Share News

కోడ్‌ ఉల్లంఘనపై కలెక్టర్‌ సీరియస్‌

ABN , Publish Date - May 21 , 2024 | 11:55 PM

గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై జిల్లా కలెక్టరు సీరియస్‌ అయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా, కార్యాలయంలోని చైర్‌పర్సన్‌ చాంబర్‌లో వైసీపీ కార్యకర్త విశ్వనాథుల దీపు(బిందు) పుట్టిన రోజు వేడుకలను చైర్‌పర్సన్‌ భర్త, కౌన్సిలరు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన విషయంపై ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం ప్రచురితమయింది.

కోడ్‌ ఉల్లంఘనపై కలెక్టర్‌ సీరియస్‌

గొల్లప్రోలు, మే 21: గొల్లప్రోలు నగర పంచాయతీ కార్యాలయంలో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘనపై జిల్లా కలెక్టరు సీరియస్‌ అయ్యారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండగా, కార్యాలయంలోని చైర్‌పర్సన్‌ చాంబర్‌లో వైసీపీ కార్యకర్త విశ్వనాథుల దీపు(బిందు) పుట్టిన రోజు వేడుకలను చైర్‌పర్సన్‌ భర్త, కౌన్సిలరు గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి ఆధ్వర్యంలో నిర్వహించిన విషయంపై ఆంధ్రజ్యోతిలో వార్తా కథనం ప్రచురితమయింది. దీనిపై జిల్లా కలెక్టరు అధికారుల వివరణ కోరారు. ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్తా కథనంపై స్వయంగా హాజరై, తీసుకున్న చర్యలతో వివరణ ఇవ్వాలని నగరపంచాయతీ కమిషనర్‌ రవికుమార్‌ను జిల్లా జాయింట్‌ కలెక్టరు, పిఠాపురం అసెంబ్లీ రిటర్నింగ్‌ అధికారి రామసుందరరెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో జరిగిన సంఘటనపై కమిషనరు వివరణ ఇస్తూ తాగునీటి సరఫరాలో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో వాటి పరిశీలన నిమిత్తం తాను వెళ్లిన సమయంలో తనకు ఎంసీసీ టీమ్‌ ద్వారా బర్త్‌డే వేడుకలపై సమాచారం వచ్చిందన్నారు. దీనితో వెంటనే వారందరిని ఖాళీ చేయించాలని ఆదేశించినట్లు కమిషనరు తెలిపారు. ఈ సంఘటన తర్వాత చైర్‌పర్సన్‌ చాంబర్‌కు తాళాలు వేశారు. మరోవైపు చైర్‌పర్సన్‌ చాంబర్‌లో ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించి పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన చైర్‌పర్సన్‌ భర్త, కౌన్సిలర్‌ గండ్రేటి శ్రీరామచంద్రమూర్తి, కౌన్సిలర్‌ గంటా అప్పలస్వామి, కౌన్సిలర్ల భర్తలు దాసం లోవబాబు(పూసలు), వడిసెల సత్తిబాబు, మైనం నూకాజీ, గొల్లప్రోలు సొసైటీ చైర్మన్‌ జ్యోతుల భీముడులపై చర్యలు తీసుకోవాలని కమిషనరు మంగళవారం గొల్లప్రోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై ఏడుగురిపై పోలీసులు మంగళవారం రాత్రి కేసు నమోదు చేశారు. మరోవైపు అనుమతి లేకుండా చైర్‌పర్సన్‌ చాంబర్‌ తెరిచిన అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగిని తాత్కాలికంగా విధులు నుంచి తప్పిస్తూ కమిషనరు రవికుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - May 21 , 2024 | 11:55 PM