లాల విభజన నేపథ్యంలో ఏప్రిల్ మొదటి వారంలో ఆమె జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. రెండేళ్ల మూడు నెలలు ఇక్కడ ఆమె కలెక్టర్‌గా ఉన్నారు అఽధికార వైసీపీకి బాగా దగ్గరగా ఉన్నారనే ఆరోపణలున్నాయి. అధికార వైసీపీ ఏం చెబితే అది చేశారనే అపవాదు ఉంది. జిల్లాలో అంతా తానుగా వ్యవహరించారనే ప్రచారం ఉంది. జిల్లాకు రెండో కలెక్టర్‌గా 2014 బ్యాచ్‌కు చెందిన మహిళా ఐఏఎస్ అధికారి పి.ప్రశాంతి రావడం గమనార్హం. భీమవరం కేంద్రం ఏర్పడిన పశ్చిమగో దావరి జిల్లా మొదటి కలెక్టర్‌గా ఆమె పనిచేశారు. తూర్పుగోదావరి జిల్లా రెండో కలెక్టర్‌గా స్థానం దక్కించుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఆమె బాగా పనిచేశారనే వాదన ఉంది. సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీ నేతలు చెప్పినవాటికి తలూపకపోవడంతో ఫిబ్రవరి నెలలో ఆమెను ఎన్ని కల ముందు ఆకస్మికంగా బదిలీ చేశారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్‌గా నియమించారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఆమె తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమితులయ్యారు.
అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా దినేశ్‌కుమార్
పాడేరు, ఏప్రిల్ 22 (ఆంధ్రజ్యోతి): అల్లూరి సీతా రామరాజు జిల్లా కలెక్టర్ ఎం.విజయసునీత బదిలీ అయ్యారు.ఆమె స్థానంలో ప్రకాశం జిల్లా కలెక్టర్‌గా పనిచేస్తున్న ఏ.ఎస్.దినేశ్‌కుమార్‌ను నియమించారు. విజయసునీతను జీఏడీలో రిపోర్టు చేయాలని సూచించారు.ఎన్నికల ముందు (ఫిబ్రవరి 14న) జిల్లా కలెక్టర్ల బదిలీల్లో భాగంగా ఇక్కడ కలెక్టర్‌గా పనిచేస్తున్న సుమిత్‌కుమార్‌ను పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు.ఆయన స్థానంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ ఎం.విజయసునీతను నియమించారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఆమె సుమారు నాలుగు నెలల పాటు పనిచేశారు.