Share News

చెప్తారు.. చేయరంతే..!!

ABN , Publish Date - Apr 19 , 2024 | 12:46 AM

మాట తప్పం.. మడమ తిప్పం.. ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ తరచూ వల్లె వేసే సూక్తులు. కానీ ఆచరణలో అడుగడుగునా మాట తప్పడం.. మడమ తిప్పడం పరిపాటిగా మారింది. సీఎం హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలకు ఈ ఐదేళ్లలో అనేకసార్లు వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాల్లో సమస్యలపై ఎక్కడికక్కడ అలవికాని హామీలు వదిలారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని గత ఎన్నికలప్పుడు డబ్బా కొట్టి గద్దెనెక్కిన ఆయన నేను చెప్పాను.. కానీ ఏదీ చేయను అన్న తరహాలో మారిపోయారు. జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు ఎన్నో చెప్పారు. వందలకోట్ల హామీల వరద పారించి నిధులు కూడా అక్కడికక్కడే విడుదల చేస్తున్నట్టు గొప్పలు చెప్పారు.

చెప్తారు.. చేయరంతే..!!

  • ఐదేళ్లలో హామీలన్నీ బూటకమే

  • కల్లబొల్లి కబుర్లతో జగన్‌ కాలక్షేపం

  • ఉమ్మడి జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిసారీ మోసం

  • అదిగో నిధులంటూ ఆశచూపి మరచిన వైనం

  • ఉమ్మడి జిల్లా పర్యటనలో నిలదీస్తున్న జనం

  • సీఎంగా హామీ ఇచ్చినా.. చేసింది సున్నా!

(కాకినాడ, ఆంధ్రజ్యోతి)

మాట తప్పం.. మడమ తిప్పం.. ఇదీ ముఖ్యమంత్రి జగన్‌ తరచూ వల్లె వేసే సూక్తులు. కానీ ఆచరణలో అడుగడుగునా మాట తప్పడం.. మడమ తిప్పడం పరిపాటిగా మారింది. సీఎం హోదాలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలకు ఈ ఐదేళ్లలో అనేకసార్లు వచ్చి వెళ్లారు. వచ్చిన ప్రతిసారీ నియోజకవర్గాల్లో సమస్యలపై ఎక్కడికక్కడ అలవికాని హామీలు వదిలారు. నేను ఉన్నాను.. నేను విన్నాను అని గత ఎన్నికలప్పుడు డబ్బా కొట్టి గద్దెనెక్కిన ఆయన నేను చెప్పాను.. కానీ ఏదీ చేయను అన్న తరహాలో మారిపోయారు. జిల్లాకు వచ్చినప్పుడు ప్రజలకు కల్లబొల్లి కబుర్లు ఎన్నో చెప్పారు. వందలకోట్ల హామీల వరద పారించి నిధులు కూడా అక్కడికక్కడే విడుదల చేస్తున్నట్టు గొప్పలు చెప్పారు. తీరా ఐదేళ్లు గడిచినా అవేవీ ఆచరణకు నోచుకోలేదు. ఆ చివర రాజోలు నుంచి ఈ చివర రాజమ హేంద్రవరం, కాకినాడ వరకు అనేక సభల్లో నోటికొచ్చిన హామీలు జారవిడిచారు. చేతిలో ప్రభుత్వం ఉన్నా అవేవీ ఆచరణలోకి తేలేదు. దీంతో సీఎం జగన్‌ ఇచ్చిన ప్రతి హామీ కల్లబొల్లి కబుర్లుగానే మారాయి. గోదావరికి వరదలు వచ్చినప్పుడు ఏటిగట్లు ఆధునికీకరిస్తామని చెప్పిన జగన్‌ తన పాలనలో దాని జోలికేవెళ్లలేదు. గోదావరి కాలువల్లో కాలుష్య నివారణకు మిషన్‌ క్లీన్‌ గోదావరి పేరిట హడావుడి చేసి దాన్నీ గాలికి వదిలేశారు. పోలవరం పూర్తి చేసి కాలువలకు నీళ్లు విడుదల చేస్తామన్నారు. కానీ ఇప్పటికీ కాలువల పనే పూర్తికాలేదు. 2022 జూలైలో పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో కాపునేస్తం సభకు వచ్చిన సీఎం గొల్లప్రోలు, పిఠాపురం పట్టణాల అభివృద్ధికి రూ.40 కోట్లు ఇస్తున్నట్లు గొప్పగా ప్రకటించారు. కానీ ఒక్క రూపాయి విడుదలైతే ఒట్టు. ఏలేరు మొదటి విడత పనుల పూర్తికి రూ.142 కోట్లు, ఏలేరు, సుద్దగెడ్డ ఆధునికీకరణకు రూ.150 కోట్లు విడుదల చేసేసినట్టు చెప్పారు. గతేడాది పర్యటనలో కాండ్రకోట-తూర్పుపాలికల హైలెవెల్‌ బ్రిడ్జికి రూ.4కోట్లు ఇచ్చేసినట్లు కలరింగ్‌ ఇచ్చారు. కాండ్రకోట పరిధిలో ఏలేరు కాలువపై డ్రాప్‌ కం బెడ్‌ రెగ్యులేటర్‌ పునర్మిర్మాణానికి రూ.6 కోట్లు ప్రకటించారు.అయితే ప్రకటనలే.. కాగితాలపై పనులు మూలుగుతున్నాయి. సామర్లకోట జూనియర్‌ కాలేజీని డిగ్రీ కాలేజీగా మార్చడానికి రూ.18 కోట్లు ఇచ్చేస్తున్నట్టు సీఎం చప్పట్లు కొట్టించుకుని ప్రకటించారు. కానీ ఫైలే సిద్ధం కాలేదు. కాకినాడలో మంచినీటి సమస్య పరిష్కారానికి రూ.47కోట్లు ఇచ్చేసినట్లు చెప్పారు. కానీ నిధులకు అతీగతీ లేదు. ఇలా ఒకటేంటి నోటికి వచ్చిన హామీని సీఎం హోదాలో అలవోకగా వదిలేశారు. ఐదేళ్లయినా అవి కదలక హామీలకు చెదలు పట్టాయి.

గోదారిలో..వరద హామీలు..

ముమ్మిడివరం/ఐ.పోలవరం, ఏప్రిల్‌ 18: జగన్‌ సీఎం అయ్యాక డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో సుమారు రూ.380.26 కోట్లతో చేసిన పలు శంకుస్థాపనలు, హామీలు నేటికీ కార్యరూపం దాల్చలేదు. మత్స్యకార దినోత్సవం సందర్భంగా 2022 మే 13న ఐ.పోలవరం మండలం మురమళ్ల బహిరంగ సభలో సీఎం జగన్‌ కాట్రేనికోన మండలం పల్లంకుర్రు-ఐ.పోలవరం మండలం జి.మూలపొలం మధ్య వృద్ధ గౌతమి నదీపాయపై రూ.76.90 కోట్లతో వారథి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఐ.పోలవరం మండలం గుత్తెనదీవి-భైరవలంక (గోగుల్లంక) గ్రామాల మధ్య వృద్ధ గౌతమి నదీపాయపై వారఽథి నిర్మాణానికి రూ.44.50 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఐ.పోలవరం మండలం రామాలయం పేట వద్ద నదీకోత నివారణకు 1.200 కిలోమీటర్ల మేర రివిట్‌మెంట్‌, గ్రోయిన్ల నిర్మాణానికి రూ.79.76 కోట్లతో శంకుస్థాపన చేశారు. ఆ పనులను ఇటీవలే ప్రారంభించినా నత్తనడకన సాగుతున్నాయి. గతేడాది జూలై నెలలో వరదలు సంభవించగా ఆగస్టు 8న జగన్‌ ముమ్మిడివరం, అయినవిల్లి మండలాల్లోని లంక గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. నదీకోత నివారణకు గురజాపులంక, లంకాఫ్‌ ఠాణేలంక, కూనాలంక, పళ్లవారిపాలెం వివేకానంద వారఽథి వద్ద, అయినవిల్లి మండలం కొండుకుదురులంక, పొట్టిలంకల్లో 3,700 మీటర్ల మేర రివిట్‌మెంట్‌, గ్రోయిన్ల నిర్మాణానికి రూ.150 కోట్లు నుంచి రూ.200 కోట్లు విడుదల చేస్తున్నట్టు ప్రకటించినా అవి ఇంతవరకూ విడుదల కాలేదు.

నాడు.. నేడు.. ఇంతేగా!

పి.గన్నవరం/మామిడికుదురు, ఏప్రిల్‌ 18: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరం హైస్కూల్‌లో 2021 ఆగస్టు 16న జరిగిన నాడు-నేడు మొదటి దశ పనుల ప్రారంభోత్సవ బహిరంగ సభలో ఎమ్మెల్యే చిట్టిబాబు అభ్యర్థన మేరకు సీఎం జగన్‌ పలు హామీలు గుప్పించారు. అప్పనపల్లి ఎత్తిపోతల పథకం, అయినవిల్లి మండలంలో ఎదురుబిడిం కాజ్‌వే నిర్మాణం, మొండెపులంక ఈస్ట్‌ చానల్‌ ఆధునికీకరణ పనులకు హామీ ఇచ్చారు.అప్పనపల్లి ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.40కోట్ల నుంచి రూ.45 కోట్లు వ్యయం అవుతుందని సంబంధిత అధికారులు అంచనాలు రూపొందించారు. ఐదు లంక గ్రామాల్లో 15 కిలోమీటర్ల మేర పంటకాల్వ ఏర్పాటు చేసి 4,035 ఎకరాల విస్తీర్ణంలోని కొబ్బరి తోటలకు ప్రయోజనం చేకూరేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కానీ అవి కాగితాలకే పరిమితమయ్యాయి. 2022 వరదల తర్వాత లంక గ్రామాల ప్రజలకు గంటి పెదపూడిలో వంతెన నిర్మిస్తామని, బూరుగులంక రక్ష ణకు గ్రోయిన్ల నిర్మాణం చేపడతామన్నారు. నేటికీ అయినవిల్లి మండలం అయినవిల్లిలంకలో తొగరపాయ ఎదురుబిడిం కాజ్‌వే ఆధునికీకరణ పనుల ఊసేలేదు. ఆర్‌అండ్‌బీ అధికారులు రూ.13 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఇప్పటి వరకు పరిపాలనాపరమైన ఆమోదం రాలేదు.2022లో వరదల అనంతరం బూరుగులంక వచ్చిన సీఎంకు మహిళలు తమ ప్రాంతం నదీకోతకు గురవుతోందని, గ్రోయిన్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని కలెక్టర్‌ను ఆదేశించారు. మరుసటి రోజే హెడ్‌వర్క్స్‌ అధికారులు నదీకో తకు గురవుతున్న ప్రాంతాలను గుర్తించి సుమారు 450 మీటర్ల మేర గ్రోయిన్ల నిర్మాణానికి రూ.28 కోట్లు నిధులు అవసరమవుతాయని ప్రభుత్వానికి నివేదిక పంపించారు. కానీ నేటి వరకు వాటి ఊసేలేదు.

పోలవరం..పరిహారమేది

గోకవరం, ఏప్రిల్‌ 18: జగన్‌ హామీ ఇస్తారు.. ఆనక మర్చి పోతారనుకుంటా.. ఆయనకు దేవుడిచ్చిన గొప్పవరం అది.. సీఎం జగన్‌ హామీ ఇచ్చారంటే.. అమలు చేయరంతే అన్న ట్టుగా ఉంది పరిస్థితి. వైఎస్‌ఆర్‌ హయాంలో మం జూరుకా బడిన పోలవరం ఎడమ కాలువ తవ్వకానికి భూములు త్యాగం చేసిన సుమారు 70 నుంచి 80 మంది రైతులకు అప్పట్లో పూర్తి న్యాయం జరగలేదు. పోలవరం కాలువ తవ్వి సుమారు 20 సంవత్సరాలు కావొస్తుంది. 2005 భూసేకరణ చట్టం ప్రకారం బాధితులకు అన్యాయం జరిగింది. మీకు అప్పట్లో జరిగిన అన్యాయాన్ని నేను పూడుస్తాను. 2013 పార్ల మెంట్‌లో భూసేకరణ చట్టంలో చేసిన మార్పులు చేర్పు లు ప్రకారం మీ అందరికీ న్యాయం చేస్తాను. అప్పట్లో అందుకున్న నష్టపరిహారానికి చేర్చి ఎకరాకి మొత్తం రూ.5 లక్షలు గిట్టుబాటు అయ్యేలా నష్టపరిహారం చెల్లిస్తానంటూ సుమారు మూడేళ్ళ కిందట ఏజెన్సీ ప్రాంతమైన దేవీపట్నం మండలం ఇందుకూరు విచ్చేసిన సీఎం జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ నేటికీ నెరవేరలేదు. ఆ హామీ ఎప్పటికి అమలవుతుందంటూ రైతులు వెయ్యి కళ్ళతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

జగనన్న ఇళ్లు.. పేదలకు కన్నీళ్లు

(కాకినాడ,ఆంధ్రజ్యోతి)/సామర్లకోట, ఏప్రి ల్‌ 18: వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న ఇళ్ల పథ కం జగన్‌పై నమ్మకాన్ని వమ్ము చేసింది. కాకినాడ సిటీలోని 13,500 మందికి జగన్‌ ప్రభుత్వం స్థలాల కొరత సాకుతో యు.కొత్తపల్లి మండలం కొమరగిరిలో పట్టాలిచ్చింది. 2020 డిసెంబర్‌ 25న సీఎం జగన్‌ కొమరగిరి లేఅవుట్‌ ప్రారంభించారు. తాజాగా సముద్రం పోటుకు నీళ్లు ఏకంగా ఈలేఅవుట్‌ స్థలాలు, ఇళ్లకు సమీపంగా రావడంతో బెంబేలెత్తిపోతున్నారు .ఇక్కడ 365 ఎకరాలు ప్రైవేటు భూములను ఎకరం రూ.25 లక్షల చొప్పున సదరు కీలక నేత బినామీలతో భూములు కొనిపించారు. ఆ తర్వాత ప్రభుత్వానికి ఎకరాకు రూ.41 లక్షల చొప్పున అంట గట్టారు.రూ.145 కోట్లకుపైగా కొట్టేశారు. 13,500 మందికిపైగా కాకినాడ సిటీ నియోజకవర్గ లబ్ధిదా రులకు పట్టాలు పంచి నాలుగేళ్లవుతున్నా ఇక్కడ పూర్తయిన ఇళ్లు కేవలం 180 మాత్రమే. 10 వేలకు పైగా వివిధ దశల్లో ఆగిపోయాయి. సామర్లకోట మండలంలో 7,537 గృహాలు మంజూరు కాగా వాటిలో 1,174 గృహాలు మాత్రమే పూర్తి చేశారు. గతేడాది జగన్‌ ఇక్కడకు వచ్చి సామూ హిక గృహప్రవేశాలు చేపట్టినా అంతా పైపై బడాయే. రాష్ట్రస్థాయి గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌గా పదవి అధిరోహించిన దవులూరి దొరబాబు స్థానికుడైనా ఇక్కడే ఈ పథకం బోర్లాపడింది.

పట్టణాభివృద్ధి నిధులేవి సారూ!

పిఠాపురం/గొల్లప్రోలు,ఏప్రిల్‌ 18: మాట తప్పను... మడమ తిప్పను... ఇది సీఎం జగన్‌ ప్రతిచోటా చెప్పే మాట. ఆచరణలో మాత్రం మాట చెబితే మడం తిప్పుడే. పట్టణాల అభివృద్ధికి ప్రత్యేక గ్రాంట్లు ఇస్తామన్న మాటలు ఫైళ్లు దాటలేదు. 21 నెలలు గడిచినా ఒక్క రూపాయి విడుదల కాలేదు. పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు పట్టణం లో జరిగిన కాపు నేస్తం సభలో పాల్గొనేందుకు సీఎం జగన్‌ 2022 జూలై 28న వచ్చారు.ఆ సభలో గొల్లప్రోలు పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు, పిఠాపురం పట్టణాభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. ఏయే పనులు చేపట్టాలో నిర్ణయించుకుని అంచనాలు తీసుకొస్తే తక్షణం నిధులు విడుదల చేస్తామన్నారు. ఇంజనీరింగ్‌ అధికారులు అంచ నాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి 20 నెలలు గడిచినా నేటికీ ఒక్క రూపాయి విడుదల కాలేదు.

Updated Date - Apr 19 , 2024 | 12:46 AM