Share News

ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు

ABN , Publish Date - May 25 , 2024 | 12:14 AM

నన్నయ వర్శిటీలో జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత కోరారు.

ముందు పోస్టల్‌ బ్యాలెట్‌ లెక్కింపు
రాజకీయ పార్టీల ప్రతినిధులతో చర్చిస్తున్న మాధవీలత

రాజమహేంద్రవరం సిటీ, మే24 : నన్నయ వర్శిటీలో జూన్‌ 4న నిర్వహించే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు ఎన్నికల యంత్రాంగానికి సహకరించాలని జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత కోరారు. జిల్లా కలెక్టరేట్‌లో శుక్రవారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో నిర్వహిం చిన సమావేశంలో ఆమె మాట్లాడారు. లాండ్‌ అర్డర్‌కు అనుగుణంగా ఎన్నికల కౌంటింగ్‌ వద్ద చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. రాజకీయ పార్టీలు వారి వారి కౌంటింగ్‌ ఏజెంట్ల సమాచారం ముందస్తుగానే అందించాలన్నారు. కౌంటింగ్‌ ఏజెంట్ల కోసం దివాన్‌ చెరువు తదితర ప్రాం తాల నుంచి షటిల్‌ బస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కౌటింగ్‌ కోసం ఒక పార్లమెంట్‌, ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు హాల్స్‌లో 129 టేబుల్స్‌ ఏర్పాటు చేశామన్నారు. కౌంటింగ్‌ ప్రక్రియ పూర్తి కాగానే ఐదు ఈవీఎం లకు చెందిన వీవీ పాట్స్‌లోని ఓట్లను లెక్కిస్తారన్నారు. వాటిని లాటరీ పద్దతిలో ఎంపిక చేయనున్నట్టు తెలిపారు. కౌటింగ్‌ టేబుల్స్‌ సంఖ్య మేరకు కౌంటింగ్‌ ఏజెంట్లను అనుమతిస్తామని ఆ మేరకు ఐడి కార్డులు జారీ చేస్తామని తెలిపారు. నేరచరిత్ర కలిగిన , బైండోవర్‌ కేసులు నమోదైన వ్యక్తులను కౌంటింగ్‌ ఏజెంట్‌గా నియమించకూడదన్నారు. అభ్యర్థి తరపున ఒక ఏజెంట్‌ను మాత్రమే కౌంటింగ్‌ కేంద్రంలోకి అనుమతిస్తామని.. ఇద్దరిలో ఎవరో ఒకరు మాత్రమే ఉండడానికి అవకాశం ఉంటుందన్నారు. పోస్టల్‌ ఓట్ల లెక్కింపుతో అర్ధగంట ముందే కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభిస్తా రన్నారు. అనంతరం ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారని తెలిపారు. నన్నయ యూనివర్శిటీలోకి వాహనాలకు అనుమతిలేదన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి జూన్‌ 6వ తేదీ వరకు అమలులో ఉంటుందని ఎవరు కోడ్‌ను ఉల్లంఘించరాదన్నారు. సమావేశంలో జేసీ తేజ్‌ భరత్‌, ఏసీపీ అనీల్‌ కుమార్‌, పార్లమెంట్‌ సహాయ రిటర్నింగ్‌ అధికారి ఆర్‌.కృష్ణ నాయక్‌, ట్రైనీ డిప్యూటి కలెక్టర్‌ ఎం.భానుప్రకాష్‌ పాల్గొన్నారు.

ఓట్ల లెక్కింపునకు పటిష్ట బందోబస్తు

భద్రత ఏర్పాట్లపై సమీక్షించిన ఎస్పీ జగదీశ్‌

రాజమహేంద్రవరం, మే 24(ఆంధ్రజ్యోతి): ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పకడ్బందీ బందోబస్తు ఏర్పాట్లు చేశామని ఎస్పీ జగదీశ్‌ పేర్కొన్నారు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలను ఉల్లంఘించినా, శాంతిభద్రతలకు విఘా తం కలిగించినా ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి నన్నయ యూనివర్సిటీలో ముందస్తు భద్రత ఏర్పాట్లపై పోలీసు అధికారులతో జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ సమీక్షించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా విధుల నిర్వహణపై దిశానిర్దేశం చేశారు. ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌పై చర్చించారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, రూఫ్‌టాప్‌ బందోబస్తు రెగ్యులేషన్‌, వాహనాల పార్కింగ్‌కు ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని ఆదేశిం చారు.ఏజెంట్ల వాహనాలను నిర్దేశించిన పార్కింగ్‌ ప్రాంతానికి తరలించాల న్నారు. కౌంటింగ్‌ ఏజెంట్లను క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు రిటర్నింగ్‌ అధికారి జారీ చేసిన అనుమతి పత్రాలను నిబంధనల ప్రకారం సరిచూసు కొని మాత్రమే కౌంటింగ్‌ కేంద్రాల్లోకి అనుమతించాలన్నారు. మహిళలను తనిఖీ చేయడానికి ప్రత్యేకంగా మహిళా పోలీస్‌ సిబ్బందిని నియమించాల న్నారు. కౌంటింగ్‌ కేంద్రాల పరిసరాలను బాంబ్‌ డిస్పోజల్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేయించాలని ఆదేశించారు. ఫలితాలు వెల్లడైన తర్వాత ఎలాంటి అల్లర్లు చెలరేగకుండా ముందస్తు భద్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఓట్ల లెక్కింపు పూర్తయ్యే వరకూ బాణసంచా విక్రయాలు, కాల్చడం వంటివి నిషేధించడం జరిగిందన్నారు. సమావేశంలో అడిషనల్‌ ఎస్పీలు పి.అనీల్‌ కుమార్‌(శాంతిభద్రతలు),ఎస్‌ఆర్‌ రాజశేఖర్‌రాజు(పరిపాలన), ఎల్‌.చెంచి రెడ్డి(సాయుధ రిజర్వు), డీఎస్పీలు,సీఐలు,ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 25 , 2024 | 12:14 AM