Share News

శానిటేషన్‌ నిర్వహణ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

ABN , Publish Date - Feb 28 , 2024 | 12:44 AM

శానిటేషన్‌ నిర్వహణ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

 శానిటేషన్‌ నిర్వహణ లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు

ముమ్మిడివరం, ఫిబ్రవరి 27: శానిటేషన్‌ సక్రమంగా చేయడం లేదు.. దోమల నిర్మూలనకు ఫాగింగ్‌ చేపట్టడం లేదు.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.. ముక్కు పిండి పన్నులు వసూలు చేస్తున్నాం.. ఆ స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కరించలేకపోతున్నామని టీడీపీ కౌన్సిలర్‌ అడబాల సతీష్‌కుమార్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ సమావేశం మంగళవారం చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో కౌన్సిలర్‌ సతీష్‌ మాట్లాడుతూ పేరుకు నగర పంచాయతీ అయినా సౌకర్యాలు మాత్రం ప్రజలు కల్పించలేకపోతున్నామని ఆవేదన చెందారు. దీనిపై శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ జె.సత్యనారాయణరాజు స్పందించి రోజువారీ కార్మికులు 15మందిని తొలగించడం వల్ల కొద్ది రోజులు పారిశుధ్య సమస్య తలెత్తిందని, మళ్లీ రోజువారీ కార్మికల నియామకానికి అనుమతులు లభించడంతో ఎనిమిది మందిని నియమించామని, పారిశుధ్య సమస్య పరిష్కారం అవుతుందన్నారు. ఫాగింగ్‌ మిషన్‌ పనిచేయడం లేదని, మిషన్‌కు మరమ్మతులుచేసి సమస్యను పరిష్కరిస్తామని ఏఈ పేర్కొన్నారు. నగర పంచాయతీని అభివృద్ధి చేయలేకపోతున్నామని పేర్కొనగా చైర్మన్‌ కమిడి ప్రవీణ్‌కుమార్‌ స్పందించి అత్యవసర పనులు ప్రాధాన్యతా క్రమంలో పూర్తి చేస్తున్నామని, అయితే అభివృద్ధి జరగడం లేదని ప్రతిపక్షాలు కౌన్సిల్‌ సమావేశంలో అనవసర రాద్దాంతం చేస్తున్నాయని, వాస్తవానికి మెరుగైన అభివృద్ధి జరిగిందన్నారు. వార్డుల్లో గ్రావెల్‌తో రోడ్డు మరమ్మతులు చేపట్టే పనులు ఎంత వరకు వచ్చాయని కౌన్సిలర్‌ సతీష్‌కుమార్‌ కమిషనర్‌ జి.వెంకట్రామిరెడ్డిని ప్రశ్నించారు. దీనిపై చైర్మన్‌ ప్రవీణ్‌కుమార్‌ స్పందించి అవినీతి, అక్రమాలు చోటు చేసుకున్నాయని ప్రతిపక్ష సభ్యులు ఆరోపించడం వల్లే ఆ పనులు నిలిపివేశామని, వాస్తవానికి ఆ ఆరోపణలో ఎక్కడా అవినీతి లేదన్నారు. ఆ గ్రావెల్‌తో రోడ్లకు మరమ్మతులు చేస్తే బావుంటుందని సతీష్‌కుమార్‌ పేర్కొన్నారు. మార్కెట్‌లో వాహనాలు నిలిపే ప్రదేశంలో బహిరంగంగా పశు మాంసాల విక్రయాలు జరుపుతున్నారని సతీష్‌కుమార్‌ అన్నారు. చేపలు, మాంసం వ్యర్థాలను ప్రధాన రోడ్డుపక్కనే పడవేస్తున్నారని సతీష్‌కుమార్‌, గంజా శ్రీనివాస్‌లు సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. వాటిపై చర్యలు తీసుకుంటామని కమిషనర్‌ హామీ ఇచ్చారు. సమావేశంలో వివిధ పనులకు సంబంధించి ఒకటో పద్దు కింద రూ.4,11,136 ఆదాయం రాగా రూ.13,02,204 ఖర్చుగాను, రెండో పద్దు కింద వివిధ పద్దుల నుంచి రూ.3,55,128 ఆదాయం రాగా, రూ.8,02,419 ఖర్చుగాను ప్రవేశపెట్టిన తీర్మానాన్ని కౌన్సిల్‌ సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. సమావేశంలో వైస్‌ చైర్మన్‌ వేటుకూరి బోసురాజు, కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Feb 28 , 2024 | 12:44 AM