Share News

ఇకనైనా..తెరుస్తారా!

ABN , Publish Date - Jun 09 , 2024 | 12:55 AM

ఉన్నతాశయం.. ఉన్నతాధికా రులు..పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది..రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ ప్రీ-పెయిడ్‌ ఆటో బూత్‌ పట్టించుకోకపోవడంతో డంపింగ్‌ యార్డును తలపిస్తోంది.

ఇకనైనా..తెరుస్తారా!
రైల్వే స్టేషన్‌లో చెత్తతో నిండి ఉన్న ప్రీపెయిడ్‌ ఆటో బూత్‌

రాజమహేంద్రవరం, జూన్‌ 8(ఆంధ్రజ్యోతి): ఉన్నతాశయం.. ఉన్నతాధికా రులు..పాలకుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతోంది..రైల్వే స్టేషన్‌లో ఏర్పాటు చేసిన పోలీస్‌ ప్రీ-పెయిడ్‌ ఆటో బూత్‌ పట్టించుకోకపోవడంతో డంపింగ్‌ యార్డును తలపిస్తోంది. రాజమండ్రి రైల్వే స్టేషనుకు పగటి కంటే రాత్రి వేళల్లో ఎక్కువ సంఖ్యలో రైళ్లు వస్తుంటాయి. ప్రతి రోజూ సుమారు 120 రైళ్లు నడుస్తుండగా 10 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటా రు. పర్వదినాల్లో ఆ సంఖ్య రెట్టింపు ఉంటుంది. కోణార్క్‌, ముంబై కాకినాడ, సంత్రాగచి సికింద్రాబాద్‌, ఈస్ట్‌కోస్ట్‌ తదితర రైళ్లు అర్ధరాత్రి వేళల్లో వస్తుం టాయి.ఆ సమయాల్లో ప్రయాణికులు.. ముఖ్యంగా మహిళలు, చిన్న పిల్లలతో వచ్చేవారు,వృద్ధులు ఇంటికి చేరుకోవడానికి భద్రతపరంగా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఉండేది. నగర శివారు ప్రాంతాలకు వెళ్లాలంటే భయపడే వారు. దీంతో ఉదయం వరకూ రైల్వే స్టేషన్‌లోనే వేచి ఉండి తెల్లారిన తర్వాత వెళ్లేవారు. ఈ పరిస్థితిని గమనించి టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017 మార్చి 29న రైల్వే స్టేషన్‌లో ఆటో ప్రీపెయిడ్‌ బూత్‌ ఏర్పాటు చేశారు. దీనికి అప్పటి ఎస్పీ బి.రాజకుమారి ప్రత్యేక చొరవ చూపించారు.ఈ బూత్‌లో 24 గంటలూ పోలీసులు ఉండేవారు. ప్రయాణికులు ఆటో కోరితే పోలీసులు ఆ ఆటో నెంబరు, డ్రైవరు ఫోన్‌ నెంబరు తీసుకొని సీరియల్‌ విధానంలో పం పించేవాళ్లు.ఆయా ప్రాంతాలకు నిర్ధారిత కిరాయి ముందుగానే కంప్యూటర్‌లో పొందుపరచడం తో పోలీసులే డబ్బులు తీసుకొని ప్రయాణికులకు రశీదు ఇచ్చేవారు. దీంతో ప్రయాణికులకు భద్రతపై భరోసా ఉండేది. అర్ధరాత్రి సమయంలో ఒంటరి మహిళలు హాయిగా ఇంటికి చేరుకునేవారు. అయితే కరోనా సంక్షోభంలో ఈ బూత్‌ మూతపడింది.ఆ తరువాత పట్టించుకోలేదు. ఈ బూత్‌ని పునఃప్రారంభించాలని సుమారు ఏడాది కిందట ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో శుభ్రం చేసి హడావుడి చేశారు. కానీ తర్వాత సిబ్బంది కొరతను కారణంగా చూపుతూ మళ్లీ గాలికొదిలేశారు. ప్రస్తుతం పోలీస్‌ ప్రీపెయిట్‌ ఆటో బూత్‌ లోపల, బయటా చెత్తతో దుర్వాసన వస్తోం ది.సదుపాయం ఉన్నప్పటికీ ఉపయోగంలోకి తీసుకురాలేకపోవడంపై ప్రయా ణికులు మండిపడుతున్నారు.ఎన్‌ఎస్‌జీ-2 హోదా పొందిన ఈ స్టేషన్‌లో ప్రీ-పెయిడ్‌ ఆటో బూత్‌ డంపింగ్‌ యార్డుగా మారడంపై విస్తుపోతున్నారు.

Updated Date - Jun 09 , 2024 | 12:55 AM